Begin typing your search above and press return to search.

జగన్ రెండు లక్షల కోట్లు... మోడీ ఇరవై తొమ్మిది లక్షల కోట్లు

By:  Tupaki Desk   |   7 May 2023 4:00 PM GMT
జగన్ రెండు లక్షల కోట్లు... మోడీ ఇరవై తొమ్మిది లక్షల కోట్లు
X
ఈ అంకెలు ఏంటి ఇంత పెద్ద నంబరేంటి అని ఎవరైనా అనుకుంటారేమో. కానీ ఇవి అంకెలు కావు. అభివృద్ధి. సంక్షేమం. పేదల కోసం ఏలికలు తాము ఖర్చు చేసిన మొత్తాలు. నగదు బదిలీ పధకం కింద పేదల ఖాతాలో వేసిన లక్షల కోట్ల రూపాయలు. ఏపీ సీఎం జగన్ తరచూ చెప్పే మాట ఒకటి ఉంటుంది. తాను ఏ మధ్య దళారీ ప్రమేయం లేకుండా ఏ జన్మ భూమి కమిటీల జోక్యం లేకుండా నేరుగా బటన్ నొక్కి పేదల ఖాతాలో గడచిన నాలుగేళ్లలో నగదు బదిలీ చేసింది అక్షరాలా రెండు లక్షల కోట్ల రూపాయల పై చిలుకు అని చెబుతూ ఉంటారు.

మరో ఏడాది పాలన జగన్ ది ఉంది కాబట్టి ఈ నంబర్ ఇంకా పెరగవచ్చు. తాను పేదల కు చేస్తున్న మేలు ఇదని, తనను మళ్లీ ఎన్నుకోవాలని జగన్ ప్రతీ సభలోనూ కోరుతూ వస్తున్నరు. అచ్చం జగన్ లాగానే కర్నాటక సభల్లో మోడీ కూడా మాట్లాడుతున్నారు. ఆయన కూడా ఒక నంబర్ జనం ముందు ఉంచారు. గడచిన తొమ్మిదేళ్ల కాలంలో దేశంలోని పేదలకు, మధ్యతరగతి వర్గాలకు వివిధ పధకాల మూలంగా కానీ రాయితీల ద్వారా కానీ పీఎం కిసాన్ వంటి కార్యక్రమాల ద్వారా కానీ ఇచ్చినది అక్షరాలా ఇరవై తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు అని లెక్క వేసి మరీ చెబుతున్నారు.

ఇక జగన్ ఇక్కడ బాబుని చూపించి ఎద్దేవా చేసినట్లుగానే మోడీ కూడా కాంగ్రెస్ పాలకులను చూపిస్తూ వారైతే ఇంత పెద్ద మొత్తం ఇచ్చి ఉండేవారా అని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు అయితే వారి జేబుల్లోకే అంతా వేసుకునేవారు అని తాము ప్రతీ పైసా పేదలకు చేరాలన్న తాపత్రయంతోనే పనిచేశామని మోడీ చెప్పుకొచ్చారు.

తాము పేదల కోసం, మధ్యతరగతి వర్గాల కోసం ఎంతో చేశామని, తమను చూసి ఓట్లేయాని ఆయన కోరుతున్నారు. మోడీ భారీ రోడ్ షో కర్నాటకలో జరిగింది. ఆ రోడ్ షోకు జనాలు బాగానే తరలివచ్చారు. ఏకంగా 26 కిలోమీటర్ల మేర సాగిన ఈ రోడ్ తో మోడీలో కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. అదే టైం లో బీజేపీ నేతలలో ధైర్యాన్ని నింపింది. కాంగ్రెస్ వైపుగ జనాలు మొగ్గు చూపుతున్నారు అన్న వాదనను పటాపంచలు చేసేలా బీజేపీ గ్రాఫ్ ని పెంచగలిగారు మోడీ.

ఆయన వారం రోజుల పాటు కర్నాటక వీధుల్లో చేసిన రోడ్ షో కానీ, బహిరంగ సభలు కానీ బాగానే సక్సెస్ అయ్యాయి. అదే టైం లో కాంగ్రెస్ మీద ఆయన చేస్తున్న విమర్శలు కూడా జనం బుర్రల్లోకి వెళ్లాయి. దేశాన్ని రెండు విధాలుగా చూడాలని మోడీ కోరుతున్నారు. గత తొమ్మిదేళ్ల తన పాలన అంతకు ముందు ఆరు దశాబ్దాల కాంగ్రెస్ పాలనను బేరీజు వేయాలని కోరుతున్నరు.

బీజేపీ తొమ్మిదేళ్ళలో అభివృద్ధికి సంక్షేమానికి పెద్ద పీట వేస్తే కాంగ్రెస్ మాత్రం అవినీతి ఆశ్రిత పక్షపాతానికే పాటుపడిందని అన్నారు. మోబైల్ ఫోన్ల తయారీ పరిశ్రమలు ఈ రోజు దేశంలో రెండు వందల దాకా ఉన్నాయంటే అది బీజేపీ గొప్పదనం అన్నారు . ఒకనాడు 2014 కి ముందు వన్ జీబీ ఇంటర్నెట్ డేటా మూడు వందలు ఉంటే ఇపుడు అది పది రూపాయలకు తెచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదే అని మోడీ చెప్పుకున్నారు.

టెక్నాలజీకి పెద్ద పీట వేశామని, దేశాన్ని అభివృద్ధి చెందిన భారత్ గా మారుస్తున్నామని అంటున్నారు. ఒక వైపు ఉచితాలకు వ్యతిరేకం అంటూనే కర్నాటక కు బీజేపీ వరాలు ప్రకటించింది. అలాగే నగదు బదిలీ పధకాలు మేమే చేశామంటూ ఓట్లు అడుగుతోంది. మరి బీజేపీ 29 లక్షల కోట్ల నగదు బదిలీకి జనాలు మొగ్గు చూపుతారా. అక్కడ మోడీ హిట్ అయితే ఇక్కడ జగన్ కి కూడా నగదు బదిలీ పధకాలు కలసివచ్చినట్లే అని భావించాల్సి ఉంటుందని అంటున్నారు.