Begin typing your search above and press return to search.
మోదీజీ... జగన్ ట్వీట్ చూశారా?
By: Tupaki Desk | 9 April 2018 10:33 AM GMTఏపీకి ప్రత్యేక హోదా కోసం విపక్ష వైసీపీ చేపట్టిన ఉద్యమం నిజంగానే పతాక స్థాయికి చేరుకుంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం తన ఎంపీలతో రాజీనామాలు చేయించిన వైసీపీ... ఏకంగా వారితో ఆమరణ నిరాహార దీక్షలకు శ్రీకారం చుట్టించింది. తమను ఎన్నుకున్న ప్రజల ప్రయోజనాలే పరమావధిగా పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ చెప్పడమే ఆలస్యం... వైసీపీ లోక్ సభ సభ్యులు తమ ఎంపీ పదవులకు రాజీనామాలు చేసి ఢిల్లీలోని ఏపీ భవన్ వేదికగా ఆమరణ నిరాహార దీక్షలకు దిగారు. ఈ దీక్షలు మొదలై నేటికి నాలుగో రోజు. తొలి రెండు రోజులకే పార్టీ పార్లమెంటరీ నేత, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను బలవంతంగా దీక్ష విరమింపజేసిన పోలీసులు ఆయనను ఆసుపత్రికి తరలించేశారు. ఆర్వాత తిరుపతి వరప్రసాద్ - ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డిలు కూడా అనారోగ్యానికి గురి కాగా... మేకపాటిలాగానే వారిని కూడా పోలీసులు ఆస్పత్రికి తరలించారు.
ఇక ప్రస్తుతం అక్కడ జరుగుతున్న దీక్షలో పార్టీ యువ నేతలైన కడప - రాజంపేట ఎంపీలు వైఎస్ అవినాశ్ రెడ్డి - పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలతో పాటు ఇటీవలే రాజ్యసభకు ఎన్నికైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు తమ నిరసనలను కొనసాగిస్తున్నారు. వీరికి సంఘాభావంగా నిన్న ఢిల్లీకి వచ్చిన పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కూడా నేటి ఉదయం దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా దీక్షల వద్ద ఉన్న తాజా పరిస్థితిపై ఆరా తీసిన పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... తాజా పరిస్థితులను వివరిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి ట్విట్టర్ సందేశం పంపారు. ఆ సందేశంలో జగన్ ఏమని ప్రస్తావించారంటే... *మా ఎంపీల ఆమరణ దీక్ష నాలుగో రోజుకు చేరింది. మేకపాటి రాజమోహన్ రెడ్డి - వరప్రసాద్ - వైవీ సుబ్బారెడ్డిని ఇప్పటికే ఆస్పత్రికి తరలించారు. ప్రధాని మోదీగారు - ఎంపీల జీవితాలు - ఏపీ భవిష్యత్ ఆందోళనలో ఉన్నాయి. హోదాపై మీరు చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకోండి* అని సదరు ట్వీట్ లో జగన్ పేర్కొన్నారు.
మరి నిత్యం సోషల్ మీడియాలో యమా యాక్టివ్ ఉంటున్నట్లుగా కనిపించే మోదీ... ఈ సందేశాన్ని చూశారో? లేదో? చూడాలి. ఒకవేళ జగన్ సందేశాన్ని చూసే ఉంటే... మోదీ తప్పక స్పందిస్తారనే భావన వక్తమవుతోంది. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం విపక్ష పార్టీ ఎంపీలు తమ ప్రాణాలను పణంగా పెట్టేందుకు సిద్ధమైన వైనాన్ని జగన్ సరైన సమయంలోనే మోదీ దృష్టికి తీసుకెళ్లారన్న వాదన కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో మోదీ స్పందన పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొందనే చెప్పాలి.