Begin typing your search above and press return to search.

భువనేశ్వర్ వెళ్లిన జగన్.. ఒడిశా సీఎంతో ఏం మాట్లాడారు?

By:  Tupaki Desk   |   10 Nov 2021 5:31 AM GMT
భువనేశ్వర్ వెళ్లిన జగన్.. ఒడిశా సీఎంతో ఏం మాట్లాడారు?
X
ఏపీకి ఎంతో మంది సీఎంలు అయ్యారు. ఏళ్లకు ఏళ్లుగా సరిహద్దు రాష్ట్రమైన ఒడిశాతో ఉన్న పంచాయితీల లెక్క తేల్చే ప్రయత్నం ఎవరూ చేయలేదు. అందుకు భిన్నంగా ఏపీ సీఎం చొరవ తీసుకున్న వైనం కొత్త రోజులకు తెర తీసే అవకాశాన్ని కల్పిస్తోంది. రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రయోజనాల లక్ష్యంగా.. ఇరు రాష్ట్రాల మధ్యనున్న ఇష్యూల లెక్క తేల్చటానికి వీలుగా రెండురాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కావటమే కాదు.. వీరి మధ్య చర్చలు సానుకూల వాతావరణంలో సాగినట్లుగా చెబుతున్నారు. దాదాపు ఆరు దశాబ్దాలుగా సాగుతున్న పలు వివాదాలకు చెక్ చెప్పేలా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో సమావేశాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహించారు.

వంశధార.. జంఝూవతి జల వివాదాలు.. సరిహద్దు సమస్య.. బలిమెల.. అప్పర్ సీలేరులో జల విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలతో పాటు.. ఎన్ వోసీలో చోటు చేసుకున్న పరిణామాలను ఎలా డీల్ చేయాలన్న అంశాలపైనా ఇరువురు ముఖ్యమంత్రులు మాట్లాడుకున్నారు. రెండు రాష్ట్రాల ప్రయోజనాలకు అనుగుణంగా తాము నిర్ణయాలు తీసుకోవాలని వారు నిర్ణయం తీసుకున్నారు. మావో కార్యకలపాలతో పాటు.. గంజాయి సాగుకు చెక్ పెట్టే కార్యాచరణను రూపొందిచారు.

ఏపీ-ఒడిశా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో జాయింట్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లుగా చర్చల అనంతరం పేర్కొన్నారు. రెండురాష్ట్రాల మధ్య ఉన్న అంశాలకు సంబంధించి ఇరువురు ముఖ్యమంత్రులు మాట్లాడుకున్నారు. వారి మధ్య చర్చకు వచ్చిన అంశాల్ని చూస్తే..

- జంఝావతిలో లభ్యతగా ఉన్న 8 టీఎంసీల్లో చెరి సగం వాడుకునేలా రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదరటం.. ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టిన వైనాన్ని ఒడిశా సీఎంకు జగన్ చెప్పారు. ఈ ప్రాజెక్టు కారణంగా ఒడిశాలో ముంపునకు గురయ్యే భూమి.. ఇళ్లను కోల్పోయే వారికి నష్టపరిహారాన్ని ఏపీ చెల్లిస్తుంది.

- రబ్బర్ డ్యాం స్థానంలో కాంక్రీట్ డ్యామ్ నిర్మాణాన్ని చేపట్టి జంఝూవతి ద్వారా పూర్తిస్థాయిలో 24,500 ఎకరాల ఆయుకట్టుకు నీళ్లు అందించే వీలు ఉంటుంది.

- పోలవరం ప్రాజెక్టులో గరిష్ట స్థాయిలో 45.72 మీటర్లలో 194.6 టీఎంసీలను నిల్వ చేసినా ఒడిశాలో ముంపు సమస్య తలెత్తకుండా సీలేరు, శబరిపై కరకట్టలు నిర్మిస్తాం. ఇందుకు ఒడిశా సహకరించాలి.

- బాహుదా రిజర్వాయర్‌ నుంచి ఇచ్చాపురానికి నీటి విడుదల విషయంలో మీరు (నవీన్‌ పట్నాయక్‌) సహకారం అందించాలి.

- బలిమెల, అప్పర్‌ సీలేరులో విద్యుత్‌ ప్రాజెక్టుల నిర్మాణం.. రెండు రాష్ట్రాల సరిహద్దులో కొఠియా గ్రామాల సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుందాం.

- సరిహద్దు జిల్లాల్లోని విద్యా సంస్థల్లో ఒడిశాలో తెలుగు.. ఏపీలో ఒడియాకు సంబంధించిన లాంగ్వేజ్ టీచర్లను నియమించుకుందాం. పాఠ్యపుస్తకాల పంపిణీ చేపడదాం.

- రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి రెండు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శకులతో జాయింట్ కమిటీ ఏర్పాటు చేసుకునేందుకు ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య ఒప్పందం కుదిరింది.