Begin typing your search above and press return to search.

లాంఛనం పూర్తి చేసిన దాడి వీరభద్రరావు!

By:  Tupaki Desk   |   9 March 2019 10:28 AM GMT
లాంఛనం పూర్తి చేసిన దాడి వీరభద్రరావు!
X
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రీ ఎంట్రీ విషయంలో దాడి వీరభద్రరావు లాంఛనం పూర్తి చేశారు. ఈయన వైఎస్సార్ కాంగ్రెస్ లోకి చేరవచ్చని గత కొన్నాళ్లుగా ఊహాగానాలున్నాయి. చివరకు అవి నిజం అయ్యాయి. జగన్ ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

గత ఎన్నికల ముందు కూడా దాడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో దాడి వీరభద్రరావు తనయుడు రత్నాకర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేశారు. అయితే ఓటమి పాలయ్యారు. దీంతో వీరు పార్టీ కార్యకలాపాలకు దూరం అయ్యారు. తెలుగుదేశం పార్టీ కూడా దాడిని మళ్లీ చేర్చుకునేందుకు ఉత్సాహం చూపించిందని అంటారు. ఎందుకో దాడి మళ్లీ అటు వెళ్లలేదు.

ఎన్నికల నేపథ్యంలోమళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో దాడి చేరారు. ఈ ఎన్నికల్లో కూడా వీరు అసెంబ్లీ టికెట్ అడుగుతున్నట్టుగా భోగట్టా. అయితే అనకాపల్లి నుంచి దాడి వీరభద్రరావును ఎంపీగా పోటీ చేయించాలి అనేది జగన్ ఆలోచనగా తెలుస్తోంది.

దాడికి చిరకాల ప్రత్యర్థి అయిన కొణతాల రామకృష్ణ అనకాపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీగా బరిలోకి దిగడం ఖరారు అయ్యింది. ఈ నేపథ్యంలో దాడి వీరభద్రరావును అక్కడ నుంచి బరిలోకి దించాలని జగన్ భావిస్తున్నారు. ఇన్ని రోజులూ రాజకీయంగా నిస్తేజంగా కనిపించిన కొణతాల , దాడిలు ఒకేసారి రాజకీయంగా యాక్టివేట్ కావడం విశేషం.

కొణతాల ఇంకా తెలుగుదేశం పార్టీలోకి చేరలేదు. అయినా కూడా ఆయనకు అనకాపల్లి ఎంపీ టికెట్ ను ఖరారు చేసేశారట చంద్రబాబు. ఈ చిరకాల ప్రత్యర్థులు అనకాపల్లిలో పోటీ పడుతుండటం రసవత్తరంగా మారుతోంది.