Begin typing your search above and press return to search.

లిక్కర్ బ్యాన్ లో జగన్ తొలి అడుగేసినట్టే

By:  Tupaki Desk   |   2 Jun 2019 2:09 PM GMT
లిక్కర్ బ్యాన్ లో జగన్ తొలి అడుగేసినట్టే
X
తాను అధికారంలోకి వస్తే... రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తానని వైసీపీ అధినేత - ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. విపక్ష నేతగా ఉన్న సమయంలోనే జగన్ ఈ మేరకు ప్రకటన చేశారు. మొన్నటి ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఆయన పార్టీకి బ్రహ్మరథం పట్టారు. దీంతో సీఎంగా పదవీ ప్రమాణం చేసిన జగన్... తాను ఇచ్చిన హామీలను ఒక్కటొక్కటి సమీక్షించుకుంటూ సాగుతున్నారు. ఇందులో భాగంగా మద్యపాన నిషేదంపై ఆయన దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. ఎక్సైజ్ శాఖ సమీక్షలో భాగంగా ఈ దిశగా చర్యలు మొదలెట్టిన జగన్... మద్యపాన నిషేదాన్ని పక్కాగా అమలు చేయాలంటే... ముందుగా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద నెట్ వర్క్ గా ఏర్పడ్డ బెల్ట్ షాపులను మూసేయించాల్సిందే. బెల్ట్ షాపులను మూయకుండా మద్యపాన నిషేదం అమలు దుస్సాధ్యమే.

ఈ విషయాన్ని ముందుగానే గుర్తించిన జగన్... మద్యపాన నిషేదాని కంటే ముందుగా బెల్ట్ షాపుల నిర్మూలనకు ఏం చేస్తే సత్ఫలితాలు వస్తాయన్న విషయంపై దృష్టి సారించారట. ఇందులో భాగంగా బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేస్తున్న మద్యం డీలర్లను కట్టడి చేస్తే సరిపోతుందని గుర్తించారట. మరి లాభాలకు ఆశపడి... స్థాయికి మించి టెండర్లు పాడి - కోట్ల మేర ధరావతును చెల్లించిన మద్యం వ్యాపారులు బెల్ట్ షాపులను నిర్మూలస్తే ఊరుకుంటారా? ఊరుకోక చేసేదేమీ లేదు గానీ... గుట్టుచప్పుడు కాకుండా బెల్ట్ షాపులను కొనసాగిస్తారు. ఈ విషయాన్ని కూడా గుర్తించిన జగన్... బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేసే మద్యం వ్యాపారుల లైసెన్స్ లను రద్దు చేసే దిశగా సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారట. ఇందుకోసం ప్రస్తుతం అమలవుతున్న మద్యం పాలసీని మార్చేందుకు కూడా వెనుకాడేది లేదని జగన్ తేల్చి చెప్పినట్టుగా సమాచారం. మొత్తంగా బెల్ట్ షాపులను రద్దు చేయాలని దాదాపుగా కంకణం కట్టుకున్న జగన్... దీనిని సక్సెస్ ఫుల్ గా చేస్తే మద్యపాన నిషేదంలో తొలి అడుగు వేసినట్టేనన్న విశ్లేషణలు సాగుతున్నాయి.