Begin typing your search above and press return to search.

మోదీతో జగన్ భేటీ...ఏఏ అంశాలను ప్రస్తావించారంటే?

By:  Tupaki Desk   |   12 Feb 2020 1:00 PM GMT
మోదీతో జగన్ భేటీ...ఏఏ అంశాలను ప్రస్తావించారంటే?
X
ఏపీ ముఖ్యమంత్రి హోదాలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ఢిల్లీ టూర్ లో భాగంగా బుధవారం సాయంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కీలక భేటీ నిర్వహించారు. బుధవారం మధ్యాహ్నమే ఢిల్లీ చేరుకున్న జగన్... సాయంత్రం 4 గంటల సమయంలో ప్రధాని వద్దకు చేరుకున్నారు. తనతో భేటీ కోసం వచ్చిన జగన్ ను సాదరంగా ఆహ్వానించిన మోదీ... జగన్ ప్రస్తావించిన అంశాలన్నింటినీ సాంతం ఆసక్తిగా విన్నారట. దాదాపుగా గంటన్నరకు పైగా జరిగిన ఈ భేటీలో జగన్ తాను అనుకున్న అన్ని అంశాలను మోదీ వద్ద ప్రస్తావించారట.

సుదీర్ఘంగా సాగిన ఈ భేటీలో జగన్ ఏఏ అంశాలను ప్రస్తావించారన్న విషయానికి వస్తే... ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా - ప్రాజెక్టులకు నిధులు - విభజన హామీల అమలు తదితరాలను మోదీ వద్ద జగన్ ప్రస్తావించారట. అంతేకాకుండా రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన వివిధ అంశాలపై ప్రధానితో జగన్ కూలంకుషంగా చర్చించారట. ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్రానికి సంబంధించిన పలు డిమాండ్ల సాధన కోసం జగన్‌ ఇటీవలే మోదీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం మోదీతో భేటీ సందర్భంగా లేఖలో పేర్కొన్న అంశాలను జగన్ ప్రస్తావించారట. అలాగే పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించిన రూ.3,800 కోట్లకు పైగా నిధులను విడుదల చేయాల్సిందిగా మోదీని సీఎం కోరారని సమచారం.

గంటన్నరకు పైగా జగన్ చెప్పిన అన్ని అంశాలను విన్న మోదీ... వాటిలో చాలా వాటికి సానుకూలంగానే స్పందించినట్టుగా సమాచారం. రాష్ట్ర ప్రయోజనాలతో పాటు ఇటీవల శాసనమండలిని రద్దు చేస్తూ తాము తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడంతో పాటుగా దానికి ఆమోదం లభించేలా చూడాలని కూడా మోదీని జగన్ కోరారట. అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం ఇటీవలే రూపొందించిన దిశ చట్టానికి కూడా చట్టబద్ధత కల్పించేలా చూడాలని కూడా మోదీని జగన్ కోరారట. మొత్తంగా మోదీ వద్ద ఏఏ అంశాలను ప్రస్తావించాలని జగన్ అనుకున్నారో, వాటన్నింటిని కూడా ప్రధాని వద్ద ప్రస్తావించారట.