Begin typing your search above and press return to search.

జగన్ ఆ రెండు టీజింగ్ లు ఆపేస్తేనే మనుగడ

By:  Tupaki Desk   |   27 Dec 2022 12:00 PM IST
జగన్ ఆ రెండు టీజింగ్ లు ఆపేస్తేనే మనుగడ
X
రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు కామన్. ఒకప్పుడు పొలిటికల్ లీడర్స్ ఎదుటి వాళ్లను విమర్శలు చేసినా అందంగా ఉండేది. అంతేకాకుండా పలు ఆధారాలతో సహా ఆరోపణలు చేసేవారు. కానీ ఇప్పటి నాయకులు విమర్శ.. అన్న విషయం మరిచిపోయి తిట్ల దండకం అలవాటు చేసుకుంటున్నారు. ఇవి వ్యక్తిగతంగా ధూషించడం వరకు వెళ్తున్నాయి. ఎదుటివాళ్లను బూతులు తిట్టడం.. వారి కుటుంబ సభ్యులపై రకరకాల వ్యాఖ్యలు చేయడం ఇప్పటి రాజకీయ నాయకులు ఫ్యాషన్ అనుకుంటున్నారు. కానీ నైతికంగా వారికిది చెడ్డపేరే అన్న విషయం గ్రహించడం లేదు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతిపక్ష పార్టీ నాయకులే కాకుండా అధికారంలో ఉన్న వారు సైతం బూతులు వాడడం పలు విమర్శలకు దారి తీస్తోంది. ఇటీవల ఏపీ సీఎం జగన్ ప్రతిపక్ష నాయకులను విమర్శించినప్పుడు.. వారిని వ్యక్తిగతంగా దూషించడంపై తీవ్ర చర్చ సాగుతోంది. ఇవి ఎప్పటికైనా ఆయనకు ప్రమాదకరమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఏ రాష్ట్రంలోనైనా అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తూ ఉంటాయి. అయితే వీటిలో ప్రజోపకరమైన వాటికి స్పందించాల్సి ఉంటుంది. అంతేకాకుండా వారికి సరైన సమాధానం ఇవ్వడం ద్వారా ప్రజలు సైతం సంతృప్తి చెందుతారు. కానీ ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలపై సమాధానం ఇవ్వడం దెవుడెరురు.. వారిపై తిట్ల దండకం ఉపయోగించడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. అయితే ఇది రాజకీయంగా ఎలా ఉన్నా పర్వాలేదు.. కానీ వ్యక్తిగతంగా వెళ్లేసరికి అసహనం కలిగిస్తుంది.

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి విమర్శలు రాజకీయంగా కాకుండా వ్యక్తిగతంగా ఉంటున్నాయని చాలా మంది ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా రాజకీయాలతో సంబంధం లేనివాళ్లను బజార్లకీడుస్తున్నారని అంటున్నారు. అయితే విశ్లేషకులు చెబుతున్న ప్రకారం ప్రభుత్వానికి సంబంధించి ఎవరెన్ని ఆరోపణలు చేసినా వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికార పార్టీపై ఉంటుంది. అప్పుడే ప్రజల్లో ప్రభుత్వానిపై నమ్మకం ఏర్పడుతుంది. అంతేకానీ విమర్శకు ప్రతి విమర్శ అని అలవర్చుకోవడం కరెక్ట్ కాదని అంటున్నారు.

మాజీ సీఎం చంద్రబాబు విషయంలో జగన్ అదే చేశారు. ఆయనపై ఆరోపణలు కాకుండా తన సతీమణిపై చేసిన వాఖ్యలు దుమారం లేపాయి. ఈ విషయంలో 14 ఏళ్లు సీఎం పనిచేసిన ఆయన కన్నీళ్లు పెట్టుకోవడం సామాన్యులను కూడా ఆలోచింపజేసింది. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ విషయంలోనూ జగన్ అదే మిస్టేక్ చేస్తున్నారు. ఆయనపై కాకుండా ఆయన మూడుపెళ్లిళ్లు చేసుకున్నారంటూ పదే పదే విమర్శిస్తున్నారు. దీనిపై కూడా కొంత మంది అసహనం వ్యక్తం చేస్తున్నారు.

అభివృద్ధిపై ఒకరిపై ఒకరు ఎన్ని ఆరోపణలైనా చేయొచ్చు. అవసరమైతే నిరసనలు తెలపవచ్చు. కానీ వ్యక్తిగత ధూషణలకు వెళ్లడం ద్వారా ఎవరికి ప్రయోజనం అని అంటున్నారు. ప్రతిపక్షాలను వ్యక్తిగతంగా విమర్శించడం వల్ల సామాన్యులకు ఒరిగేదుమిటని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం ప్రజల కోసం అభివృద్ధి పనులు చేస్తూ వాటిపై చర్చించాలని, ఈ చర్చలో ఇతరులకు అవకాశం ఇచ్చి సమాధానం చెప్పాలని అంటున్నారు. అంతేగానీ.. ఇలాంటి దూషణలు ఎప్పటికైనా ప్రమాదకరమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.