Begin typing your search above and press return to search.

ఆ ఎమ్మెల్యే అంత స్పెష‌లా.. సీఎం జ‌గ‌న్ టూర్ వాయిదా!

By:  Tupaki Desk   |   10 Oct 2022 2:13 PM GMT
ఆ ఎమ్మెల్యే అంత స్పెష‌లా.. సీఎం జ‌గ‌న్ టూర్ వాయిదా!
X
సాధార‌ణంగా ప్ర‌ధాని అయినా.. ముఖ్య‌మంత్రి అయినా.. ఒక సారి ప‌ర్య‌ట‌న ఖ‌రార‌య్యాక‌.. దానిని వాయిదా వేసుకోవ‌డం అనేది ఉండ‌దు. ఎప్పుడో.. అత్యంత రేర్ సంద‌ర్భాల్లో త‌ప్ప‌.. వీవీఐపీలుగా ఉన్న‌వారు ప‌ర్య‌ట‌న‌ల‌ను వాయిదా వేసుకునే ప్ర‌య‌త్నం చేయ‌రు. ఎందుకంటే.. ప్ర‌ధాని, ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న‌లు ఉంటే.. దానికి సంబందించి ల‌క్ష‌ల్లో ఖ‌ర్చు చేస్తారు. భారీ ఏర్పాట్లు చేస్తారు. వేదిక‌లు నిర్మిస్తారు. ప్ర‌జ‌ల‌ను స‌మీక‌రిస్తారు. సో.. ఎలా చూసుకున్నా.. అన్నీ న‌ష్ట‌మే. సో.. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌ధాని, సీఎంల ప‌ర్య‌ట‌నల‌ను దాదాపు వాయిదా వేసుకునే ప్ర‌య‌త్నం అయితే చేయ‌రు.

కానీ, ఇప్పుడు ఓ చిన్న కార‌ణంగా.. సీఎం జ‌గ‌న్ త‌న ప‌ర్య‌ట‌న‌ను వాయిదా వేసుకున్నారు. అనకాపల్లి జిల్లాలో సీఎం జగన్ పర్యటన వాయిదా పడింది. ఈ నెల 17న మాకవరపాలెంలో వైద్య కళాశాల శంకుస్థాపనకు సీఎం జగన్ రావాల్సి ఉంది. ఇందుకోసం ఇప్పటికే మాకవరపాలెం మండలం భీమబోయిన పాలెం వద్ద స్థల సమీకరణ చేయడంతో పాటు.. జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భారీ ఎత్తున వేదిక నిర్మించారు. ల‌బ్ధిదారుల‌ను అక్క‌డ‌కు త‌ర‌లించేందుకు ఆర్టీసీ బ‌స్సుల‌ను కూడా ముందుగానే బుక్ చేశారు.

మ‌రి ఇన్ని చేసిన త‌ర్వాత‌.. మ‌రో వారం రోజుల స‌మ‌యం ఉండ‌గానే.. సీఎం ప‌ర్య‌ట‌న ఎందుకు వాయిదా ప‌డిందంటే.. కేవ‌లం ఒకే ఒక్క ఎమ్మెల్యే కోసం. ఆయ‌నే న‌ర్సీప‌ట్నం ఎమ్మెల్యే.. పెట్ల ఉమా శంక‌ర్ గ‌ణేష్‌. ఆయ‌న ఇటీవ‌ల మూడురాజ‌ధానుల‌కు మ‌ద్ద‌తుగా.. వాహన ర్యాలీ నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలో ఆయ‌న న‌డుపుతున్న బైక్ అదుపు త‌ప్పి.. ప‌ల్టీలు కొట్టారు. దీంతో తీవ్రంగా గాయపడి ఆసుప‌త్రి పాల‌య్యారు. ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ కోలుకోవడానికి మరికొంత సమయం పడుతుంద‌ని వైద్యులు తెలిపారు. ఈ క్ర‌మంలోనే సీఎం పర్యటన వాయిదా పడినట్లు వైసీపీ నాయకులు తెలిపారు.

ఎందుకంత స్పెష‌ల్‌...?

వాస్త‌వానికి ఏపీలో అధికార పార్టీ వైసీపీకి జ‌గ‌న్ కాకుండా 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో చాలా మందికి ఇలాంటి ఘ‌ట‌న కామ‌నే. అయినంత మాత్రాన సీఎం లాంటి వ్య‌క్తి.. ఏకంగా త‌న ప‌ర్య‌ట‌న‌ను వాయిదా వేసుకోవ‌డం అనేది ఉండ‌దు. ఇటీవ‌ల సీఎం జ‌గ‌న్ ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లా ద‌ర్శిలో ప‌ర్య‌టించారు. ఈ క్ర‌మంలో ఎమ్మెల్యే ఆ కార్య‌క్ర‌మానికి డుమ్మా కొట్టారు. అయినా..సీఎం జ‌గ‌న్ ప‌ట్టించుకోకుండానే.. కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. మ‌రి ఇప్పుడు ఉమా శంక‌ర్ గ‌ణేష్ విష‌యంలో మాత్రం ప‌ట్టుబ‌ట్టారు. దీనికి కార‌ణం ఏంటి? ఎందుకంత స్పెష‌ల్ అనేది ఆస‌క్తిగా మారింది.

ఎందుకంటే.. పెట్ల ఉమాశంక‌ర్ గ‌ణేష్‌.. ద‌ర్శ‌కుడు.. పూరి జ‌గ‌న్నాథ్‌కు సోద‌రుడు కావ‌డం ప్ర‌ధాన కార‌ణం. టాలీవుడ్‌లో గ‌ణేష్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. సో.. ఆయ‌న‌ను విస్మ‌రిస్తే.. టాలీవుడ్‌పై ప్ర‌భావం ప‌డుతుంద‌ని జ‌గ‌న్ భావించి ఉండొచ్చు. మ‌రో కార‌ణం.. ఇటీవ‌ల కాలంలో టీడీపీ నేత అయ్య‌న్న పాత్రుడిపై గ‌ణేష్ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు. అయ్య‌న్న‌కు కౌంట‌ర్లు ఇస్తున్నాడు. సో.. ఈ నేప‌థ్యంలోనే అలాంటి నాయ‌కుడు లేకుండా పాల్గొన‌డం ఎందుక‌ని జ‌గ‌న్ బావించి ఉంటార‌నే చ‌ర్చ కూడా న‌డుస్తోంది. ఏదేమైనా.. ఒక ఎమ్మెల్యే కోసం.. జ‌గ‌న్ త‌న ప‌ర్య‌ట‌న‌నే వాయిదా వేసుకోవ‌డం ఇదే తొలిసారి కావ‌డం గ‌మ‌నార్హం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.