Begin typing your search above and press return to search.

త్వరలో.. వైఎస్సార్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అనౌన్స్!

By:  Tupaki Desk   |   8 Sept 2017 10:15 AM IST
త్వరలో.. వైఎస్సార్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అనౌన్స్!
X
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో మరిన్ని మార్పులు వస్తున్నాయి. పార్టీ సంస్థాగతంగా మరిన్ని మార్పులకు సిద్ధం అవుతున్నాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి. ఇప్పటి వరకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నేతలకు వివిధ హోదాలున్నాయి. వ్యక్తితంగా పదవులున్నాయి. అయితే పార్టీకంటూ ఒక గ్రూప్ రెస్పాన్సిబులిటీ ఏమీ లేకుండా పోయింది. కీలక సమయాల్లో కూడా ఎవరికి వారన్నట్టుగా ఉంది పరిస్థితి. అదే పనిగా మీటింగ్ పెడితే తప్ప నేతలు కలిసి కూర్చుని మాట్లాడే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో పార్టీ వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేయనున్నాడట జగన్ మోహన్ రెడ్డి.

ఈ కమిటీలో పద్దెనిమిది మంది ముఖ్యనేతలుంటారని సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలోని ముఖ్యనేతలకు ఇందులో స్థానం ఇవ్వనున్నాడట జగన్. ఈ కమిటీని ఏర్పాటు చేసి.. ప్రతి రెండు వారాలకూ ఒకసారి మీటింగ్ ను షెడ్యూల్ చేస్తున్నారని సమాచారం. ప్రధానంగా వ్యూహ రచన - అధికార పార్టీని ఎదుర్కొనడం - పార్టీని బలోపేతం చేయడానికి తగిన వ్యూహాలను సిద్ధం చేయడం - నియోజకవర్గాల వారీగా సమస్యలపై అధ్యయనం - ఆయా నియోజకవర్గాల్లో పార్టీనేతల వ్యవహరణ తీరు.. వంటి అంశాలపై ఈ కమిటీ అధ్యయనం చేయడం, సమీక్షించడం చేస్తుందని సమాచారం. ఓవరాల్ గా ఈ వర్కింగ్ కమిటీ కీలకం అని - డెసిషన్ మేకింగ్ అంతా ఈ కమిటీ చేతుల్లోనే ఉంటుందని తెలుస్తోంది.

జగన్ పాదయాత్ర మొదలుపెట్టక ముందే కమిటీ ఏర్పాటు అవుతుందని.. తెలుస్తోంది. పార్టీ బలోపేతం - మెనిఫెస్టో రూపకల్పన - అధికార పార్టీ వైపల్యాలను ఎండగట్టడం - తమ పార్టీ బలాలను బలహీనతలను గుర్తించడం - తగిన అభ్యర్థులను ఎంపిక చేయడం - ప్రశాంత్ కిషోర్ ఇచ్చే రిపోర్ట్స్ ని పరిశీలించడం - రాష్ట్ర సమస్యల విషయంలో ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావడం వంటి లక్ష్యాలతో ఈ కమిటీని ఏర్పాటు చేయనున్నాడట జగన్ మోహన్ రెడ్డి.

మరి పార్టీని సంస్థాగతంలో బలోపేతం చేయడంలో ఈ కమిటీ కీలకం అని చెప్పాలి. ఇన్నేళ్ల ప్రయాణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి కమిటీ ఏదీ లేకపోవడం ఒకరకంగా లోటే. దాన్ని పూరించడం మీద జగన్ దృష్టి పెట్టాడని స్పష్టం అవుతోంది.