Begin typing your search above and press return to search.

ఆ నేత‌కు లైన్ క్లీయ‌ర్ చేసేసిన జ‌గ‌న్ ?

By:  Tupaki Desk   |   9 Aug 2021 1:30 PM GMT
ఆ నేత‌కు లైన్ క్లీయ‌ర్ చేసేసిన జ‌గ‌న్ ?
X
ఔను.. ఇప్పుడు అనంత‌పురం జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం వైసీపీ నేత‌లు ఇదే మాట అంటున్నారు. ``జ‌గ‌న్ చాలా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించారు`` అనే వారు పెరిగారు. అదేస‌మ‌యంలో మ‌రికొంద‌రు.. క‌ర్ర విర‌క్కుండా.. పాము చావ కుండా.. జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రించార‌నే కామెంట్లు వినిపిస్తున్నారు. విష‌యంలోకి వెళ్తే.. హిందూపురం నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ ప‌డుతూ లేస్తూ ఉంది. వ‌రుస విజ‌యాల‌తో ఇక్క‌డ టీడీపీ దూసుకుపోయింది. ఈ క్ర‌మంలో వైసీపీ నేత‌లు క‌లిసిక‌ట్టుగా ముందుకు సాగాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. వైసీపీ అదిష్టానం చెబుతున్నా.. ప‌ట్టించుకునే వారు క‌నిపించ‌డం లేదు.

వాస్త‌వానికి హిందూపురం టీడీపీకి కంచుకోట‌. గ‌తంలో పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్టీఆర్ ఇక్క‌డ నుంచి విజ‌యం ద‌క్కించుకున్నారు. ద‌రిమిలా ఇక్క‌డ పార్టీకి పునాదులు బ‌ల‌డ్డాయి. అంతేకాదు.. గ‌తంలో కాంగ్రెస్ లోని విబేధాలు, ఆ త‌ర్వాత వైసీపీలో అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు కూడా టీడీపీకి క‌లిసి వ‌చ్చాయి. చ‌రిత్ర‌ను ప‌రిశీలిస్తే. 2004లో వైఎస్ హ‌వా ముందు టీడీపీ ఇక్క‌డ ఓట‌మి చెందాల్సి ఉంది. అయిన‌ప్ప‌టికీ.. కాంగ్రెస్ అభ్య‌ర్థిగా బ‌రిలో నిలిచిన న‌వీన్ నిశ్చ‌ల్ ఓట‌మి పాల‌య్యారు. ఆ త‌ర్వాత 2009లో న‌వీన్ నిశ్చ‌ల్ కు కాంగ్రెస్ టికెట్ ద‌క్క‌లేదు. దీంతో ఇండిపెండెంట్ గా పోటీ చేసి.. రెండో స్థానం ద‌క్కించుకున్నారు.

త‌ర్వాత రాష్ట్ర విభ‌జ‌న ఎఫెక్ట్‌తో న‌వీన్‌.. వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్ర‌మంలోనే 2014లో టికెట్ ద‌క్కించుకున్నా టీడీపీ త‌ర‌ఫున బాల‌కృష్ణ బ‌రిలో నిల‌వ‌డంతో న‌వీన్ బ‌ల‌మైన పోటీ ఇచ్చినా.. ఓడిపోయారు. కానీ, ఆ త‌ర్వాత ప‌రిణామాలు మ‌ళ్లీ మారాయి. 2019 ఎన్నిక‌ల నాటికి న‌వీన్‌ను ప‌క్క‌న పెట్టిన జ‌న‌గ్‌.. ఇక్బాల్ ను హిందూపురం అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించారు. దీంతో న‌వీన్ తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఓ వ‌ర్గం మీడియాను పిలిచి.. త‌న‌కు పార్టీలో గుర్తింపు లేకుండా పోతోంద‌ని కామెంట్లు కూడా చేశారు. ఇక్బాల్‌తో అంటీముట్ట‌న‌ట్టే వ్య‌వ‌హ‌రించారు. అయిన‌ప్ప‌టికీ.. జ‌గ‌న్ అప్ప‌ట్లో ప‌ట్టించుకోలేదు.

కానీ, ఇప్పుడు అనూహ్యంగా న‌వీన్‌కు నామినేటేడ్ పోస్టు క‌ట్ట‌బెట్టారు. ఏపీ ఆగ్రో డెవ‌ల‌ప్ మెంట్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ ప‌ద‌వి ఇచ్చారు. దీంతో న‌వీన్ ఒకింత ఖుషీ అయ్యారు. పార్టీ కోసం క‌ష్ట‌ప‌డినందుకు త‌న‌కు ఆ ప‌ద‌వి ద‌క్కింద‌న్నారు. అయితే.. న‌వీన్‌కు ప‌ద‌విని ఇవ్వ‌డం వెనుక జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించార‌నేది ప‌రిశీల‌కుల మాట‌. ఇక్బాల్‌కు న‌వీన్‌కు రాజ‌కీయ వివాదాలు కొన‌సాగుతున్న నేప‌థ్యంలో న‌వీన్‌ను నామినేటెడ్ ప‌ద‌విలో నియ‌మించ‌డం ద్వారా.. ఇద్ద‌రు నేత‌ల మ‌ధ్య వివాదాన్ని త‌గ్గించ‌డం ఒక విజ‌యంగా పేర్కొంటున్నారు. అదేస‌మ‌యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో న‌వీన్‌ను ప‌క్క‌న పెట్టి.. మ‌ళ్లీ ఇక్బాల్‌కే చాన్స్ ఇచ్చినా.. త‌న‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌నే వాద‌న‌ను న‌వీన్ ఇక, వినిపించే అవ‌కాశం లేకుండా చేశార‌ని అంటున్నారు.