Begin typing your search above and press return to search.

ఇంకెంత‌కాలం పోలీసుల‌ను అడ్డుపెట్టుకుంటావు బాబూ?

By:  Tupaki Desk   |   13 Aug 2018 1:25 PM GMT
ఇంకెంత‌కాలం పోలీసుల‌ను అడ్డుపెట్టుకుంటావు బాబూ?
X
గుర‌జాల నియోజ‌క‌వ‌ర్గంలోని కేసానుప‌ల్లి - కోనంకి - సీతారాంపురం ల‌తోపాటు మ‌రో 8 ప్రాంతాల్లో జ‌రిగిన అక్ర‌మ సున్న‌పురాయి మైనింగ్ వ్య‌వ‌హారం రాష్ట్ర‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే ఆ అక్ర‌మ మైనింగ్ జ‌రిగిన ప్రాంతంలో వైసీపీ నిజ‌నిర్ధార‌ణ క‌మిటీ ప‌ర్య‌ట‌న‌ను పోలీసులు అడ్డుకుంటున్నారు. అమానుషంగా.... అన్యాయంగా... వైసీపీ నేత‌ల‌ను అరెస్టు - హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. వైసీపీ సీనియ‌ర్ నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ - గుంటూరు ఎమ్మెల్యే ముస్త‌ఫా - మాజీ మార్కెట్ యార్డు చైర్మ‌న్ లేళ్ల అప్పిరెడ్డి ల‌ను అరెస్టు చేసి దుగ్గిరాల పోలీసు స్టేష‌న్ కు త‌ర‌లించారు. న‌ర‌స‌రావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీ‌నివాస‌రెడ్డిని హౌస్ అరెస్టు చేశారు. గుర‌జాల వైసీపీ స‌మ‌న్వ‌య క‌ర్త కాసు మ‌హేష్ రెడ్డి - వైసీపీ శాస‌న‌స‌భాప‌క్ష నేత ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు - అంబ‌టి రాంబాబు - మ‌ర్రి రాజ‌శేఖ‌ర్ ల‌ను న‌ర‌సరావుపేట‌లోని మ‌హేష్ స్వ‌గృహంలో హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసుల బెదిరింపుల‌కు బెద‌ర‌మ‌ని - ఎట్టిప‌రిస్థితుల్లోనూ మైనింగ్ ప్రాంతంలో ప‌ర్య‌టిస్తామ‌ని మ‌హేష్ స్ప‌ష్టం చేశారు. ఈ క్ర‌మంలో పోలీసుల‌కు - వైసీపీ నేత‌ల‌కు మ‌ధ్య ఘ‌ర్ష‌ణ జ‌రిగింది. దీంతో, కాసు మ‌హేష్ ఇంటి వ‌ద్ద ఉద్రిక్త‌త ఏర్ప‌డింది.ఈ నేప‌థ్యంలో వైసీపీ నేత‌ల అరెస్టులను వైసీపీ అధ్య‌క్షుడు - ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. చంద్ర‌బాబు స‌ర్కార్ నియంతృత్వ ధోర‌ణినికి నిర‌స‌న‌గా జ‌గ‌న్ ట్వీట్ చేశారు.

``గుర‌జాలలో జరిగిన అక్ర‌మ మైనింగ్ కుంభ‌కోణాన్ని ప‌రిశీలించ‌డానికి వెళ్లిన‌ మా పార్టీ నిజ నిర్ధార‌ణ క‌మిటీ స‌భ్యుల‌ను అక్ర‌మంగా అరెస్టు చేశారు. అన్యాయంగా 144 సెక్ష‌న్ పెట్టడంతోనే ఆ స్కామ్ లో అస‌లు దోషులెవ‌రో తేట‌తెల్ల‌మైంది. చంద్ర‌బాబు....మీ త‌ప్పులు - అక్ర‌మాలు - అన్యాయాలు - స్కామ్ ల‌కు వ్య‌తిరేకంగా నిన‌దిస్తున్న గొంతుల‌ను నొక్క‌డానికి ఇంకెంత కాలం పోలీసుల‌ను అడ్డుపెట్టుకుంటారు?`` అని జ‌గ‌న్ ట్వీట్ చేశారు. అంత‌కుముందు, లోక్ స‌భ మాజీ స్పీక‌ర్ సోమ్ నాథ్ ఛ‌ట‌ర్జీ మృతికి సంతాపంగా జ‌గ‌న్ ట్వీట్ చేశారు. నైతిక విలువ‌ల‌కు క‌ట్టుబ‌డి - త‌న ప్ర‌సంగాల‌తో ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకున్న ఓ గొప్ప నేత‌ను దేశం కోల్పోయిందంటూ ట్వీట్ చేశారు. ఈ విషాద స‌మ‌యంలో ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను త‌న ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేస్తున్నాన‌ని జ‌గ‌న్ అన్నారు.