Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు థింక్ ట్యాంక్ గా మారిన జగన్

By:  Tupaki Desk   |   27 April 2021 10:52 AM GMT
కేసీఆర్ కు థింక్ ట్యాంక్ గా మారిన జగన్
X
దేశంలో చాలామంది ముఖ్యమంత్రులు ఉన్నప్పటికీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కున్న ఇమేజ్ కాస్త భిన్నమైనది. ఆయనకు సీఎం అన్న పేరుతో పాటు.. మేధావి అన్న ట్యాగ్ ఉంది. అంతేనా.. ఆయన తీసుకునే నిర్ణయాలు.. అమలు చేసే పథకాలు వినూత్నంగా ఉండటమే కాదు.. పలు రాష్ట్రాలు ఆయన్నుపాలో అవుతుంటాయి. కొన్ని పథకాలు అయితే.. కేంద్రం సైతం ఫాలో కావటం తెలిసిందే. అలాంటి కేసీఆర్ కు ఇటీవల కాలంలో ఐడియాలు బొత్తిగా కరవైపోతున్నాయా? అన్నది సందేహంగా మారింది.

కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్న వేళ.. యమా స్పీడ్ గా నిర్ణయాలు తీసుకోవాల్సిన కేసీఆర్ సర్కారు అందుకు భిన్నంగా చాలా నెమ్మదిగా నిర్ణయాలు తీసుకోవటం తెలిసిందే. రాష్ట్ర హైకోర్టు రంగంలోకి దిగి.. తీవ్రంగా చివాట్లు పెట్టిన తర్వాత కానీ నైట్ కర్ఫ్యూ నిర్ణయాన్ని వెల్లడించలేదు. అంతేనా? తమ రాష్ట్ర ప్రజలకు ఉచితంగా టీకా అందిస్తామన్న ప్రకటనను ఏపీ ముఖ్యమంత్రి జగన్ చేసిన తర్వాత కానీ.. కేసీఆర్ కు ఆ ఐడియా రాలేదు.

ఏపీ సీఎం నిర్ణయం తీసుకున్న రోజు తర్వాత.. మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం.. రాష్ట్రంలోని అందరికి ఉచితంగా వ్యాక్సిన్ వేస్తామని.. తమకు డబ్బులు ముఖ్యం కాదని ప్రజల ప్రాణాలే ప్రధానమంటూ పేర్కొన్నారు. ఇలా ప్రతి విషయంలోనూ వెనుకబడిపోయిన ఆయన.. తాజాగా సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని మరోసారి ఫాలో అయ్యారు.

కేంద్రం పాలసీకి భిన్నంగా.. తమకు అవసరమైన వ్యాక్సిన్లను తామే సమకూర్చుకోవటానికి వీలుగా ఆ మధ్యన ఏపీ సీఎం టీకాలు తయారు చేస్తున్న సీరం.. భారత్ బయోటెక్ సంస్థల యజమానులతో ఫోన్లో మాట్లాడి.. తమ అవసరాలకు అనుగుణంగా టీకాలు సప్లై చేయాలని కోరారు. తాజాగా కేసీఆర్ అలాంటి పనే చేయటం ఆసక్తికరంగా మారింది. జగన్ మాట్లాడిన ఇన్నిరోజుల తర్వాత.. సారు ఆదేశాలకు అనుగుణంగా.. భారత బయోటక్ ఎండీతో చర్చలు నిర్వహించారు సీఎస్ సోమేశ్ కుమార్.
తెలంగాణ రాష్ట్రంలో ఉచిత వ్యాక్సిన్లు ఇస్తున్న వేళ.. అందుకు అవసరమైన డోసులు సరఫరా కోసం భారత్ బయోటెక్ ప్రతినిధులతో భేటీ అయ్యారు సోమేశ్. ఈ విన్నపంపై భారత్ బయోటెక్ సంస్థ ఎండీ సానుకూలంగా స్పందించినట్లు చెబుతున్నారు. అయితే.. ఈ సమావేశానికి మూలమైన సీఎం జగన్ ఐడియాను.. మరోసారి కేసీఆర్ ఫాలో కావటం ఆసక్తికరంగా మారింది. ఇదంతా చూసినప్పుడు ఇటీవలకాలంలో కేసీఆర్ థింక్ ట్యాంక్ ఏపీ సీఎం జగన్ అయినట్లుగా అనిపించక మానదు.