ఆంధప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ , రాష్ట్ర అభివృద్ధి , ప్రజా క్షేమమే ద్యేయంగా పాలన కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీలని ఇప్పటికే నెరవేర్చారు. అలాగే ప్రచార సమయంలో ఇవ్వని హామీలని సైతం తీర్చుతూ ప్రజా సీఎంగా ప్రజల్లో మంచి స్థానాన్ని సంపాదించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రాష్ట్రంలోని రైతులకోసం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఆత్మహత్య చేసుకున్న రైతులు కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం కొత్త జీవోను జారీ చేసింది. వ్యవసాయంలో నష్టాలు, అప్పులు, ఆర్థిక ఇబ్బందులు వంటి కారణాలతో ఆత్యహత్యలు చేసుకున్న రైతులకు గత ప్రభుత్వం హయాంలో రూ. 5 లక్షల పరిహారం ఇచ్చేవారు. జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక..ఆ సాయాన్ని రూ. 7 లక్షలకు పెంచుతూ గత ఏడాది అక్టోబర్ 14న ఉత్తర్వులు ఇచ్చింది. తమది ప్రజల ప్రభుత్వం, మానవత్వం ఉన్న ప్రభుత్వమని.. పాలన కూడా ఆ దిశగానే ఉంటుందని సీఎం జగన్ ఆ సందర్భంగా అన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల పట్ల సానుభూతితో, మానవీయతతో ఉండాలని తెలిపారు.
దీనిపై తాజాగా ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఇందులో భాగంగా .. 2019 జూన్ 1 తర్వాత బలవన్మరణాలకు పాల్పడ్డ రైతుల కుటుంబాలకు పెంచిన పరిహారం అందుతుందని ప్రభుత్వం తెలిపింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రూ. 35.55 కోట్లు పరిహారం విడుదల చేసింది. ఆత్మహత్య చేసుకున్న 627 మంది రైతుల కుటుంబాలకు..వెంటనే పరిహారాన్ని అందించాలని వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.