Begin typing your search above and press return to search.

వైజాగ్ స్టీల్ డ్యామేజ్ ను జగన్ ఇలా భర్తీ చేస్తారా?

By:  Tupaki Desk   |   7 Aug 2021 7:30 AM GMT
వైజాగ్ స్టీల్ డ్యామేజ్ ను జగన్ ఇలా భర్తీ చేస్తారా?
X
ఇపుడిదే అంశంపై ఉత్తరాంధ్రలో చర్చలు మొదలయ్యాయి. విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆగేది కాదన్న విషయం అందరికీ అర్ధమైపోయింది. గతంలోనే చెప్పుకున్నట్లు ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ప్రైవేటీకరణ ఆగదు. కేంద్రప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఫ్యాక్టరీలోని ఉద్యోగ, కార్మిక సంఘాల నేతలు, రాజకీయపార్టీలు, ప్రజాసంఘాలు ఎంతగా పోరాడినా పెద్దగా ఉపయోగం ఉండదని తేలిపోయింది.

తెరవెనుక ఏమి జరుగుతోందో తెలీదుకానీ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో నరేంద్రమోడి ఎందుకింత మొండి పట్టుదలగా ఉన్నారో అర్ధం కావటంలేదు. కాబట్టి విశాఖ ఉక్కు గురించి ఎంత ఆలోచించినా ఉపయోగం ఉండదు. ఈ దశలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమి చేయాలి అన్న విషయంపైనే చర్చలు జరుగుతున్నాయి. చేయాల్సిందేమంటే విజయనగరం జిల్లాలో మరో ఉక్కు ఫ్యాక్టరీ రాబోతోంది. అంటే ఇది పూర్తిగా ప్రైవేటురంగంలోనే ఏర్పాటవుతోంది.

వైజాగ్ లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటుపరం అయిపోతోంది కాబట్టి విజయనగరంలో రాబోయే ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో జగన్ ప్రభుత్వం స్పీడు పెంచాలి. జిందాల్ స్టీల్ప్ ఆధ్వర్యంలో ఫ్యాక్టరీ ఏర్పాటవుతోంది. దీనికి అవసరమైన భూములను వెంటనే కేటాయించటం, మౌళిక సదుపాయాలను కల్పించటం లాంటి వాటి విషయంలో ప్రభుత్వం స్పీడుగా స్పందించాలి. వీలైనంత తొందరలో తాను చేయగలిగిన వాటిని జగన్ ప్రభుత్వం చేసేస్తే ఫ్యాక్టరీ ఏర్పాటు అంత తొందరగా జరుగుతుంది.

ఫ్యాక్టరీ ఏర్పాటన్నాక ప్రత్యక్షంగా ఉద్యోగాలు కల్పించటం, పరోక్షంగా ఉపాధి అవకాశాలు పెరగటం ఖాయం. విశాఖ స్టీల్స్ ను ప్రైవేటుపరం చేసేయాలన్నది కేంద్రం నిర్ణయం. ఒకవేళ ఏ పరిస్ధితుల్లో అయినా అది సాధ్యంకాకపోతే మూసేస్తామని కచ్చితంగా చెప్పేసింది. ఫ్యాక్టరీ మూతేసే పరిస్దితులు సృష్టించేకన్నా కనీసం ప్రైవేటురంగంలో నడిచేట్లు చేయటమే తెలివైనపని.

ఇటు విశాఖ స్టీల్స్ అటు విజయనగరంలో కొత్త ఫ్యాక్టరీ రెండు గనుక నడుస్తుంటే ప్రత్యక్ష ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు బాగా పెరుగుతాయి. రెండు ఫ్యాక్టరీలు కూడా సొంతంగా గనులను సంపాదించుకుంటాయి కాబట్టి ఉత్పత్తి కూడా పెరగటం ఖాయం. కాబట్టి విశాఖ స్టీల్ విషయం కన్నా జిందాల్ స్టీల్స్ విషయంలో జగన్ స్పీడుగా చర్యలు తీసుకుంటే వైజాగ్ లో జరిగే నష్టాన్ని కనీసం జిందాల్ స్టీల్స్ రూపంలో భర్తీ చేసినట్లవుతుంది.