Begin typing your search above and press return to search.

గ్రామ వాలంటీర్లకు జగన్ రాసిన లేఖలో ఏముంది?

By:  Tupaki Desk   |   10 Feb 2021 4:11 AM GMT
గ్రామ వాలంటీర్లకు జగన్ రాసిన లేఖలో ఏముంది?
X
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మానసపుత్రికల్లో ఒకటి గ్రామ వాలంటీర్ల వ్యవస్థ. మరే రాష్ట్రంలో లేని విధంగా తాను అధికారంలోకి వచ్చినంతనే ఈ విధానాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. వేలాది మందిని గ్రామ వాలంటీర్లుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే.. సదరు గ్రామ వాలంటీర్లు తమ వేతనాలు పెంచాలని ఆందోళన చేపట్టారు. ఇదే డిమాండ్ అంతకంతకూ ముదురుతోంది. ఇలాంటివేళ.. గ్రామ వాలంటీర్లకు స్పష్టత ఇచ్చేలా సీఎం జగన్ తాజాగా ఒక బహిరంగ లేఖ రాశారు.

జీతాలు పెంచాలని కొంతమంది గ్రామ.. వార్డు వాలంటీర్లు డిమాండ్ చేస్తున్న విషయం తన వరకు వచ్చిందన్న సీఎం జగన్.. వాస్తవాలతో నిమిత్తం లేకుండా వారు రోడ్డు ఎక్కటం తననెంతో బాధించిందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని గ్రామ.. వార్డు వాలంటీర్లకు ఇస్తున్నది జీతం కాదని.. గౌరవ భ్రతిగా అభివర్ణించారు. ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ఉండేందుకే ఈ మొత్తాన్ని ఇస్తున్నామన్నారు.

లంచాలు.. వివక్ష లేని వ్యవస్థ కోసమే వాలంటీర్ల నియామకం చేపట్టామన్నారు. ప్రభుత్వం అందించే పౌరసేవల్ని ప్రజల ఇంటి వద్దకే అందించేందుకు ఈ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. అన్ని ప్రాంతాల్లో వాలంటీర్లను ఆప్తులుగా.. ఆత్మీయులుగా చూసుకుంటామన్నారు. ఈ పనిని జీతం కోసం చేస్తే ఇలాంటి గౌరవం దక్కదనేది తన వ్యక్తిగత అభిప్రాయమని.. గొప్పగా సేవలు అందిస్తున్న వాలంటీర్లకు సమాజం నమస్కరిస్తుందన్నారు.

ఈ విధానంలో అత్యుత్తమ సేవలు అందించిన వారికి నియోజకవర్గాల వారీగా ప్రతి ఏడాది ఒక రోజున మంత్రులు.. ఎమ్మెల్యేలు.. కలెక్టర్లు.. ఎస్పీల సమక్షంలో శాలువా కప్పి అవార్డు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు పేర్కొన్నారు. వాలంటీర్ల వ్యవస్థ లేకుండా చేయాలన్న దూరాలోచనతో కొందరు కుట్రలు పన్నుతున్నారని.. ప్రలోభాలకు గురి కాకుండా వాటికి దూరంగా ఉండాలన్న అభిలాషను వ్యక్తం చేశారు. చెప్పాల్సిన మాటను చెప్పేయటమే కాదు.. కాదని మొండికేస్తే ఏం జరుగుతుందన్న విషయాన్ని చెప్పేస్తూ.. చివర్లో శ్రేయోభిలాషిగా విన్నవించుకుంటానని చెప్పిన జగన్ మాటలకు గ్రామ.. వార్డు వాలంటీర్లు ఏలా స్పందిస్తారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.