Begin typing your search above and press return to search.

జగన్ నయా ఆలోచన...ఏపీ ఇక హరితాంధ్రే

By:  Tupaki Desk   |   25 Jun 2019 4:21 AM GMT
జగన్ నయా ఆలోచన...ఏపీ ఇక హరితాంధ్రే
X
హరితం... అందరి నోటా వినిపించే అందమైన పదం. ఏపీ వాళ్లు హరితాంధ్రప్రదేశ్ అంటే... తెలంగాన వాళ్లు హరిత తెలంగాణ అంటారు. ఇక రెండు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు - మంత్రులు హరితం మాటకొచ్చేసరికి సింగిల్ స్టెప్ లోనే రాష్ట్రాన్ని హరితవనంలా మార్చేస్తామని చెప్పేస్తారు. వినడానికి ఇది బాగానే ఉంటుంది గానీ.. ఆచరణలో మాత్రం ఘోరంగా విఫలమవుతుంటారు. ఇదేదో ఒక్క రాష్ట్రానికే చెందిన వైనం కాదు... అందరికీ వర్తించేదే. అయితే ఏపీకి నూతన సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఈ విషయంలో తాను మాటల సీఎంను కాదని తేల్చేశారు. మొక్కలను నాటడంతో పాటుగా వాటిని సంరక్షించే బాధ్యతను కూడా తీసుకుంటానంటూ సోమవారం ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా ఇంటరెస్టింగ్ గానే ఉన్నాయని చెప్పక తప్పదు.

తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా హరిత తెలంగాణ దిశగా పెద్ద ఎత్తున ప్రచారం చేసి కోట్లాది మొక్కలను నాటేశారు. అయితే వాటి సంరక్షణను మరిచారు. ఫలితంగా తెలంగాణలో నాటిన మొక్కలన్నీ ఎండిపోయాయి. ఇక ఏపీలోనూ చంద్రబాబు హయాంలో కేవలం ప్రకటనలకు పరిమితమైన ప్రభుత్వం... కొన్ని చోట్ల మొక్కలను నాటినా.. వాటిని సంరక్షించే బాధ్యతను మాత్రం మరిచింది. దీంతో ఏపీలో కూడా ఈ పథకం పెద్దగా సక్సెస్ కాలేదనే చెప్పాలి. అయితే ఇప్పుడు ఈ విషయంలో జగన్ అనుసరిస్తున్న వ్యూహంతో ఏపీ హరితాంధ్రప్రదేశ్ గా మారిడం ఖాయమేనన్న వాదన వినిపిస్తోంది.

అయినా హరితం దిశగా ఏం మాట్లాడారన్న విషయానికి వస్తే... రాష్ట్రంలోని ప్రతి పౌరుడు ఒక మొక్కను నాటాలని చెప్పిన జగన్... రాష్ట్రంలోని 5 కోట్ల మంది పౌరులు 5 కోట్ల మొక్కలను నాటాలన్నదే తన ఆలోచనగా చెప్పారు. ఈ బృహత్కార్యాన్ని గ్రామ వలంటీర్లుగా కొత్తగా బాధ్యతలు చేపట్టబోయే వారిని భాగస్వాములును చేయాలని కూడా ఆయన కలెక్టర్లకు సూచించారు. స్కూళ్లు - ఆసుపత్రుల్లో చెట్లను నాటేలా చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. పౌరులు నాటే చెట్ల సంరక్షణ బాధ్యతలను సీఎస్ ఆర్ కింద పరిశ్రమలకు ఇవ్వాలని సూచించారు. మొత్తంగా రాష్ట్రంలో మొక్కలను నాటడం - వాటి సంరక్షణను పక్కాగా చేపట్టడం ద్వారా రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేందుకు అందరూ కంకణం కట్టుకోవాలని జగన్ సూచించారు. అంటే... బాబు కలగన్న హరితాంధ్రప్రదేశ్ కలను జగన్ సాకారం చేసేందుకు రంగంలోకి దిగిపోయినట్టేనన్న మాట.