Begin typing your search above and press return to search.

ఆక్వా ఇష్యూలో బాబు త‌ప్పులు చెప్పిన జ‌గ‌న్‌

By:  Tupaki Desk   |   19 Oct 2016 11:09 AM GMT
ఆక్వా ఇష్యూలో బాబు త‌ప్పులు చెప్పిన జ‌గ‌న్‌
X
ప్ర‌స్తుతం ఏపీలో పెద్ద హాట్ టాపిక్‌ గా మారిన ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా భీమ‌వ‌రంలో ఏర్పాటు చేస్తున్న గోదావ‌రి ఆక్వా ఫుడ్ పార్క్ ప్రాంతాన్ని విప‌క్ష నేత వైకాపా అధ్య‌క్షుడు జ‌గ‌న్ బుధ‌వారం సంద‌ర్శించారు. ఈ పార్క్ బాధిత ప్రాంతాల రైతులు - ప్ర‌జ‌ల‌తో మాట్లాడిన అనంత‌రం - ఎప్ప‌టిలాగానే చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగారు. తాము పార్క్ ఏర్పాటుకి వ్య‌తిరేకం కాదంటూనే ప్ర‌భుత్వ చ‌ర్య‌లను తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శించారు. ముఖ్యంగా పార్క్ విష‌యంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం నాలుగు త‌ప్పులు చేసింద‌ని చెప్పిన జ‌గ‌న్‌.. అవేమిటో కూడా వివ‌రించారు. గ్రామస్తులు వద్దని చెప్పినా గ్రామం మధ్యలో ఫ్యాక్టరీ పెట్టడం మొదటి తప్పని - అమాయాకులపై హత్యాయత్నం కేసులు పెట్టడం ఇంకో తప్పని - గ్రామాల్లో భయాందోళనలు సృష్టించి గ్రామస్తుల్ని భయభ్రాంతులకు గురి చేయ‌డం మూడో త‌ప్ప‌ని, గ్రామాల్లో 144 సెక్షన్ పెట్టడం నాలుగో తప్పని జ‌గ‌న్ అన్నారు.

ఇక‌, ఆక్వా పార్క్ విష‌యంలో ఆందోళ‌న బాట‌ప‌ట్టిన మ‌హిళ స‌త్య‌వ‌తిపై ప్ర‌భుత్వం క‌క్ష క‌ట్టింద‌ని విమ‌ర్శించారు. ఆవిడ ఏం త‌ప్పు చేసింద‌ని జైల్లో పెట్టార‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు. అంతేకాకుండా, ప్ర‌స్తుతం తణుకు సబ్ జైల్లో ఉన్న సత్యవతిని కూడా జ‌గ‌న్ ప‌రామ‌ర్శించారు. త‌మ పార్టీ ఆమెకు పూర్తిగా అండ‌గా ఉంటుంద‌ని ఆమెకు హామీ ఇచ్చిన జ‌గ‌న్‌.. రాష్ట్ర ప్ర‌భుత్వ తీరుపై తీవ్ర‌స్థాయిలో ఫైర‌య్యారు. సత్యవతి చేసిన తప్పేంటని - కాలుష్యాన్ని అరికట్టాలని కోరిన వారిపై హత్యాయత్నం కేసులు పెడతారా అని ప్రశ్నించారు. ఇంతమంది ఉసురు పోసుకుని ఫ్యాక్టరీ పెట్టడం అవసరమా అన్నారు. ప్రజల బాధ ప్రభుత్వానికి పట్టదా అని ప్ర‌శ్నించారు.

ప్ర‌భుత్వం కేవ‌లం త‌న మ‌ద్ద‌తుదారుల‌కు - కావాల్సిన వారికి మేలు చేయ‌డం కోసం ఇలా పంతానికి పోతోంద‌ని అన్నారు. వాస్త‌వానికి ఈ ఫ్యాక్ట‌రీని ప్ర‌జ‌లు వ్య‌తిరేకించ‌డం లేద‌ని చెప్పిన జ‌గ‌న్‌.. స‌ముద్ర తీరానికి 10 కిలోమీట‌ర్ల దూరంలో ఏర్పాటు చేసుకుంటే ఎవ‌రికీ అభ్యంత‌రం ఉండ‌ద‌న్నారు. ఇదే స‌మ‌యంలో చంద్ర‌బాబు ద్వంద్వ వైఖ‌రి అవ‌లంబిస్తున్నార‌ని, పార్క్ వ‌ల్ల ఎలాంటి కాలుష్యం ఉండ‌ద‌ని చెబుతూనే.. పైప్ లైన్ ఎందుకు నిర్మిస్తున్నార‌ని అడిగారు. అయితే, పైప్ లైన్ నిర్మాణానికి అయ్యే ఖ‌ర్చు ఎవ‌రు భ‌రిస్తార‌ని ప్ర‌శ్నించారు. ఏదేమైనా చంద్ర‌బాబు ప్ర‌భుత్వం నిరంకుశంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని జ‌గ‌న్ త‌న స్టైల్లో విమ‌ర్శించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/