Begin typing your search above and press return to search.

వైసీపీలోకి మాజీ మంత్రి

By:  Tupaki Desk   |   1 Jun 2016 11:02 AM IST
వైసీపీలోకి మాజీ మంత్రి
X
ప్ర‌కాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పోతుల రామారావు సైకిల్ ఎక్కేస్తుండ‌టంతో ఆ నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ బ‌లోపేతంపై వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ దృష్టి సారిస్తున్నారు. ఈ నియోజకవర్గం నుండి గతంలో కాంగ్రెస్ పార్టీ తరుపున మునిసిపల్ శాఖమంత్రిగా పనిచేసిన మానుగుంట మహీధర్‌ రెడ్డి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్న నేప‌థ్యంలో ఆయ‌న‌కు గాలం వేసేందుకు జ‌గ‌న్ పార్టీ నేత‌లు ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టిన‌ట్లు స‌మాచారం.

పోతుల రామారావు సైకిల్ తీర్ధం పుచ్చుకోనున్న నేపధ్యంలో వైఎస్‌ ఆర్ కాంగ్రెస్ పార్టీకి అక్కడ సమర్థవంతమైన నాయకుడు అవసరం ఉంది. మానుగుంట వైసీపీ తీర్థం పుచ్చుకుంటే ఆ నియోజకవర్గంలో మళ్ళీ వైకాపాకు పూర్వవైభవం వచ్చే అవకాశాలున్నాయని ఆపార్టీకి చెందిన నేత‌లు ధీమాగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మానుగుంటను వైకాపా అధ్యక్షుడు జగన్‌ మోహన్‌ రెడ్డి ఆహ్వానించే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు.

అయితే పార్టీ అధ్యక్షుడు జగన్‌ కాని - జిల్లాపార్టీ నాయకత్వం కాని మహీధర్‌ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తే ఏమేరకు ఆయన స్పందిస్తారో వేచి చూడాల్సి ఉందని నాయ‌కులు చెప్తున్నారు. మానుగుంట స‌న్నిహితులు అయిన మాజీ జిల్లాపరిషత్ చైర్మన్ ముక్కు కాశిరెడ్డి - మాజీ శాసనసభ్యులు బాచిన చెంచుగరత‌య్య - కేపీ కొండారెడ్డిలతోపాటు పలువురు కొంతమంది నేతలకు పార్టీ సముచిత స్థానం కల్పించే విధంగా హామీలు ఇస్తే మాత్రం ఆ నియోజకవర్గాల్లో వైసీపీని మరింతగా బలోపేతం చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. మొత్తంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి వేసే అడుగు జిల్లా రాజ‌కీయాల్లో ఆ పార్టీ స్థానాన్ని నిర్దేశిస్తుంద‌ని చెప్తున్నారు.