Begin typing your search above and press return to search.

జగన్ సర్కార్ సంచలనం..ఏపీలో ఉమ్మేస్తే జైలుకే..

By:  Tupaki Desk   |   12 April 2020 11:31 AM GMT
జగన్ సర్కార్ సంచలనం..ఏపీలో ఉమ్మేస్తే జైలుకే..
X
ఏపీలో ఉమ్మివేసే ముందు తస్మాత్ జాగ్రత్త.. నోట్లో నీళ్లు పోసుకొని.. పాన్, గుట్కా, జర్దా నములుతూ తుపుక్కున ఉమ్మారో మీ పని ఖతమవుతుంది. కరోనాకు ముందు ఉమ్మితే లైట్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు కరోనా టైంలో ఉమ్మేస్తే మీపై కేసులు, జైలు పాలు కావడం ఖాయం..

కరోనా కల్లోలం ఏపీలో కొనసాగుతూనే ఉంది. వైరస్ వ్యాప్తి పెరుగుతూనే ఉంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరగడంతో దాన్ని అదుపు చేయడానికి ఏపీలోని జగన్ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది.

ఇక నుంచి ఏపీలో బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడాన్ని నిషేధిస్తున్నట్టు జగన్ సర్కార్ ప్రకటించింది. రోడ్లపై ఉమ్మివేయడం.. ఖైనీ - తంబాకు వంటి పొగాకు ఉత్పత్తులు నమిలి రోడ్డుపై ఉమ్మివేయడాన్ని నిషేధించింది.

ఎవరైనా సరే ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై ఐపీసీ 1860 - సీఆర్సీసీ చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి జైలుకు పంపేలా ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో ఇప్పటికే ఈ రూల్ అమలు కాగా తాజాగా ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోంది.

*ఏపీ ప్రజలకు ఉచితంగా మాస్కులు..

ఆంధ్రప్రదేశ్‌ లోని ప్రజలందరికీ మాస్క్‌లు ఉచితంగా పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కొవిడ్‌ నివారణ చర్యలపై ఆదివారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం.. పలు సూచనలు చేశారు. ప్రతి వ్యక్తికి మూడు మాస్క్‌ లు చొప్పున మొత్తం 16 కోట్ల మాస్కులు పంపిణీ చేయాలని ఆదేశించారు. హైరిస్క్ ఉన్నవారిపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు.

రాష్ట్రంలోని 1.47 కోట్ల కుటుంబాల్లో 1.43 కోట్ల కుటుంబాలపై మూడో విడత సర్వే పూర్తయిందని ఈ సందర్భంగా అధికారులు సీఎంకు వివరించారు. శనివారం రాత్రి వరకు 32,349 మందిని రిఫర్‌ చేయగా.. వీరిలో 9,107 మందికి పరీక్షలు అవసరమని వైద్యులు నిర్ధారించారు.