Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ యాక్ష‌న్ ప్లాన్ స్టార్ట్ అయ్యింది!

By:  Tupaki Desk   |   11 Sep 2017 8:44 AM GMT
జ‌గ‌న్ యాక్ష‌న్ ప్లాన్ స్టార్ట్ అయ్యింది!
X
2019లో జరిగే శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించడమే ధ్యేయంగా వైఎస్సార్ సీపీ అడుగులు వేస్తోందండి. దీని కోసం రాష్ర్టంలోని ప్రతి ఇంటికీ వైఎస్సార్ కుటుంబం పేరుతో నేటి (సెప్టెంబర్ 11) నుంచి ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతోంది. మొత్తం 20 రోజులపాటు ఈ కార్యక్రమం ఉంటుందంట. పార్టీ నేతలు - క్రియాశీలక కార్యకర్తలు ఇందులో పాల్గొని తెలుగుదేశం మూడున్నరేళ్ల పాలనలో జరిగిన అరాచకాలను ఎండగడతారంట. ఇందులో భాగంగా ఒక్కో గ్రామంలో 10 మంది బూత్ కమిటీ సభ్యులు ఉంటే ఒక్కొక్కరు రోజుకు కనీసం రెండు కుటుంబాలను కలుస్తారట. ప్రతి ఇంట్లో ఆ సభ్యుడు 20 నిమిషాలపాటు కూర్చుని తెలుగుదేశం మూడున్నరేళ్ల పాలనకు సంబంధించి రూపొందించిన 100 ప్రశ్నలకు వారితో మార్కులు వేయించాలి.

అదే సమయంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన గురించి, ఆయన చేపట్టిన సంక్షేమ - అభివృద్ధి పథకాల గురించి ప్రజలకు విడమరిచి చెబుతారంట. తర్వాత వైఎస్సార్ కుటుంబంలో చేరడానికి 9121091210 నంబర్ కు మిస్డ్ కాల్ ఇచ్చి వెంటనే పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో మాట్లాడిస్తారంట. ఇటీవల జరిగిన వైఎస్సార్ సీపీ మూడో ప్లీనరీలో భాగంగా పార్టీ అధినేత వైఎస్ జగన్ ఈ మేరకు పార్టీ నేతలకు - కార్యకర్తలకు పిలుపునిచ్చిన సంగతి మీకు గుర్తుండే ఉంటుంది. ఆ ప్లీనరీలో వైఎస్ జగన్ మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే నవరత్నాలు పేరుతో పథకాలు ప్రవేశపెడతామని చెప్పిన సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా రైతు భరోసా - వైఎస్ ఆర్ ఆసరా - పెన్షన్లు - అమ్మ ఒడి - గృహ నిర్మాణం - ఆరోగ్య శ్రీ - ఫీజు రీయింబర్స్ మెంట్ - పథకాలను ఆయన ప్రకటించారు. దాదాపు దీన్నే ఎన్నికల మ్యానిఫెస్టోగా భావించవచ్చు. పార్టీ నేతలు కూడా నిన్నమొన్నటివరకు నవరత్నాల పేరిట అసెంబ్లీ నియోజకవర్గాల్లో కార్యక్రమాలను నిర్వహించారు. వీటికి ప్రజల నుంచి భారీ స్పందన లభించడంతో ఆ పార్టీ రెట్టించిన ఉత్సాహంతో వైఎస్సార్ కుటుంబం పేరిట మరో ప్రత్యేక కార్యక్రమానికి తెరతీసింది.