Begin typing your search above and press return to search.

హైద‌రాబాద్ లో మూడు రోజులు ఉండ‌నున్న జ‌గ‌న్‌!

By:  Tupaki Desk   |   25 Jun 2019 6:57 AM GMT
హైద‌రాబాద్ లో మూడు రోజులు ఉండ‌నున్న జ‌గ‌న్‌!
X
ఇరుగుపొరుగు రాష్ట్రాలు.. అందునా ఒకే భాష మాట్లాడే ప్ర‌జ‌ల మ‌ధ్య సోద‌ర‌భావం చాలా అవ‌స‌రం. అందులోకి అర‌వై ఏళ్లు క‌లిసి ఉండి.. విడిపోయిన త‌ర్వాత రెండు రాష్ట్రాల‌కు చెందిన ప్ర‌జ‌లే కాదు.. ప్ర‌భుత్వాల మ‌ధ్య కూడా స‌న్నిహిత సంబంధాలు అవ‌స‌రం. ఒక‌రి ప్ర‌యోజ‌నాలు ఒక‌రు గౌర‌వించుకుంటూ.. ఇచ్చిపుచ్చుకునే ధోర‌ణి ఉంటే మిగిలిన రాష్ట్రాల కంటే మిన్న‌గా అభివృద్ధిలో దూసుకెళ్లే అవ‌కాశం ఉంటుంది.

విభ‌జ‌న త‌ర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏర్ప‌డిన ప్ర‌భుత్వాల మ‌ధ్య సంబంధాలు స‌రిగా లేని కార‌ణంగా ఐదేళ్ల విలువైన కాలం వృధా అయ్యింది. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల మ‌ధ్య చ‌క్క‌టి సంబంధాలు ఉండ‌టం.. ఒక‌రి ప‌ట్ల మ‌రొక‌రికి గౌర‌వాభిమానాలు ఉన్న నేప‌థ్యంలో ప‌రిస్థితుల్లో మార్పులు వ‌స్తున్నాయి.

ఏపీలో ప్ర‌భుత్వం ఏర్ప‌డి కేవ‌లం నెల కాకుండానే ఇరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు ప‌లు సంద‌ర్భాల్లో క‌ల‌వ‌టం.. మాట్లాడుకోవ‌టం క‌నిపిస్తుంది. అంతేకాదు.. ప్ర‌తి స‌మావేశంలోనూ కొత్త నిర్ణ‌యాలు తీసుకోవ‌టం.. రెండు రాష్ట్రాల ప్ర‌యోజ‌నాల గురించి మాట్లాడుకోవ‌టం క‌నిపిస్తోంది.

రెండు రాష్ట్రాల్లోని జ‌ల‌వ‌న‌రుల్ని ప్ర‌భావ‌వంతంగా వినియోగించుకోవాల‌ని త‌పిస్తున్న ఇరువురు ముఖ్య‌మంత్రులు ఆ దిశ‌గా ఇప్ప‌టికే కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఒక అడుగు ముందుకేసి తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణా.. గోదావ‌రి నీటితో ప్ర‌తి ప్రాంతానికి చేరేలా చేయ‌ట‌మే త‌మ ధ్యేయంగా చెప్పారు.

ఇటీవ‌ల జ‌రిగిన స‌మావేశంలో ఇరువురు ముఖ్య‌మంత్రులు గోదావ‌రి నీటిని 1480 టీఎంసీలు.. కృష్ణా నీటిని 811 టీఎంసీలు ఉమ్మ‌డి ఏపీకి కేటాయించాల‌న్న ఒప్పందానికి వ‌చ్చారు. ఈ నేప‌థ్యంలో ఈ నెల 28.. 29 రోజుల్లో ముఖ్య‌మంత్రులు ఇద్ద‌రూ మ‌రో ద‌ఫా స‌మావేశం కానున్నారు. ఇదిలా ఉంటే.. ఈ నెల 26న జ‌గ‌న్ హైద‌రాబాద్‌ కు వెళ్ల‌నునున్నారు. మూడు రోజుల పాటు ఆయ‌న అక్క‌డే ఉండ‌నున్నారు.

ఇంత‌కీ హైద‌రాబాద్ లో మూడు రోజులు ఉండ‌నున్న జ‌గ‌న్ ఏం చేయ‌నున్నార‌న్న విష‌యంలోకి వెళితే.. జ‌గ‌న్ వ్య‌క్తిగ‌త ప‌నులు కొన్ని ఉన్నాయ‌ని.. వాటిని పూర్తి చేసేందుకు ఆయ‌న హైద‌రాబాద్ లో ఉండ‌నున్న‌ట్లు చెబుతున్నారు. అదే స‌మ‌యంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తో ఒక ద‌ఫా కానీ.. రెండుసార్లు స‌మావేశం అయ్యే అవ‌కాశం ఉంటుంద‌ని చెబుతున్నారు. కేసీఆర్ నివాస‌మైన ప్ర‌గ‌తి భ‌వ‌న్ కు జ‌గ‌న్ వెళ్లి చ‌ర్చ‌లు జ‌ర‌ప‌నున్నారు. ఈ చ‌ర్చ‌ల అనంత‌రం తెలంగాణ అధికారులు అమ‌రావ‌తికి వ‌చ్చి ఏపీ అధికారుల‌తో భేటీ కానున్నారు. చూస్తుంటే.. ఇరిగేష‌న్ విష‌యంలో రెండు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు అమిత‌మైన ప్రాధాన్య‌త ఇవ్వ‌టంతో పాటు.. రెండు రాష్ట్రాల మ‌ధ్య‌నున్న స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించుకోవాల‌న్న‌ట్లుగా ఉండ‌టం క‌నిపిస్తోంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.