Begin typing your search above and press return to search.

ఆ మీడియా ప్ర‌తినిధుల‌కు షాకిచ్చిన జ‌గ‌న్

By:  Tupaki Desk   |   8 March 2018 10:30 AM GMT
ఆ మీడియా ప్ర‌తినిధుల‌కు షాకిచ్చిన జ‌గ‌న్
X
ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఈ రోజు కాసింత ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. త‌మ పార్టీ కేంద్ర‌మంత్రుల్ని రాజీనామా చేసేలా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నిర్ణ‌యం తీసుకోవ‌టం తెలిసిందే. అర్థ‌రాత్రికి కాస్త అటూఇటూగా ప్రెస్ మీట్ పెట్టిన సీఎం.. త‌న నిర్ణయాన్ని వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం మోడీ కేబినెట్లో ఉన్న మంత్రులు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేస్తార‌ని.. అనంత‌రం భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌ను వెల్ల‌డిస్తామ‌ని చెప్ప‌టం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. ఈ రోజు ఉద‌యం పాద‌యాత్ర‌లో ఉన్న జ‌గ‌న్ మీడియా స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా త‌న ప్రెస్ మీట్‌కు హాజ‌రైన విలేక‌రుల్ని ప‌రిచ‌యం చేసుకోమ‌న్నారు. ప‌లువురు జ‌ర్న‌లిస్టులు త‌మ‌ను తాము ప‌రిచ‌యం చేసుకుంటూ తాము ఏ మీడియా సంస్థ‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నామో చెప్పారు.

ఇదిలా ఉండ‌గా ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి ప్ర‌తినిధులు త‌మ ప‌రిచ‌యం చేసుకున్నారు. దీనికి స్పందించిన జ‌గ‌న్‌.. త‌న మీడియా స‌మావేశానికి ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి ఛాన‌ల్‌.. పేప‌ర్ ప్ర‌తినిధులు రావాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. త‌మ‌కు వారికి మ‌ధ్య కోర్టులో కేసు న‌డుస్తోంద‌న్నారు.

త‌న కార్య‌క్ర‌మాల‌కు ఆ మీడియా సంస్థ‌కు చెందిన ప్ర‌తినిధుల‌ను ఆహ్వానించ‌లేద‌ని. అయినా ఎలా వ‌చ్చార‌ని ప్ర‌శ్నించారు. త‌మ మీద ఎలాంటి ఆధారాలు లేకుండానే వార్త‌లు ఇచ్చిన‌ట్లుగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈసారికి వ‌చ్చారు కాబ‌ట్టి స‌రిపోయింది కానీ.. త‌ర్వాత రోజుల్లో జ‌రిగే కార్యక్రమాలకు స‌ద‌రు మీడియా సంస్థ‌ల ప్ర‌తినిధులు రావొద్ద‌న్నారు. ఈ సంభాష‌ణ అంతా మీడియాలో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం కావ‌టంతో.. స‌ద‌రు మీడియా సంస్థ‌కు చెందిన ప్ర‌తినిధులు తీవ్ర ఇబ్బందికి గురైన‌ట్లు చెబుతున్నారు.

ఈ ప్రెస్ మీట్లో మాట్లాడిన సంద‌ర్భంలో ఏపీ అధికార‌ప‌క్ష నేత ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ పేరుతో ఒక్కో ప్ర‌జాప్ర‌తినిధిని రూ.20 నుంచి రూ.30 కోట్లు పెట్టి కొనుగోలు చేశార‌ని.. అయిన‌ప్ప‌టికీ కొన్ని మీడియా సంస్థ‌లు ఈ త‌ర‌హా అంశాల‌పై పెద్ద‌గా దృష్టి పెట్ట‌టం లేద‌ని త‌ప్పు ప‌ట్టారు. మీడియా సంస్థ‌ల‌కు ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ కొన్ని సూచ‌న‌లు చేయ‌టం గ‌మ‌నార్హం.