Begin typing your search above and press return to search.

ఉత్తరాంధ్రలో కీలక నేతపై వేటు వేసిన జగన్‌!

By:  Tupaki Desk   |   8 Feb 2023 2:00 PM GMT
ఉత్తరాంధ్రలో కీలక నేతపై వేటు వేసిన జగన్‌!
X
ఏపీలో వైసీపీలో ప్రస్తుతం బహిష్కరణల వేటు కొనసాగుతోంది. తాజాగా నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డిలను నియోజకవర్గ ఇంచార్జులుగా వైసీపీ అధిష్టానం తొలగించిన సంగతి తెలిసిందే. ఇటీవల నర్సాపురం మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడును, పామర్రు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ట స్వామిదాసును వైసీపీ అధిష్టానం పార్టీ నుంచి సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే.

ఈ కోవలో ఇప్పుడు ఉత్తరాంధ్రకు చెందిన కీలక నేతను వైసీపీ పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. అనకాపల్లి జిల్లాలో పెందుర్తి నియోజకవర్గంలో బలమైన నాయకుడిగా ఉన్న శరగడం చిన అప్పలనాయుడును వైసీపీ అధిష్టానం పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది.

టీడీపీ అర్బన్‌ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న శరగడం చిన అప్పలనాయుడు 2019 ఎన్నికల ముందు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి సమక్షంలో శరగడం చిన అప్పలనాయుడుకు వైఎస్‌ జగన్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అప్పటి నుంచి పెందుర్తి నియోజకవర్గ బాధ్యతలను చూస్తూ వస్తున్నారు. అయితే ఏమైందో ఏమో ఉన్నట్టుండి పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్టు ప్రకటన వచ్చింది.

అయితే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతున్నట్లుగా అందిన వరుస ఫిర్యాదులతోనే శరగడంను సస్పెండ్‌ చేస్తున్నట్లు పార్టీ అధిష్టానం ఓ ప్రకటనలో అసలు కారణాన్ని వెల్లడించింది.
పలుమార్లు అప్పలనాయుడు గురించి అధిష్టానానికి ఫిర్యాదులు అందాయని.. వీటిపై క్రమశిక్షణ కమిటీ క్షుణ్ణంగా విచారణ జరిపిందని తెలిపింది. సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయం మేరకు శరగడం చిన అప్పలనాయుడిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్టు వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదలైంది.

అయితే అప్పలనాయుడు టీడీపీకి అనుకూలంగా నియోజకవర్గంలో పనిచేస్తున్నారని.. ఈ క్రమంలో వైసీపీకి నష్టం కలిగించేలా కొన్ని పనులు చేసినట్లు సమాచారం. కాగా ఇటీవలే విశాఖ పశ్చిమ నియోజకవర్గం పరిశీలకుడిగా అప్పలనాయుడిని వైసీపీ అధిష్టానం నియమించిన సంగతి తెలిసిందే. ఇంతలోనే ఆయనపై వేటు వేసింది.

కాగా వైసీపీ అధిష్టానం నిర్ణయంతో శరగడం చిన అప్పలనాయుడు తన అనుచరులతో కలసి టీడీపీలో చేరతారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పెందుర్తి నుంచి ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే అన్నపురెడ్డి అదీప్‌ రాజ్‌ పై అప్పలనాయుడు బరిలోకి దిగుతారని టాక్‌ నడుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.