Begin typing your search above and press return to search.

వైసీపీ దూకుడు.. టీడీపీకి చెడుగుడు

By:  Tupaki Desk   |   17 Feb 2017 1:34 PM GMT
వైసీపీ దూకుడు.. టీడీపీకి చెడుగుడు
X
వైసీపీ అధినేత జగన్ సహా ఆ పార్టీ నేతలంతా కొద్దికాలంగా మళ్లీ వేగం పెంచారు. అధికార పార్టీపై అంశాలవారీగా ఎదురుదాడికి దిగుతున్నారు. దీంతో సీఎం చంద్రబాబునాయుడుకు ముచ్చెమటలు పడుతున్నాయి. గత నెలలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై విశాఖపట్నం ఆర్కే బీచ్ లో విద్యార్థులు నిర్వహించిన నిరసన కార్యక్రమానికి జగన్ మోహన్ రెడ్డి హాజరుకావడానికి విశాఖ ఎయిర్ పోర్ట్ లో దిగడం, ప్రభుత్వం అడ్డుచెప్పడం, పోలీసులతో బలవంతంగా హైదరాబాద్ కు తిప్పిపంపడంతో వైసీపీ ప్రతిష్ట, జగన్ మోహన్ రెడ్డి ప్రాబల్యం బాగా పెరిగింది. ప్రజల నుంచి సానుభూతి ఎక్కువైంది. అప్పటివరకు నామమాత్రమైన కార్యక్రమాలతో ముందుకెళ్లిన వైసీపీ విశాఖ పరిణామాలు అనంతరం ప్రజల నుంచి వచ్చిన సానుభూతి ప్రోత్సాహంతో వైఎస్ జగన్ కు కొండంత బలం వచ్చినట్లైంది. దీనిపై సొంతవర్గాల ద్వారా రాష్ట్ర నలుమూలల నుంచి సమాచారం తెప్పించుకున్న జగన్ తెలుగుదేశం ప్రభుత్వంపై ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని, ప్రత్యేక హోదా అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తే ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని తెలుసుకున్నారు.

దీంతో పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేయటం, ప్రత్యేక హోదా అంశాన్ని విద్యార్థులు - యువజనులు - మేధావుల వరకూ తీసుకెళ్లి వారిని భాగస్వాములను చేయాలని నిర్ణయించారట. దీనిలో భాగంగానే గురువారం నాడు గుంటూరులో విద్యార్థులతో యువభేరి కార్యక్రమాన్ని నిర్వహించారు. యువభేరిలో పాల్గొన్న విద్యార్థులంతా ప్రత్యేక హోదా అంశంపై పూర్తి సంఘీభావం ప్రకటించారు. కేంద్రంలోని బీజేపీ - ఏపీలోని టీడీపీ ప్రభుత్వాలపై ప్రజలు తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోశారు. దీంతో వైఎస్ జగన్ లో ఉత్సాహం రెట్టింపు అయింది. నిత్యం ప్రజల్లో ఉండటం, ప్రత్యేక హోదా అంశాన్ని తెలుగుదేశం ప్రభుత్వం ఎలా నీరుగారుస్తుందో వివరించడం ద్వారా ప్రజల సానుభూతిని మరింత పొందడానికి జగన్ మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. దీంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కలవరపడుతున్నారు.

ప్రత్యేక హోదా అంశాన్ని పూర్తిగా పక్కనపెట్టేసిన చంద్రబాబు ఇప్పుడు వైసీపీ ఇంకా దాన్ని ఫోర్సులోనే ఉంచుతుండడంతో కంగారు పడుతున్నారట. ప్రత్యేక హోదా అంశంపై రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నారు. దీన్ని ప్రజల మనస్సుల నుంచి తొలగించటం ఇప్పట్లో అయ్యే పనికాదు. ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి జగన్ కూడా హోదా కోసం పోరాడుతున్నారు. వైసీపీ పోరాటం తమకు ఇరకాటంగా మారుతుండడంతో చంద్రబాబు దీన్ని అడ్డుకోవడానికి ప్లాన్లు వేస్తున్నారట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/