Begin typing your search above and press return to search.

జగన్ మార్కు మీడియా ప్రక్షాళన..తిరుమల నుంచే షురూ!

By:  Tupaki Desk   |   1 Nov 2019 1:30 AM GMT
జగన్ మార్కు మీడియా ప్రక్షాళన..తిరుమల నుంచే షురూ!
X
ఏపీకి కొత్త సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... తన ప్రమాణ స్వీకారం రోజుననే... గతి తప్పిన మీడియాను చక్కదిద్దుతానని - ఒక వర్గానికి కొమ్ము కాస్తూ ఇప్పటిదాకా సాగిన మీడియా ఆటలిక చెల్లబోవని చాలా క్లారిటీగానే సంచలన ప్రకటన చేశారు కదా. ఆ ప్రకటన మేరకే జగన్ ఇప్పుడు మీడియా ప్రక్షాళనపై దృష్టి సారించేశారని చెప్పక తప్పదు. ఓ వైపు ప్రభుత్వ కార్యకలాపాలపై తప్పుడు కథనాలు రాసే మీడియాపై కేసులు నమోదుకు నేరుగా ఆయా శాఖల అధిపతులకు అధికారాలను కట్టబెట్టేసిన జగన్... ఆయా మీడియా సంస్థల అండ చూసుకుని చెలరేగిపోతున్న కొందరు విలేకరులపైనా కొరడా ఝుళిపించేందుకు రంగం సిద్ధం చేసేశారు. ఈ తరహా నయా ప్రక్షాళనను జగన్ ఏకంగా తిరుమల వెంకన్న సన్నిధి నుంచే మొదలుపెట్టిన వైనం ఇప్పుడు నిజంగానే ఆసక్తికరంగా మారిపోయింది.

తిరుమల కొండపై లాబీయింగ్ లు - మధ్యవర్తిత్వాలు - దళారీ పనులు - కమీషన్ల అడ్డంగా దోచేస్తూ... ఈ అవినీతి దందాలో పాతుకుపోయిన మీడియా ప్రతినిధులపై జగన్ సర్కారు భారీగానే గురిపెట్టింది. కల్యాణం టిక్కెట్లు - ప్రత్యేక దర్శనాలు - వీఐపీ పాసుల మంజూరులో మీడియా ప్రమేయాన్ని పూర్తిగా తగ్గిస్తూ చర్యలకు శ్రీకారం చుట్టేసింది. ప్రస్తుతం తిరుమల కొండపై మీడియా ఉద్యోగం అంటే కలెక్టర్ గిరీతో సమానంగానే పరిణిస్తున్నారు. మీడియాకు నడిచినట్టుగా టీడీటీ ఉద్యోగులకు కూడా నడవదనేది బహిరంగ రహస్యం. ప్రతి మీడియా సంస్థకు చెందిన రిపోర్టర్ కు కొండపై షాపులు ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పోటు నుంచి లడ్డూల్ని బయటకు తీసుకొచ్చి బ్లాక్ లో అమ్మడం - రూములు ఇప్పించడం అనేది వీళ్లకు చాలా చిన్న పని. ఇందుకోసం తమ దగ్గరే చిరుద్యోగుల్ని మెయింటైన్ చేస్తూ - వాళ్లతో ఇలాంటి పనుల్ని మీడియా ప్రతినిధులు చేయిస్తున్నారట. కల్యాణం టిక్కెట్లు - ప్రత్యేక వీఐపీ దర్శనాలతో పాటు తిరుమల కొండపై షాపుల నుంచి వసూళ్లు, కొన్ని అతి ప్రత్యేకమైన స్వామివారి సేవా టిక్కెట్లు అందించడం లాంటి పనులు మాత్రమే మెయిన్ రిపోర్టర్లు రంగంలోకి దిగుతారు. ఇలాంటి పనులు చేస్తూ రోజుకు లక్ష రూపాయలు ఆర్జించే మీడియా ప్రతినిధి కూడా కొండపై ఉన్నాడంటే ఆశ్చర్యం కలగక మానదు.

వీటన్నింటిపై జగన్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిపెట్టి టీటీడీకి పదునైన కత్తులనే అందజేసిందని చెప్పాలి. మీడియా సిఫార్సు లేఖలను క్షుణ్నంగా పరిశీలిస్తున్న అధికార యంత్రాంగం... అక్కడితో ఆగకుండా లెటర్ హెడ్ ఆధారంగా సదరు మీడియా ప్రతినిధులకు ఫోన్ చేసి నిర్థారించుకునే కార్యక్రమం ప్రారంభించింది. తాజాగా టీటీడీ విజిలెన్స్ చేపట్టిన తనిఖీల్లో బయటపడిన అక్రమాల్లో దాదాపు 90శాతం మీడియా ప్రతినిధులు చేసినవేనట. సదరు జర్నలిస్టుల పేర్లతో పాటు ఆగడాల చిట్టాను సంబంధిత పత్రికలు - ఛానెళ్లకు యంత్రాంగం అందజేసిందట. దీంతో ఆయా మీడియా సంస్థల్లోని ఈ తరహా ప్రతినిధుల కూడా ఏరివేత మొదలైనోయింది. పదేళ్లకు పైగా కొండపై తిష్టవేసిన ఓ పెద్దపత్రిక మీడియా ప్రతినిధిని ఆ బాధ్యతల నుంచి సదరు మీడియా తప్పించక తప్పలేదు. ఈ ఒక్క ఏడాదే అతడు 800కు పైగా వీఐపీ టిక్కెట్లు దక్కించుకున్నాడట. వాటిలో సదరు సంస్థ సిఫార్సు మేరకు ఇచ్చిన టిక్కెట్లు పట్టుమని 80 కూడా లేవట. ఇక సమాజం కోసం పాటుపడుతున్నామని చెప్పుకునే ఓ టీవీ ఛానెల్ రిపోర్టర్ వ్యవహారం కూడా బట్టబయలైంది. ఈ 10 నెలల్లో ఆ రిపోర్టర్ వివిధ సేవల పేరిట 700కు పైగా వీఐపీ టిక్కెట్లు దక్కించుకున్నాడు. అన్నీ బ్లాకులో అమ్ముడుపోయాయి. అతడ్ని కూడా సాగనంపేందుకు రంగం సిద్ధమైంది. మొత్తంగా మీడియా ప్రక్షాళనను జగన్ ఏకంగా తిరుమల కొండపై నుంచే మొదలెట్టిన వైనం ఆసక్తి రేకెత్తిస్తోంది.