Begin typing your search above and press return to search.

జగన్ విశాఖ పర్యటనలో ఏమేం చేశారు?

By:  Tupaki Desk   |   29 Dec 2019 5:02 AM GMT
జగన్ విశాఖ పర్యటనలో ఏమేం చేశారు?
X
ఏపీ రాజధానిగా విశాఖపట్నం అవుతుందన్న అంచనాలు భారీగా వ్యక్తమవుతున్న వేళ.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వైజాగ్ కు రావటం ఒక ఎత్తు అయితే.. రాజధాని ప్రకటన తర్వాత వచ్చిన సీఎంకు స్వాగతం పలికిన తీరు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. వేలాది మంది రోడ్ల మీద నిలబడి స్వాగతం పలకటం.. పూలవాన కురిపించటంతో పాటు.. జగన్ ను చూసేందుకు.. ఆయన మాటల్ని వినేందుకు తహతహలాడిపోయారు.

విశాఖ ఎయిర్ పోర్టు నుంచి కైలాసగిరి.. అక్కడి నుంచి సిటీ సెంట్రల్ పార్క్.. అనంతరం ఆర్కే బీచ్ కు వెళ్లారు. మొత్తంగా 24 కిలోమీటర్ల మేర ప్రజలు రోడ్డుకు ఇరువైపులా నిలబడి అభివాదం చేయటం.. ఆయన కాన్వాయ్ మీద పూలవర్షం కురపించారు. రాజధాని ప్రకటన ఉత్తరాంధ్రలో ఎంతటి ఉత్సాహాన్ని నింపిందన్న విషయం జగన్ తాజా పర్యటనతో నిరూపితమైందని చెప్పాలి. థ్యాంక్యూ సీఎం సర్ అనే ప్ల కార్డులు పట్టుకోవటం.. కిలోమీటర్ల కొద్దీ మానవహారాలుగా ఏర్పడి జగన్ కు స్వాగతం పలికిన తీరు విశాఖ చరిత్రలో జరిగిన అరుదైన స్వాగతంగా అభివర్ణిస్తున్నారు.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. మూడు కార్యక్రమాల్లో పాల్గొన్న జగన్.. ఎక్కడా నోట్లో నుంచి మాట మాట్లాడేందుకు అస్సలు ఇష్టపడలేదు. విమానాశ్రయం నుంచి నేరుగా కైలాసగిరికి చేరుకున్న ఆయన.. అనంతరం సెంట్రల్ పార్క్ వద్దకు వెళ్లి పుష్పప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూ.1200 కోట్లతో చేపట్టే పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆర్కే బీచ్ ఒడ్డున నిర్వహిస్తున్న విశాఖ ఉత్సవ్ లోనూ పాల్గొన్నారు. మొత్తంగా మూడు కార్యక్రమాల్లో పాల్గొనటం.. వేల కోట్ల రూపాయిల పనులకు శంకుస్థాపనలు చేయటం ద్వారా విశాఖ మీద తనకున్న ప్రేమాభిమానల్ని జగన్ ప్రదర్శించారని చెప్పక తప్పదు.