Begin typing your search above and press return to search.

ఆ నేత ఇంటికి జ‌గ‌న్‌!..ఆల్ ఈజ్ వెల్ సంకేత‌మేనా?

By:  Tupaki Desk   |   14 March 2019 8:23 AM GMT
ఆ నేత ఇంటికి జ‌గ‌న్‌!..ఆల్ ఈజ్ వెల్ సంకేత‌మేనా?
X
ఏపీలో అటు సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌తో పాటు ఇటు అసెంబ్లీ ఎన్నిక‌లు కూడా జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఇప్పుడు అంద‌రి దృష్టి ఎన్నిక‌లకు సంబంధించి ఆయా పార్టీలు తీసుకుంటున్న నిర్ణ‌యాల‌పైనే ఉంది. ఇప్ప‌టికే టికెట్ల ఖ‌రారులో నిండా త‌ల‌మున‌క‌లైపోయిన పార్టీలు... ఎక్క‌డ అస‌మ్మ‌తి త‌లెత్తుతుందోన‌న్న భ‌యంలో చాలా జాగ్ర‌త్త‌గానే వ్య‌వ‌హారాలు న‌డుపుతున్నాయి. అయితే రాజ‌కీయాల‌న్నాక అస‌మ్మ‌తి లేకుండా ఉంటుందా? త‌ప్ప‌క ఉండే తీరుతుంది. ఇందుకు నిలువెత్తు నిద‌ర్శ‌నం అమ‌రావతిలోని టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు అధికారిక నివాసం. నిత్యం ఆయా జిల్లాల నేత‌ల నిర‌స‌న‌ల‌తో హోరెత్తుతున్న ప్ర‌జా వేదిక‌... టీడీపీలోని అస‌మ్మ‌తిని చెప్ప‌క‌నే చెబుతోంది. అయితే ఇదే త‌ర‌హా ప‌రిస్థితి విప‌క్ష వైసీపీలోనూ ఇప్పుడిప్పుడే క‌నిపిస్తున్నా... టీడీపీలో ఉన్నంత‌గా లేద‌నే చెప్ప‌క త‌ప్ప‌దు. ఇందుకు కార‌ణం ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అనుస‌రిస్తున్న వ్యూహ‌మే కార‌ణ‌మ‌ని చెప్పాలి.

రాష్ట్రంలో తూర్పు గోదావ‌రి జిల్లాకు ఓ ప్ర‌త్య‌క స్థానం ఉంది. తెలుగు నేల‌లో అత్య‌ధిక సంఖ్య‌లో సీట్ల‌ను క‌లిగిన ఈ జిల్లాలో ఏ పార్టీకి మెజారిటీ సీట్లు ద‌క్కుతాయో - అదే పార్టీ రాష్ట్రంలో అధికారం చేప‌డుతుంద‌న్న సెంటిమెంట్ కూడా ఉంది. ఇంత‌టి కీల‌క జిల్లాకు సంబంధించి వైసీపీలో అస‌మ్మ‌తి మాటే వినిపించ‌డం లేదు. అధికార పార్టీ టీడీపీకి ఈ జిల్లాలో చాలా చోట్ల అభ్య‌ర్థులే క‌రువైన నేప‌థ్యంలో వైసీపీ మాత్రం చాలా తెలివిగా నెట్టుకు వ‌స్తోంది. ఇందులో జ‌గ‌న్ అనుస‌రిస్తున్న వ్యూహం మంచి ఫ‌లితాల‌ను ఇచ్చింద‌ని కూడా వార్త‌లు వినిపిస్తున్నాయి. అస‌లు ఈ వ్యూహం ఏమిట‌న్న విష‌యానికి వ‌స్తే... ఈ జిల్లా ప్రాధాన్యాన్ని - సెంటిమెంట్ ను గుర్తించిన జ‌గ‌న్‌... జిల్లాలో ఎక్క‌డ కూడా అసంతృప్తి త‌లెత్త‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. ఈ క్ర‌మంలో రాజ‌మ‌హేంద్ర‌వ‌రానికి చెందిన కీల‌క నేత‌ల మ‌ధ్య విభేదాలు ఉన్నా... వారిద్ద‌రిలో ఏ ఒక్క‌రు కూడా రోడ్డెక్క‌కుండా చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించార‌ని చెప్పాలి.

రాజ‌మ‌హేంద్ర‌వ‌రం సిటీ కో-ఆర్డినేట‌ర్‌ గా మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్య‌ప్ర‌కాశ్ రావు ఉన్నారు. ఈ ద‌ఫా ఆ టికెట్ కూడా ఆయ‌న‌కేన‌ని వాద‌నా లేక‌పోలేదు. ఈ వాద‌న‌తోనే ఆయ‌న పని చేసుకుంటూ పోతున్నారు. ఇలాంటి త‌రుణంలో మొన్న జిల్లాకు వ‌చ్చిన జ‌గ‌న్ నేరుగా రౌతుకు రాజ‌కీయ బ‌ద్ధ విరోధిగా పేరుప‌డ్డ ఏపీఐఐసీ మాజీ చైర్మ‌న్ శ్రీ‌ఘాకోళ్ల‌పు సుబ్ర‌హ్మ‌ణ్యం ఇంటికి స్వ‌యంగా వెళ్లారు. జ‌గ‌న్ రాజ‌మ‌హేంద్ర‌వ‌రం ప‌ర్య‌ట‌న‌లో భాగంగా శ్రీ‌ఘాకోళ్ల‌పు వైసీపీలో చేరిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ చేరిక పార్టీ బ‌హిరంగ స‌భ‌లో కాకుండా శ్రీ‌ఘాకోళ్ల‌పు ఇంటిలో జ‌రిగింది. జ‌గ‌నే స్వ‌యంగా శ్రీ‌ఘాకోళ్ల‌పు ఇంటికెళ్లారు. ఆయ‌న‌కు పార్టీ కండువా క‌ప్పారు. జ‌గ‌న్ పర్య‌ట‌న నేపథ్యంలో త‌న మ‌న‌సులో ఉన్న మాట‌ను శ్రీ‌ఘాకోళ్ల‌పు పార్టీ నేత‌ల ద్వారా జ‌గ‌న్‌ కు తెలియ‌జేశార‌ట‌. శ్రీ‌ఘాకోళ్ల‌పు లాంటి సీనియ‌ర్లు పార్టీలోకి వ‌స్తే ఎలా కాదంటామన్న జ‌గ‌న్‌... ఆయ‌న చేరిక‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు.

అదే స‌మ‌యంలో ఆయ‌న‌ను పార్టీలో చేర్చుకుంటే రౌతు ఇబ్బంది ప‌డ‌తారేమోన‌ని కూడా జ‌గ‌న్ ఆలోచించారు. ఈ క్ర‌మంలో పార్టీలో చేరినా... ఈ ద‌ఫా సీటివ్వ‌లేన‌ని - అధికారంలోకి రాగానే గౌర‌వ‌ప్ర‌ద‌మైన ప‌ద‌వి ఇస్తానంటూ రాయ‌బారం నెర‌పేందుకే జ‌గ‌న్‌... శ్రీ‌ఘాకోళ్ల‌పు ఇంటికి వెళ్లార‌ట‌. ఈ మాట చెప్పించేందుకు త‌న స‌న్నిహితుల‌ను కూడా పంపే వీలున్నా... తానే స్వ‌యంగా వెళితే... శ్రీ‌ఘాకోళ్లపు లాంటి సీనియ‌ర్లు ఎలాంటి అభ్యంత‌రాలు వ్య‌క్తం చేయ‌లేర‌ని జ‌గ‌న్ అంచ‌నా వేశార‌ట‌. ఆ వ్యూహం ప్ర‌కారమే జ‌గ‌న్ ప్ర‌తిపాద‌న‌కు అక్క‌డిక‌క్క‌డే ఓకే చెప్పేసిన శ్రీ‌ఘాకోళ్ల‌పు... టికెట్ ఇవ్వ‌కున్నా ఫ‌ర‌వా లేదు... పార్టీలో చేర‌తానంటూ ముందుకొచ్చార‌ట‌. ఈ త‌ర‌హా వ్యూహంతో ముందుకు సాగుతున్న జ‌గ‌న్‌... పార్టీలో అస‌మ్మ‌తి రేకెత్త‌కుండా జాగ్ర‌త్త ప‌డుతున్నార‌ట‌.