Begin typing your search above and press return to search.

లోటస్ పాండ్ ను జగన్ ఖాళీ చేస్తారా..?

By:  Tupaki Desk   |   29 Jun 2016 5:30 PM GMT
లోటస్ పాండ్ ను జగన్ ఖాళీ చేస్తారా..?
X
తాజాగా ఈడీ జారీ చేసిన ఆదేశాలు ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి శరాఘాతంగా మారాయని చెప్పాలి. గతంలో సాక్షి ఆస్తుల మీద ఈడీ అటాచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈసారి సాక్షికి సంబంధించిన మరికొన్నింటి మీద అటాచ్ చేయటంతో పాటు..హైదరాబాద్ లోని జగన్ నివాసమైన లోటస్ పాండ్.. బెంగళూరులోని మంత్రి కామర్స్ వాణిజ్య సముదాయాన్ని.. మరికొన్ని ఆస్తుల్ని అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేయటం తెలిసిందే. మిగిలిన ఆస్తుల అటాచ్ మెంట్ ఎలా ఉన్నా.. లోటస్ పాండ్ లోని జగన్ నివాసాన్ని ఈడీ అటాచ్ చేయటంపై ఆసక్తికర చర్చ ఒకటి షురూ అయ్యింది.

ఈడీ అటాచ్ మెంట్ నేపథ్యంలో ఆయన లోటస్ పాండ్ ఇంటిని ఖాళీ చేయాల్సి ఉంటుందా? అన్నది ఇప్పుడో ప్రశ్నగా మారింది. జగన్ వ్యతిరేక మీడియాగా చెబుతున్న కొన్ని మీడియా సంస్థలు ఉత్సాహంతో.. ఇదే విషయం మీద అప్పుడే కథనాలు ఇచ్చేస్తున్న పరిస్థితి. కాకుంటే.. సందేహాల రూపంలో తమ కథనాల్ని ఇస్తున్నాయి. ఇదిలా ఉంటే.. నిజానికి లోటస్ పాండ్ ను జగన్ ఖాళీ చేయాల్సి ఉంటుందా? అన్న ప్రశ్నను కొందరు అధికారుల్ని అడిగినప్పుడు లోగుట్టుగా చెబుతున్న వాదన ఇలా ఉంది.

ప్రస్తుతం ఈడీ చేసిన అటాచ్ మెంట్ కేవలం తాత్కాలికమైనదేనని.. అలాంటప్పుడు ఇంటిని ఖాళీ చేయాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. అటాచ్ చేయటం అంటే.. ఆస్తుల్ని బదలాయించే హక్కుపై పరిమితులు ఉంటాయే తప్పించి.. ఆస్తుల్ని ఈడీకి అప్పగించాల్సిన అవసరం ఉండదని స్పష్టం చేస్తున్నారు. జగన్ మీదున్న అవినీతి ఆరోపణలు ఇంకా నిరూపితం కాలేదని.. తుది తీర్పు రాలేదన్న విషయాన్ని మర్చిపోకూడదని గుర్తు చేస్తున్నారు. గతంలో సాక్షి ఆస్తుల మీద కూడా ఈడీ అటాచ్ చేసిందని.. అలా అని సాక్షి మీడియా ఈడీ చేతుల్లోకి వెళ్లిపోలేదుగా? అని వారు ప్రశ్నిస్తున్నారు.

అలా అని ఈడీ అటాచ్ చేయటం ఇబ్బంది కాదని అనుకోవటంలో కూడా అర్థం లేదని కూడా స్పష్టం చేస్తున్నారు. తాజాగా ఈడీ జారీ చేసిన తాత్కాలిక అటాచ్ మెంట్ కారణంగా ఇప్పటికిప్పుడు.. సమీప భవిష్యత్ లో కూడా ఆయన లోటస్ పాండ్ నివాసాన్ని ఖాళీ చేయాల్సి ఉండకపోవచ్చని చెబుతున్నారు. కాకపోతే.. ఈ వ్యవహారమంతా చికాకు పెట్టేదిగా ఒకరిద్దరు అధికారులు అభివర్ణిస్తున్నారు. మొత్తంగా చూస్తే.. ఈడీ తాత్కాలిక అటాచ్ మెంట్ కారణంగా జగన్ తన ఇంటిని ఖాళీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పొచ్చు.