Begin typing your search above and press return to search.

మరో సంచలన నిర్ణయం అమలుకు జగన్ నిర్ణయం

By:  Tupaki Desk   |   10 Oct 2019 7:45 AM GMT
మరో సంచలన నిర్ణయం అమలుకు జగన్ నిర్ణయం
X
మాటలు చెప్పటం రాజకీయ నేతలకు అలవాటే. విపక్షంలో ఉన్నప్పుడు తమ చేతికి అధికారం వచ్చినంతనే కొండ మీద కోతిని సైతం కిందకు తీసుకొస్తానని చెప్పటం అలవాటే. కానీ.. పవర్లో లేనప్పుడు చెప్పని హామీల్ని కూడా పవర్ వచ్చిన తర్వాత చేసి చూపించే సరికొత్త సంప్రదాయానికి తెర తీశారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. తాను ఇచ్చిన హామీల్నిఒక్కొక్కటిగా అమలు చేస్తున్న జగన్.. ఎన్నికల వేళ ఇవ్వని హామీల్ని కూడా అమలు చేస్తుండటం ఆసక్తికరంగా మారింది.

వరుస పెట్టి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నజగన్.. తాజాగా మరో కీలక హామీ దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రభుత్వంలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో 50 శాతం బీసీ.. ఎస్సీ.. ఎస్టీ.. మైనార్టీలకు ఇచ్చేందుకు వీలుగా ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ను ఏర్పాటు చేసేందుకు అనుమతిని ఇచ్చేశారు. అంతేకాదు.. మొత్తంగా యాభై శాతం మహిళలకు రిజర్వేషన్లు ఉండాలని కూడా ఆయన నిర్ణయం తీసుకున్నారు.

ఎన్నికలకు ముందు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో యాభై శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న హామీకి అనుగుణంగా తాజాగా ఒక కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి.. వాటి ద్వారా నియామకాలు చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకు అవసరమైన కసరత్తు చేసేందుకు వీలుగా ఒక సమావేశాన్ని నిర్వహించారు. సాధారణ పరిపాలనా శాఖ ఆధ్వర్యంలో నడిచే ఈ కార్పొరేషన్ కు అనుబంధంగా జిల్లా స్థాయిలో విభాగాలు ఉంటాయి. జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రులు ఈ విభాగాల్ని చూస్తుంటారు. ఈ కార్పొరేషన్ కు జిల్లా కలెక్టర్లు ఎక్స్ అఫీషియోలుగా ఉంటారు.

రానున్న రోజుల్లో ఒక వెబ్ పోర్టల్ ద్వారా అవుట్ సోర్సింగ్ నియామకాలు చేపడతారు. డిసెంబరు ఒకటి నుంచి కార్పొరేషన్ పని చేసేలా చర్యలు తీసుకుంటారు. ఎలాంటి మధ్యవర్తులు.. ఏజెన్సీలు లేకుండా తాజాగా ఏర్పాటు చేయనున్న కార్పొరేషన్ ద్వారా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకాలు చేపడతారు. అంతేకాదు.. ఇప్పటివరకూ ఉన్న లోపాల్ని సరిదిద్దేలా కార్పొరేషన్ తో ప్లాన్ చేస్తున్నారు.

ఒకే రకమైన పని చేసే వారికి ఒకే రకమైన జీతాన్ని ఇవ్వాలని నిర్ణయించారు. అంతేకాదు.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఆలస్యంగా జీతాలు ఇచ్చే తప్పుల్ని సరిదిద్దటంతో పాటు.. ఆన్ లైన్ ద్వారా ఉద్యోగులకు నేరుగా జీతాలు చెల్లించాలని నిర్ణయించారు. ఇంతకాలం జరిగిన తప్పుల్ని సరి చేస్తూ.. పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసేలా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఉండటం గమనార్హం.