Begin typing your search above and press return to search.

ఓన్లీ వన్స్.. దగ్గుబాటికి జగన్ అల్టీమేటం..

By:  Tupaki Desk   |   11 Oct 2019 5:13 AM GMT
ఓన్లీ వన్స్.. దగ్గుబాటికి జగన్ అల్టీమేటం..
X
వైసీపీలో కొనసాగుతున్న సీనియర్ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎట్టకేలకు సీఎం జగన్ అపాయింట్ మెంట్ సంపాదించారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జోక్యంతో బుధవారం జగన్ అపాయింట్ మెంట్ దక్కించుకొని కుమారుడు హితేష్ కలిసి జగన్ ను కలిశారు.

ఈ సందర్భంగా జగన్ సీనియర్ నేత దగ్గుబాటికి స్పష్టం చేసినట్టు తెలిసింది. ‘భార్య ఒక పార్టీలో.. భర్త ఒక పార్టీలో కుదరదని.. పురంధేశ్వరి సైతం వైసీపీలో చేరాలని’ కుండబద్దలు కొట్టినట్టు తెలిసింది. అలా చేరితే దగ్గుబాటిని - ఆయన కుమారుడిని రాజకీయంగా ప్రోత్సహిస్తామని.. పురంధేశ్వరికి మంచి పదవి ఇస్తామని జగన్ హామీ ఇచ్చినట్టు తెలిసింది.

పోయిన 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పురంధేశ్వరి బీజేపీలో కొనసాగుతూ విశాఖ ఎంపీగా పోటీచేశారు. జగన్ ను, వైసీపీని తీవ్రంగా విమర్శించారు. ఇక దగ్గుబాటి, ఆయన కుమారుడు హితేష్ వైసీపీలో చేరారు. దగ్గుబాటి ప్రకాశం జిల్లా పర్చూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేశారు. ఓడిపోయారు.

అయితే తాజాగా జగన్ పర్చూర్ నియోజకవర్గానికి చెందిన రామనాథం బాబును తిరిగి వైసీపీలో చేర్చుకున్నారు. దగ్గుబాటి రాకతో ఆయన వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఇప్పుడు మళ్లీ ఆయనను వైసీపీలోకి చేర్చి పర్చూరు బాధ్యతలు అప్పజెప్పారు.

దీనిపై మథనపడ్డ దగ్గుబాటి ఎట్టకేలకు జగన్ ను కలిశారు. బీజేపీలో ఉంటూ పురంధేశ్వరి వైసీపీ ప్రభుత్వాన్ని, జగన్ ను తిడుతోందని.. భర్త వైసీపీలో ఉంటూ భార్య బీజేపీలో ఉంటే తప్పుడు సంకేతాలు వెళతాయని జగన్ స్పష్టం చేసినట్టు తెలిసింది.

దీంతో ప్రస్తుతం పురంధేశ్వరి అమెరికాలో ఉందని.. ఆమె రాష్ట్రానికి వచ్చాక మాట్లాడి ఏం నిర్ణయమైనా తెలియజేస్తామని సీఎం జగన్ తో దగ్గుబాటి చెప్పినట్టు తెలిసింది. సో ఇప్పుడు బాల్ దగ్గుబాటి కోర్టులో ఉంది. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపైనే వారి రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉంది.