Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ రూట్ మార్చారు తెలుసా?

By:  Tupaki Desk   |   10 Jun 2016 9:15 AM GMT
జ‌గ‌న్ రూట్ మార్చారు తెలుసా?
X
అనంతపురం జిల్లాలో నిర్వహించిన రైతు భరోసా యాత్రకు వచ్చిన విశేష స్పందనతో ఉత్సాహంగా ఉన్న వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మ‌రో రెండు ల‌క్ష్యాల‌ను సిద్ధం చేసుకొని ముందుకు సాగుతున్నార‌ని చెప్తున్నారు. భరోసా యాత్ర ఉత్సాహంతో కదం తొక్కుతున్న వైకాపా శ్రేణులకు మార్గనిర్దేశనం చేసేందుకు, వచ్చే మూడేళ్ల పాటు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు మార్గం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో గ‌త శైలికి భిన్నంగా పార్టీ నేతల నుంచి అభిప్రాయాలు సేకరించాలని జగన్ నిర్ణయించారు. ఈ నెల 13వ తేదీన విజయవాడలో మేధోమథనం పేరిట విస్తృత స్థాయి సదస్సును నిర్వహించాలని ఆయన డిసైడ‌య్యారు.

టీడీపీ అధినేత‌ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి కావడం, ప్రజల్లో ప్రభుత్వం పట్ల పెరుగుతున్న అసంతృప్తిని పరిగణనలోకి తీసుకుని పార్టీని గ్రామ స్థాయిలో పటిష్ఠం చేసేందుకు ప్రణాళికను ఖరారు చేసేందుకు జ‌గ‌న్ సిద్ధ‌మ‌వుతున్నారని వైసీపీ నేత‌లు అంటున్నారు. టీడీపీ మాదిరిగా వైకాపాకు జిల్లాల్లో పార్టీ నిర్మాణం లేక‌పోవ‌డాన్ని జ‌గ‌న్ గుర్తించారని ఈ నేప‌థ్యంలో వచ్చే ఆరు నెలల్లో అన్ని జిల్లాల్లో బూత్ స్థాయి నుంచి పార్టీని నిర్మించేందుకు పార్టీలోని సీనియర్ నేతల సేవలను వినియోగించుకోనున్నారని స‌మాచారం. అలాగే కాంగ్రెస్ - టీడీపీలోని అసంతృప్తులను - మాజీ ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకునే విషయమై ఈ సమావేశంలో చర్చించనున్నారని తెలుస్తోంది.

ఈ నెల 27వ తేదీ నుంచి హైదరాబాద్ నుంచి అమరావతికి ప్రభుత్వ యంత్రాంగం తరలింపు కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో విజయవాడ కేంద్రంగా వైసీపీ కార్యకలాపాలను నిర్వహించే విషయమై ఈ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌ లోని లోటస్‌ పాండ్ కేంద్రంగా పార్టీ కార్యకలాపాలను నిర్వహిస్తున్న సంగ‌తి తెలిసిందే. మొత్తంగా ప్ర‌తిప‌క్ష పార్టీగా ఇటు ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై పోరాడ‌టం, అదే స‌మ‌యంలో ప్ర‌ధాన పార్టీగా వైఎస్ ఆర్ కాంగ్రెస్‌ ను తీర్చిదిద్దేందుకు జ‌గ‌న్ ఏక‌కాలంలో కృషిచేస్తున్నార‌ని పార్టీ నేత‌లు చెప్తున్నారు.