Begin typing your search above and press return to search.

మండ‌లి ర‌ద్దు గురించి ముఖ్య‌ నేత‌ల‌తో జ‌గ‌న్ చ‌ర్చ‌లు

By:  Tupaki Desk   |   25 Jan 2020 9:48 AM GMT
మండ‌లి ర‌ద్దు గురించి ముఖ్య‌ నేత‌ల‌తో జ‌గ‌న్ చ‌ర్చ‌లు
X
ఏపీ శాస‌న‌మ‌డ‌లి ర‌ద్దు గురించి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న పార్టీ ముఖ్య నేత‌ల‌తో చ‌ర్చిస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. అలాగే ఈ వ్య‌వ‌హారం పై ఏజీ స‌ల‌హాలు కూడా తీసుకుంటున్న‌ట్టుగా తెలుస్తోంది. మండ‌లి ర‌ద్దు నిర్ణ‌యాన్ని తీసుకుంటే ఏమ‌వుతుంది, మండ‌లిని కొన‌సాగిస్తే ఎలా ఉంటుంద‌నే అంశాలే జ‌గ‌న్ ప్ర‌ధానంగా చ‌ర్చిస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. మండ‌లిని కొన‌సాగించాలా వ‌ద్దా.. అనే అంశం గురించి సోమ‌వారం చ‌ర్చ జ‌ర‌గ‌బోతూ ఉంది. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముందుగానే కొంద‌రు ముఖ్యుల‌తో ఈ అంశం మీద చ‌ర్చలు జ‌రుపుతూ ఉన్నార‌ని తెలుస్తోంది.

ఈ చ‌ర్చ‌ల్లో మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డితో పాటు ఏజీ పాల్గొంటున్న‌ట్టుగా తెలుస్తోంది. మండ‌లి ర‌ద్దు తీర్మానాన్ని ఏపీ అసెంబ్లీ చేసినా.. దాన్ని కేంద్రం ఆమోదించాల్సి ఉంటుంది. అంటే.. ఈ అంశం పై లోక్ స‌భ‌లో, రాజ్య‌స‌భ‌ లో ఆమోదం ల‌భించాల్సి ఉంటుంది. అప్పుడే మండ‌లి ర‌ద్దు అవుతుంది.

ఏపీ ప్ర‌భుత్వం మండ‌లిని ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నా.. దానికి బీజేపీ కేంద్రంలో ఒప్పుకుంటేనే మండ‌లి ర‌ద్దు అవుతుంది. ప్ర‌స్తుతానికి అయితే బీజేపీ ఓకే అంటే లోక్ స‌భ వ‌ర‌కూ ఆ తీర్మానం ఆమోదం పొందుతుంది. కానీ..రాజ్య‌స‌భ‌లో బీజేపీకి కూడా గ‌ట్టి బ‌లం లేదు! అక్క‌డ కాంగ్రెస్ మ‌ద్ద‌తు కూడా అవ‌స‌రం కావొచ్చు. జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యం కాబ‌ట్టి కాంగ్రెస్ వ్య‌తిరేకించ‌వ‌చ్చు. ఈ అంశాల‌న్నింటినీ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకునే వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మండ‌లి మీద ఒక నిర్ణ‌యానికి వ‌చ్చే అవ‌కాశం ఉంది.

అలాగే..మండ‌లిని కొన‌సాగిస్తే అనే అంశం గురించి కూడా చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్టుగా తెలుస్తోంది. మ‌రో ఏడాదిలో వైసీపీకి మండ‌లిలో బ‌లం పెరిగే అవ‌కాశం ఉంది. మ‌రి కొంత‌మంది తెలుగుదేశం ఎమ్మెల్సీలు గ‌నుక రాజీనామా బాట ప‌డితే.. లేదా త‌ట‌స్థంగా మారిపోతే.. అప్పుడు స‌భ‌లో తెలుగుదేశం ఆట‌లు కూడా అంత ఈజీగా సాగ‌వు. ఈ ప‌రిణామాల గురించి కూడా జ‌గ‌న్ స‌మాలోచ‌న‌లు చేస్తున్న‌ట్టుగా స‌మాచారం.