Begin typing your search above and press return to search.

హంగామా చేసి ఆస్పత్రి చేరాలనుకుంటున్నజగన్

By:  Tupaki Desk   |   11 Oct 2015 4:02 AM GMT
హంగామా చేసి ఆస్పత్రి చేరాలనుకుంటున్నజగన్
X
ప్రత్యేక హోదా దీక్ష ఆదివారంతో చెల్లుచీటీ పలుకనున్నారా? విశ్వసనీయ సమాచారం ప్రకారం వైకాపా అధినేత అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరులో ఈ నెల 7న ప్రారంబించిన ప్రత్యేక హోదా దీక్షను ఆదివారానికి విరమించుకోవచ్చునని తెలుస్తోంది. అ:టే తాను గా విరమించుకున్నట్లు కాకుండా.. పోలీసులు భగ్నం చేసినట్లుగా ఒక బిల్డప్ తో ఆస్పత్రికి చేరుకోవచ్చునని సమాచారం. అయితే దీనికి కేవలం జగన్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడం ఒక్కటే మాత్రం కారణం కాదని సమాచారం. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి గుంటూరు పోలీసులకు వచ్చిన ఆదేశాల ప్రకారం ఆదివారం సాయంత్రానికల్లా జగన్ దీక్షను నిర్బంధంగా ముగించనున్నారు. అమరావతిలో రాజధాని శంకుస్థాపన పనులకు జగన్ దీక్ష అంతరాయం కలిగించేలా ఉండటంతో ఎట్టిపరిస్థితుల్లోనూ జగన్ దీక్ష ఆదివారం తర్వాత కొనసాగకూడదని ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. నిరాహార దీక్ష కొనసాగితే వైకాపా భారీ సంఖ్యలో జనాలను వేదిక వద్దకు తీసుకువస్తుందని ఇది చంద్రబాబును చికాకు పెడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. కాకపోతే.. దీక్ష ముగిసిపోవడానికి సంబంధించి.. జగన్ ప్రభుత్వాన్ని నిందించకుండా.. వారు జగన్ ను ఇబ్బంది పెట్టకుండా.. మొక్కుబడి తంతులో.. జగన్ దీక్షను ఒక కొలిక్కి తీసుకువచ్చేస్తారని అంతా అనుకుంటున్నారు.

మరోకారణం ఏమిటంటే జగన్ సైతం నిరవధిక నిరాహార దీక్షను ఎక్కువ కాలం కొనసాగించకూడదని నిర్ణయించుకున్నారట. రోజులు గడిచే కొద్దీ దీక్షా శిబిరంవద్ద హాజరవుతున్న జనాల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. మీడియాలో కాస్త జనం ఎక్కువ కనిపించే సమయాల్లో మాత్రం లైవ్ లు ఇస్తూ, మేనేజి చేస్తూ.. నానా పాట్లు పడుతున్నారు గానీ.. దీక్షకు మద్దతు ఊహించినంతగా లేదనే జగన్ వర్గం భావిస్తున్నది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో విద్యార్థులు, ఇతర వర్గాలతో జరిపిన సమావేశాలు కూడా.. పెద్దగా రిజల్టు ఇచ్చినట్టు లేదని వారు భావిస్తున్నారుట. పార్టీ వర్గాలు పోగు చేసిన జనాలు కూడా ఏమంత ప్రోత్సాహకరంగా లేరని, ఇది పేలవ ప్రదర్శనగా మారకముందే జగన్ కాస్త హంగామా సృష్టించి తర్వాత ఆసుపత్రికి వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ మొత్తం వ్యవహారంలో బాధాకరమైన విషయం ఏమిటంటే, ఆంధ్రప్రజలు నిజంగానే ప్రత్యేక హోదా పట్ల పట్టింపుతో ఉన్నారా అని. అటు కేంద్రం, ఇటు రాష్ట ప్రభుత్వం ప్రత్యేక హోదా అంశంపై తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్సిస్తున్న నేపథ్యంలో జగన్ దీక్ష జనం మొత్తంలో కాస్త కదలిక తెస్తుందని భావించారు కానీ హాజరైన వారి కంటే బయట ఉన్నవారి స్పందన దిగ్భ్రాంతి కలిగించేటంత స్వల్పంగా ఉండటం కొత్త ఆలోచనలకు వీలు కల్పిస్తోంది. నిరాశలో కూరుకుపోయిన ప్రజలు జరుగుతున్న పరిణామాల పట్ల స్తబ్దంగా ఉండటమే మంచిదని భావిస్తున్నారా?