Begin typing your search above and press return to search.

వారంపాటు విదేశాలకు జగన్‌.. కారణమిదే!

By:  Tupaki Desk   |   10 April 2023 12:00 PM GMT
వారంపాటు విదేశాలకు జగన్‌.. కారణమిదే!
X
వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విదేశీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఏప్రిల్‌ 21 నుంచి వారం రోజుల పాటు ఆయన విదేశాల్లో ఉండనున్నారు. అయితే ఆయన ఏ దేశం వెళ్తారు? ఎక్కడికి వెళ్తారనే అనే విషయాల పై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ఈ పర్యటనలో జగన్‌ తోపాటు ఆయన భార్య భారతి, కుమార్తెలు హర్షా రెడ్డి, వర్షా రెడ్డి కూడా ఉంటారని సమాచారం.

జగన్‌ చివరిసారిగా గతేడాది స్విట్జర్లాండ్‌ లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరయ్యారు. అదే పర్యటనలో లండన్‌ కు వెళ్లారు. జగన్‌ చిన్న కుమార్తెను ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌ లో మేనేజ్‌మెంట్‌ కోర్సులో చేర్పించి వచ్చారు. ఆ తర్వాత ఓ వైపు వివిధ ఎన్నికలు, పరిపాలన పారంగా బిజీ కావడం తదితర కారణాలతో సీఎం జగన్‌ విదేశాలకు వెళ్లలేదు.

ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ 21న కుటుంబంతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్తారని టాక్‌. అయితే ఇది పూర్తిగా అధికారిక పర్యటన కాదని వ్యక్తిగత పర్యటనేనని చెబుతున్నారు. ఇజ్రాయెల్‌ లోని జెరూసలేం వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే జగన్‌ పెద్ద కుమార్తె అమెరికాలోనూ, చిన్న కుమార్తె ఫ్రాన్స్‌ లోనూ మేనేజ్‌మెంట్‌ కోర్సులు చదువుతున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌ అమెరికా, ఫ్రాన్స్‌ లకు వెళ్లే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు.

కాగా అధికారంలోకి వచ్చిన ఈ నాలుగు సంవత్సరాల కాలంలో వైఎస్‌ జగన్‌ విదేశీ పర్యటనలకు వెళ్లిన సందర్భాలు అరుదుగానే ఉన్నాయి . 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక కుటుంబ సభ్యులతో జెరూసలేం వెళ్లారు. ప్రత్యేక ప్రార్థనలు జరిపి ఉన్నారు. ఇజ్రాయెల్‌ లో సాగు విధానం, తదితర విధానాలను కూడా పరిశీలించారు. అప్పుడు నాలుగు రోజులపాటు జగన్‌ విదేశాల్లో ఉన్నారు. 2019లోనే పెద్ద కుమార్తెను యూనివర్సిటీలో చేర్పించడానికి అమెరికా వెళ్లారు. ఆ సందర్భంగా డల్లాస్, డెట్రాయిట్‌ ల్లో ప్రవాసాంధ్రులను కలిశారు.

మరో వచ్చే ఎన్నికల్లో 175కి 175 స్థానాలు సాధించాలనే లక్ష్యంతో జగన్‌ ఉన్నారు. ఈ దిశగా ఇప్పటికే ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జులు జగనన్నే మా భవిష్యత్తు పేరిట ఇంటింటికీ వెళ్తున్నారు. పథకాలు అందుతున్నాయా? వచ్చే ఎన్నికల్లోనూ జగన్‌ కే ఓటేస్తారా? వలంటీర్లు ఇంటికే వచ్చి సంక్షేమ పథకాలు అందించడం బాగుందా? వంటి ప్రశ్నలను అడిగి సర్వే చేస్తున్నారు. పనిలో పనిగా నువ్వే మా నమ్మకం జగన్‌ పేరిట రూపొందించిన స్టిక్కర్లను ప్రజల ఇళ్లకు, మొబైల్‌ ఫోన్లకు అంటిస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఇక పరిపాలనపరంగా, పార్టీ పరంగా జగన్‌ బిజీ షెడ్యూల్‌ తో గడపనున్నారు. ఈ నేపథ్యంలో వారం రోజులపాటు విదేశాల్లో ఈ ఉరుకుల పరుగుల ఒత్తిడి నుంచి జగన్‌ సేదతీరాలని నిర్ణయించినట్టు చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.