Begin typing your search above and press return to search.

జగన్ మార్కు వ్యూహం..టీడీపీ - బీజేపీ నోళ్లు మూతపడినట్టే!

By:  Tupaki Desk   |   5 Oct 2019 1:30 AM GMT
జగన్ మార్కు వ్యూహం..టీడీపీ - బీజేపీ నోళ్లు మూతపడినట్టే!
X
ఏపీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనదైన మార్కు వ్యూహంతో ముందుకు సాగుతున్నారనే చెప్పాలి. తాను తీసుకుంటున్న ప్రతి నిర్ణయంపై పూర్తి అవగాహన వచ్చిన తర్వాతే అడుగు ముందుకేస్తున్నట్టుగా కనిపిస్తున్న జగన్.... ఇప్పుడు ఆయన తీసుకుంటున్న మరో వ్యూహాత్మక నిర్ణయంతో ఇటు విపక్ష టీడీపీ నేతల నోళ్లే కాకుండా అడపాదడపా కాస్తంత ఘాటుగానే విమర్శలు చేస్తున్న బీజేపీ నేతల నోళ్లు కూడా మూతపడక తప్పదన్న వాదన వినిపిస్తోంది. పాదయాత్రలో ఇచ్చిన హామీల్లో ఒక్కటొక్కటిగానే అమలులోకి తెస్తూ సాగుతున్న జగన్... నవరత్నాల్లో కీలకమైనదిగా ఉన్న రైతు భరోసాకు సంబందించి కీలక నిర్ణయం తీసుకునే దిశగా సాగుతున్నారన్న ప్రచారం సాగుతోంది. ఈ నిర్ణయంతో నిజంగానే టీడీపీ, బీజేపీ నేతల నోళ్లు మూతపడటం ఖాయమేనన్న వాదన వినిపిస్తోంది.

ఈ నెల 15న వైఎస్ ఆర్ రైతు భరోసా పథకాన్ని ప్రారంభించేందుకు జగన్ సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ పథకం కింద రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఒక్కొక్కరికి రూ.12,500 చొప్పున పెట్టుబడి సాయాన్ని అందించనున్నట్లుగా జగన్ ఇదివరకే ప్రకటించారు. రైతు భరోసాగా ముందు పేర్కొన్న ఈ పథకానికి తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును కలిపి వైఎస్ఆర్ రైతు భరోసాగా నామకరణం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పథకం కింద ఇవ్వనున్న రూ.12,500లలో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ కింద ఇస్తున్న రూ.6000 కూడా ఉన్నాయి. అంటే కేంద్రం నుంచి అందే రూ.6000లకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరో రూ.6,500లను కలిపేసి మొత్తంగా రూ.12,500 ఇస్తారన్న మాట.

ఈ లెక్కన వైఎస్ ఆర్ రైతు భరోసా నిధులు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి కావు. అందులో సగం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కూడా ఉన్నాయి. ఇదే విషయాన్ని ప్రస్తావించిన బీజేపీకి చెందిన ఏపీ నేతలు తమ పార్టీ ప్రభుత్వం ఇస్తున్న నిధులతో పథకాలను నడుపుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. పేరులో మాత్రం ప్రధానినిని విస్మరిస్తోందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో గతంలో కూడా చంద్రబాబు కూడా... మోదీ సర్కారు నిధులతో పథకాలను అమలు చేసి ప్రధాని పేరును విస్మరించి స్టిక్కర్ సీఎంగా ముద్ర వేయించుకున్నారని, జగన్ కూడా చంద్రబాబుకు ఏమాత్రం తీసిపోవడం లేదని విమర్శించారు. దీంతో జగన్ కాస్త ఆలోచనలో పడినట్టుగా తెలుస్తోంది.

ఇదే క్రమంలో శనివారం ఉదయం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో జగన్ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. రాష్ట్రానికి నిధులు, విభజన హామీల అమలుపై దృష్టి సారించాలని కోరడంతో పాటుగా రైతు భరోసా ప్రారంభ కార్యక్రమానికి కూడా రావాలని ఈ సందర్భంగా మోదీని జగన్ ఆహ్వానించనున్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో వైఎస్ఆర్ రైతు భరోసా విషయంలో తనపైకి ఎలాంటి విమర్శలు రాకుండా చూసుకునేలా వ్యూహాత్మకంగానే సాగుతున్న జగన్... ఆ పథకం పేరును ఇప్పుడు వైఎస్ ఆర్ మోదీ రైతు భరోసాగా మార్చేందుకు కూడా సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. ఇదే జరిగితే... ఈ పథకం పేరులో మోదీ పేరు యాడ్ అయిపోతే... ఇటు బీజేపీ నేతలతో పాటు అటు టీడీపీ నేతల నోళ్లు కూడా మూతపడక తప్పదన్న వాదన వినిపిస్తోంది.