Begin typing your search above and press return to search.

ఎస్ వాలంటీర్లు అంటూ ... ఓపెన్ అయిపోయిన జగన్

By:  Tupaki Desk   |   19 May 2023 3:00 PM GMT
ఎస్ వాలంటీర్లు అంటూ  ...  ఓపెన్ అయిపోయిన జగన్
X
ఎస్ వాలంటీర్లు నా సైన్యమే. నా వాళ్ళే అంటూ జగన్ ఓపెన్ అయిపోయారు. వారే మా ప్రభుత్వానికి వారధులు సారధులు. వాళ్ళే ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరకు తీసుకెళ్తున్నారు. వారే మంచిని జనాల వద్దకు మోసుకెళ్ళే సత్య సారధులు అంటూ జగన్ వాలంటీర్ల వ్యవస్థ మీద తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టారు.

వాలంటీర్ల వ్యవస్థ అంటే మంచి చేసేదే తప్ప చెడు చేసేది కాదు అని అన్నారు. ఇంతటి చక్కటి వ్యవస్థ మీద కూడా విపక్షాలు విష ప్రచారం చేయడం బాధాకరం అని ఆయన అన్నారు. వాలంటీర్ల చేతులో మీద అక్షరాల మూడు లక్షల కోట రూపాయల నగదు బదిలీ ప్రతీ గడపకూ చేరిందని ఆయన గుర్తు చేశారు. పెన్షన్ కచ్చితంగా ఒకటవ తేదీన ప్రతీ ఇంటి గడప వద్దకు వచ్చి సూర్యుడు కూడా లేవకముందే అందించే వాలంటీర్ నిజంగా గొప్పవాడే అని జగన్ అన్నారు.

అలాంటి వాలంటీర్ల మీద చంద్రబాబు ఎంతగానో విషం కక్కారని, ప్రతీ ఇంటీ డోర్ ఎందుకు తడుతున్నారంటే అని దుర్మార్గంగా మాట్లాడారని జగన్ అన్నారు. ఇపుడు ఈ వ్యవస్థ ప్రజల మన్ననలు అందుకుంటోందని భావించి తాను అధికారంలోకి వస్తే జన్మ భూమి కమిటీలలో పనిచేసిన వారినే వాలంటీర్లుగా పెడతాను అని అంటున్నారని జగన్ విమర్శించారు.

చంద్రబాబు వస్తే ఇపుడు ఉన్న వాలంటీర్లను తీసేసి కొత్త వారిని పెడతారట అంటూ ఆయన మొత్తం రెండున్నర లక్షల మందికి ఒక హెచ్చరికగానే చెప్పాల్సింది చెప్పేశారు. మీరు నా వారు నా మనసుకు దగ్గర వారు, ప్రభుత్వానికి కళ్ళూ చెవులు లాంటి వారు, మీతోనే ప్రభుత్వం ఉంది అని కూడా కితాబు ఇచ్చారు. ఇంతటి మంచి వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం ప్రజలకు ఉంది, పేదలకు ఉందని ఈ పేదల ప్రభుత్వాన్ని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత కూడా అందరి మీద ఉందని జగన్ అంటున్నారు.

తనకు టీవీలు పేపేర్లు అనుకూల మీడియా లేదని, తనకు ఉన్న ఆస్తి అంతా వాలంటీర్లు మాత్రమే అని ఆయన అంటున్నారు. వాలంటీర్లే ప్రభుత్వం చేసే మంచిని నేరుగా ప్రజలకు వివరిస్తున్నారని, వారే పేదలకు ప్రభుత్వానికి వారధులుగా ఉన్నారని కూడా జగన్ చెప్పుకొచ్చారు. మొత్తానికి జగన్ సైన్యం వాలంటీర్లు అని చంద్రబాబు చేసిన విమర్శలను పాజిటివ్ గా జగన్ తిప్పికొట్టారు. పైగా వారే తన బలం అని కూడా చెప్పేశారు.

మరి వాలంటీర్లను బాబు వస్తే తీసేస్తారు అని జగన్ చేసిన కామెంట్స్ కూడా వారిలోకి బాగానే వెళ్లాయనుకోవాలి. ఏది మేమైనా రెండున్నర లక్షల మంది వాలంటీర్లు వారి వెనక కుటుంబాలతో పదిలక్షల మంది వైసీపీ ఓటు బ్యాంక్ గా మార్చడంలో వైసీపీ అధినాయకత్వం సక్సెస్ అయినట్లుగానే కనిపిస్తోంది. అదే టైం లో బాబు వస్తే జన్మభూమి కమిటీలే అని ఇటు వాలంటీలకు అటు జనాలకు కూడా జగన్ ఒకే సారి సందేశం ఇచ్చేశారు.