Begin typing your search above and press return to search.

కీలక సామాజికవర్గంపై జగన్‌ కన్ను.. అందుకేనా టీడీపీ నేతకు గాలం!

By:  Tupaki Desk   |   14 Feb 2023 9:49 AM GMT
కీలక సామాజికవర్గంపై జగన్‌ కన్ను.. అందుకేనా టీడీపీ నేతకు గాలం!
X
కృష్ణా, ఏలూరు జిల్లాల్లో కీలకమైన సామాజికవర్గంపైన వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కన్నేశారా అంటే అవుననే చర్చ నడుస్తోంది. తాజాగా ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కైకలూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి జయమంగళ వెంకట రమణకు గాలం వేశారని టాక్‌ జోరుగా జరుగుతోంది.

2009 ఎన్నికల్లో జయమంగళ వెంకట రమణ కైకలూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో టీడీపీ–బీజేపీ పొత్తులో భాగంగా ఈ సీటును బీజేపీకి కేటాయించడంతో ఆ పార్టీ తరఫున కామినేని శ్రీనివాస్‌ కైకలూరు నుంచి విజయం సాధించారు. అంతేకాకుండా బీజేపీ కోటాలో కీలకమైన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగానూ నియమితులయ్యారు.

ఇక 2019లో టీడీపీ, బీజేపీ పొత్తు విడిపోవడంతో కైకలూరు నుంచి టీడీపీ తరఫున మరోమారు జయమంగళ వెంకటరమణ పోటీ చేశారు. అయితే వైసీపీ అభ్యర్థి కాపు సామాజిక వర్గానికి చెందిన దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్‌) చేతిలో ఓటమి పాలయ్యారు.

కాగా జయమంగళ వెంకట రమణ.. వడ్డీలు సామాజికవర్గానికి చెందినవారు. ఈ వడ్డీ సామాజికవర్గం వారు కృష్ణా, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో నాలుగు నియోజకవర్గాల్లో కీలకంగా ఉన్నారని చెబుతున్నారు. కైకలూరు నియోజకవర్గంతోపాటు కొల్లేరు సర స్సు పరిధిలో ఉన్న ఉండి, దెందులూరు, ఉంగుటూరు నియోజకవర్గాల్లో వడ్డీలు భారీ సంఖ్యలో ఉన్నారని సమాచారం.

మరోవైపు వచ్చే ఎన్నికల్లో టీడీపీ–జనసేన పొత్తు కుదిరే అవకాశాలున్నాయని టాక్‌ నడుస్తోంది. ఈ నేపథ్యంలో కైకలూరు సీటును జనసేన కోరుతుందన్న అంచనాలు ఉన్నాయి. కైకలూరులో కాపు సామాజికవర్గం ప్రభావం ఎక్కువ. 2009లో ఇక్కడ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ కేవలం 1000లోపు ఓట్ల తేడాతోనే ఓడిపోయింది.

జనసేనకు కైకలూరు సీటు కేటాయిస్తే తనకు సీటు మరోమారు గల్లంతేనని జయమంగళ వెంకట రమణ భావిస్తున్నారు. ఆయన వైసీపీలో చేరడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే సీఎం జగన్‌ ను కలుస్తానని ఆయన తేల్చిచెప్పడం గమనార్హం. కొల్లేరు సమస్యలపై జగన్‌ ను కలుస్తానని చెబుతున్నప్పటికీ ఆయన చేరికకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని అంటున్నారు.

మరోవైపు గత కొద్దిరోజులుగా బీసీ జపం చేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌.. వడ్డీలు సామాజికవర్గంపై కన్నేశారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వడ్డీలు సామాజికవర్గానికి చెందిన జయమంగళ వెంకట రమణకు ఎమ్మెల్సీ ఇవ్వడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని అంటున్నారు.

వచ్చే మార్చిలో ఏపీలో ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల కోటాలో ఖాళీ అవుతున్న సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. వీటిలో ఒకదాన్ని జయ మంగళ వెంకట రమణకు కేటాయిస్తారని చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.