Begin typing your search above and press return to search.

పోల‌వ‌రానికి వెళ్తున్న వైఎస్ జ‌గ‌న్ టార్గెట్ 2021!

By:  Tupaki Desk   |   25 Feb 2020 8:30 AM GMT
పోల‌వ‌రానికి వెళ్తున్న వైఎస్ జ‌గ‌న్ టార్గెట్ 2021!
X
ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పోల‌వ‌రం ప్రాజెక్టును సంద‌ర్శించ‌నున్న‌ట్టుగా తెలుస్తోంది. ఈ నెల 27న జ‌గ‌న్ పోల‌వ‌రం ప్రాజెక్టును సంద‌ర్శించ‌వ‌చ్చు అని స‌మాచారం. ఇటీవ‌లి కాలంలోనే పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నులు ఊపందుకున్నాయి. త‌ను ముఖ్య‌మంత్రి అయ్యాకా వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యంలో రివ‌ర్స్ టెండ‌రింగ్ చేయించిన సంగ‌తి తెలిసిందే. గ‌తంతో పోలిస్తే దాదాపు ఆరు వంద‌ల కోట్ల రూపాయ‌ల పై మొత్తాన్ని ఏపీ ఖ‌జానాకు సేవ్ చేస్తూ కొత్త కాంట్రాక్ట‌ర్ కు ఆ ప‌నుల‌ను అప్ప‌గించారు. మేఘా సంస్థ ఆ కాంట్రాక్టును చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. అయితే గ‌త ఏడాది భారీ వ‌ర్షాలు పోల‌వ‌రం ప‌నుల‌కు ఆటంకంగా మారాయి. అదే స‌మ‌యంలో అప్ప‌టికే కాఫ‌ర్ డ్యామ్ ను నిర్మించి ఉండ‌టంతో మ‌రింత ఆటంకాలు క‌లిగాయి. చంద్ర‌బాబు నాయుడు హ‌యాంలో ఆయ‌న ద‌గ్గ‌రుండి కాఫ‌ర్ డ్యామ్ నిర్మాణానికి కాంట్రాక్ట‌ర్ల‌ను పుర‌మాయించార‌ని అంటారు. సాధార‌ణంగా ఇలాంటి పెద్ద ప్రాజెక్టుల‌కు స్పిల్ వే నిర్మాణం పూర్త‌య్యాకే.. కాఫ‌ర్ డ్యామ్ నిర్మాణం జ‌రుగుతుంది. కానీ కాఫ‌ర్ డ్యామ్ పూర్తి చేసి అంతా అయిపోయింద‌ని అనిపించాల‌ని చంద్ర‌బాబు నాయుడు భావించిన‌ట్టుగా ఉన్నారు. అయితే కాఫ‌ర్ డ్యామ్ నిర్మాణంతో వ‌ర‌ద నీరు వ‌చ్చి దానిలో నిల‌బ‌డ్డాయి. దీంతో ప‌నుల‌కు తీవ్ర అంత‌రాయం కలిగింద‌ని స‌మాచారం.

డీ వాట‌రింగ్ జ‌ర‌గ‌డంతో ఇప్పుడు ప‌నులు ఊపందుకున్నాయి. ఫిబ్ర‌వ‌రి నెల‌లో పోల‌వ‌రం పనుల‌ను ఉర‌క‌లెత్తిస్తూ ఉన్నార‌ని తెలుస్తోంది. ప్ర‌ధానంగా స్పిల్ వే నిర్మాణం విష‌యంలో ప‌నులు శ‌ర‌వేగంగా సాగుతున్నాయ‌ని స‌మాచారం. స్పిల్ వే నిర్మాణానికి సంబంధించిన కాంక్రీట్ వ‌ర్క్ జ‌రుగుతూ ఉంద‌ని తెలుస్తోంది. రాబోయే ఐదు నెల‌ల్లో ఈ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతాయ‌ని ఇంజ‌నీరింగ్ వ‌ర్క్స్ వాళ్లు ప్ర‌క‌టించారు. ఈ ఐదు నెల‌ల్లో కీల‌క‌మైన ప‌నులు పూర్త‌వుతాయ‌ని తెలిపారు.

జలాశయమంతా ఒక్కటే అయినా అందులో మూడు భాగాలుంటాయి. అవి గ్యాప్ - స్పిల్ వే - ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్. గ్యాపుల్లో 1 - 2 - 3 ఉంటాయి. ఇందులో గ్యాప్ 3 అనేది 150 మీటర్ల పొడవుతో కూడిన కాంక్రీట్ డ్యామ్ గా ఉంటుంది. గ్యాప్ 2లో ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యామ్ ఉంటుంది. ఇదే ప్రధాన జలశాయం. దీని పొడవు 1.75 కిలోమీటర్లు. గ్యాప్ -1 లోనూ ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ ఉంటుంది. దీని పొడవు 450 మీటర్లు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంత పొడవైనా జలాశయం లేదు.

స్పిల్వే కాంక్రీట్ పనులను 2020 జూన్ చివరి నాటికి పూర్తిచేయాలని ఎంఈఐఎల్ లక్ష్యంగా విధించుకుంది. ఇందులో భాగంగానే ఉండే బీమ్ లను మే నెలాఖరు నాటికి పూర్తిచేసేలా ప్రణాళిక రూపొందించుకుంది. స్పిల్ వే కు సంబంధించిన బ్రిడ్జ్ పనులు ఆగస్టు చివరిలోపు పూర్తికావాలి. అంటే ఆరు నెలల సమయం మాత్రమే ఉంది. ఏదేమైనా వ‌చ్చే ఏడాది ఆగ‌స్టు నాటికి ఈ ప్రాజెక్టుకు సంబంధించి అన్ని ప‌నుల‌నూ పూర్తి చేయాల‌ని భావిస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రాజెక్టును సంద‌ర్శించి, ప‌నులు సాగుతున్న తీరును స‌మీక్షించ‌బోతున్నారు.