Begin typing your search above and press return to search.

టార్గెట్ కుప్పం సాధ్యమేనా ?

By:  Tupaki Desk   |   28 April 2022 7:30 AM GMT
టార్గెట్ కుప్పం సాధ్యమేనా ?
X
వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా కుప్పంలో చంద్రబాబు నాయుడును ఓడించటమే టార్గెట్ గా జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు పన్నుతున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని అనేక వేదికలపై ప్రస్తావించారు. కానీ తాజాగా చేసిన వ్యాఖ్యలు మాత్రం కీలకమనే చెప్పాలి. మంత్రులు, జిల్లాల అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయ కర్తలతో కీలకమైన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లూ గెలిచి తీరాలని గట్టిగా చెప్పారు.

మొన్నటి ఎన్నికల్లో 151 సీట్లు గెలిచిన పార్టీ వచ్చే ఎన్నికల్లో అంతకన్నా ఎక్కువ తెచ్చుకోకపోతే ఎలాగ ? అన్ని ప్రశ్నించారు. గడచిన మూడేళ్ళల్లో సంక్షేమ పథకాలకు రు. 1.37 లక్షల కోట్లు, రాబోయే రెండేళ్లలో ఇంకో లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నట్లు చెప్పారు.

ఇంత పెద్దఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేసిన తర్వాత కూడా సింపుల్ గా అధికారంలోకి వస్తే సరిపోతుందా ? అంటూ నిలదీశారు. మళ్ళీ అధికారంలోకి రావటం ముఖ్యం కాదని 151 సీట్లు సాధించటమే గొప్పన్నారు. 151 సీట్లు సాధించే క్రమంలో 175 సీట్లలో ఎందుకు గెలవదన్నారు.

కుప్పంలో చంద్రబాబును ఓడించ గలిగితే 175 సీట్ల గెలవటం పెద్ద కష్టమేమీ కాదన్నారు. గత ఎన్నికలకు వచ్చే ఎన్నికలకు కచ్చితంగా తేడా ఉండాలన్నారు. పోయిన ఎన్నికల్లో కుప్పంలోని స్ధానిక సంస్ధలు, మున్సిపాలిటీ మనకు లేదు కదా అని ప్రశ్నించారు. కానీ ఇపుడు లోకల్ బాడీలు మొత్తం వైసీపీ చేతిలో ఉన్నపుడు రేపటి అసెంబ్లీ ఎన్నికను మాత్రం వైసీపీ ఎందుకు గెలవదని ప్రశ్నించారు. చంద్రబాబును వచ్చే ఎన్నికల్లో ఓడించటమే లక్ష్యంగా జగన్ పావులు కదుపుతున్నది వాస్తవం.

ఇందులో భాగంగానే సంక్షేమ పథకాలు కుప్పం నియోజకవర్గంలో నూరుశాతం అమలయ్యేందుకు ప్రత్యేకంగా బాధ్యతలిచ్చారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంఎల్సీ భరత్ లాంటి వాళ్ళు రెగ్యులర్ గా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.

సామాజిక వర్గాల వారీగా సమావేశాలు పెడుతున్నారు. చంద్రబాబును ఓడించటమే టార్గెట్ గా వ్యూహాలు పన్నుతున్నారు. చంద్రబాబే ఓడిపోయే పరిస్ధితి ఉంటే జగన్ టార్గెట్ రీచవుతారా ? మరి దీన్ని చంద్రబాబు ఎలా ఎదుర్కొంటారన్నది ఆసక్తిగా మారింది.