Begin typing your search above and press return to search.

మంత్రుల‌కు వైఎస్ జ‌గ‌న్ లేటెస్ట్ వార్నింగ్ - ప‌దవులు ఊస్టే!

By:  Tupaki Desk   |   4 March 2020 1:00 PM GMT
మంత్రుల‌కు వైఎస్ జ‌గ‌న్ లేటెస్ట్ వార్నింగ్ - ప‌దవులు ఊస్టే!
X
ఏపీ మంత్రుల‌కు ముఖ్య‌మంత్రి వైఎస్ జగ‌న్ మోహ‌న్ రెడ్డి ఒక ఆస‌క్తిదాయ‌క‌మైన హెచ్చ‌రిక‌ను జారీ చేసిన‌ట్టుగా తెలుస్తోంది. స్థానిక ఎన్నిక‌ల‌కు అన్ని ర‌కాలుగానూ లైన్ క్లియ‌ర్ అయిన నేప‌థ్యంలో.. వాటిల్లో పార్టీ విజ‌యం గురించి జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు చేసిన‌ట్టుగా స‌మాచారం. ప్ర‌త్యేకించి పార్టీని గెలిపించే బాధ్య‌త పూర్తిగా మంత్రుల మీద ఉంటుంద‌ని జ‌గ‌న్ తేల్చి చెప్పిన‌ట్టుగా తెలుస్తోంది. ఏ మంత్రి నియోజ‌క‌వ‌ర్గంలో అయినా స్థానిక ఎన్నిక‌ల్లో పార్టీ ఓడిపోయిందంటే.. ఆ మంత్రి రాజీనామాకు రెడీగా ఉండాల‌ని జ‌గ‌న్ ఆదేశించిన‌ట్టుగా స‌మాచారం.

స్థానిక ఎన్నిక‌లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్ర‌తిష్టాత్మ‌కంగా మారాయి. పార్టీ అధికారంలోకి వ‌చ్చిన దాదాపు ప‌ది నెల‌ల‌కు ఈ ఎన్నిక‌లు జ‌రగ‌బోతున్నాయి. ఇలాంటి నేప‌థ్యంలో జ‌గ‌న్ పాల‌న‌పై ప్ర‌జాతీర్పులా మార‌నున్నాయి ఈ ఎన్నిక‌లు. ఈ ప‌ది నెల‌ల కాలంలో అనేక కీల‌క‌మైన నిర్ణ‌యాల‌ను తీసుకున్నారు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. వాటిపై తెలుగుదేశం పార్టీ ర‌క‌ర‌కాల వ్యాఖ్యానాలు చేస్తూ వ‌స్తోంది.

స్థానిక ఎన్నిక‌ల్లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ బంప‌ర్ మెజారిటీలో స‌త్తా చాటితే..అప్పుడు తెలుగుదేశం ప్ర‌చారం త‌ప్ప‌ని తేలుతుంది. జ‌గ‌న్ నిర్ణ‌యాల‌కు ప్ర‌జామోదం ఉంద‌ని స్ప‌ష్టం అవుతుంది. ఇలా మున్సిప‌ల్, -ఎంపీటీసీ - జ‌డ్పీ ఎన్నిక‌లు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి కీల‌క‌మైన‌విగా మారాయి. ఇలాంటి నేఫ‌థ్యంలో పార్టీ అధికారంలోకి వ‌చ్చాకా మంత్రి ప‌ద‌వులను అనుభ‌విస్తున్న వారికి జ‌గ‌న్ సూటిగా హెచ్చ‌రిక‌లు చేసిన‌ట్టుగా తెలుస్తోంది.

అలాగ‌ని ఎమ్మెల్యేల‌ను కూడా జ‌గ‌న్ వ‌ద‌ల‌డం లేద‌ట‌. ఏయే నియోజ‌క‌వ‌ర్గాల్లో అయితే పార్టీ స్థానిక ఎన్నిక‌ల్లో స‌రిగా రాణించ‌దో - అలాంటి చోట ఎమ్మెల్యే అభ్య‌ర్థిత్వాల విష‌యంలో వ‌చ్చేసారి మార్పు ఉంటుంద‌ని జ‌గ‌న్ కుండ‌బ‌ద్ధ‌లు కొడుతున్న‌ట్టుగా స‌మాచారం!