Begin typing your search above and press return to search.

కొత్త కేబినెట్ లో పశ్చిమాన్ని ఏం చేయనున్నారు?

By:  Tupaki Desk   |   28 Sep 2021 8:31 AM GMT
కొత్త కేబినెట్ లో పశ్చిమాన్ని ఏం చేయనున్నారు?
X
ప్రమాణస్వీకారం వేళలోనే.. మంత్రి పదవులు పుటుక్కుమనేది ఎప్పుడో చెప్పేసే దమ్ము ధైర్యం ఏ ముఖ్యమంత్రికి ఉండదు. అందుకు భిన్నంగా.. ప్రభుత్వానికి ఉన్న ఐదేళ్ల పాలనా సమయంలో సగభాగమైన రెండున్నరేళ్లకు మంత్రుల పని తీరు ఆధారంగా మార్పులు ఉంటాయని.. పని చేయని వారిని ఇంటికి పంపుతామని జగన్ స్పష్టం చేయటం తెలిసిందే. కొంతమందిని తీయటం.. మరికొందరిని ఉంచటం లాంటివి కాకుండా.. తర తమ భేదంలేకుండా అందరిని తీసేసి.. సరికొత్తగా ఫ్రెష్ గా కొత్త టీంతో మిగిలిన టర్మ్ ను పాలన చేపట్టాలనన ప్లాన్ లో జగన్ ఉన్నట్లు చెబుతున్నారు. ఇదే సంకేతాల్నిఈ మధ్యన ఏపీ మంత్రి.. జగన్ కు వీర విధేయుడు అయిన బాలినేని కూడా ఇవ్వటంతో ఇప్పుడు కొత్త మంత్రివర్గం మీద చర్చ మరింత జోరుగా మారింది.

ఇలాంటి వేళ ఎవరికి పదవులు దక్కుతాయి? అన్నదిప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. అంతేకాదు.. జిల్లాల వారీగా ఎవరికి ఎన్ని పదవులు దక్కుతాయన్న వాదనలు ఊపందుకున్నాయి. విపక్ష టీడీపీ బలంగా ఉండి.. 2014 ఎన్నికల్లో వైసీపీకి అండగా నిలిచిన జిల్లాల మాటేమిటి? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అన్నింటికి మించి 2014లో టీడీపీకి కంచుకోటగా నిలిచిన ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి కొత్త కేబినెట్ లో దక్కే పదవులు ఎన్ని? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.

అదే సమయంలో కొత్తగా దక్కే మంత్రి పదవుల కోసం పెద్ద ఎత్తున పోటీ నడుస్తోంది. ఎవరికి వారు తమ అర్హతల గురించి చెప్పుకుంటూ.. తమకే అవకాశం లభిస్తుందన్న మాటను వినిపిస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి వస్తే..ప్రస్తుతం ఈ జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్ంయ వహిస్తున్నారు. వీరిలో ఒకరు ఆళ్ల నాని అయితే..మిగిలిన ఇద్దరు తానేటి వనిత.. శ్రీరంగనాథరాజులు ఉన్నారు. క్లీన్ ఇమేజ్ ఉన్న ఆళ్ల నానికి మరోసారి అవకాశం ఉంటుందా? అన్నదిప్పుడు పెద్ద ప్రశ్న. ఎందుకంటే.. ప్రస్తుత మంత్రులు ఎవరికి అవకాశం లభించదన్న నిర్ణయానికి వస్తే.. ఆళ్ల నానికి అవకాశం ఉండంటున్నారు. కానీ.. అలా సాధ్యమవుతుందా? అన్న మాట పలువురి నోటవినిపిస్తోంది.

కరోనావేళ జిల్లాకు చెందిన మిగిలిన మంత్రులతో పోలిస్తే ఆళ్ల నాని బాగా పని చేశారన్న పేరుంది. ఈసారి జిల్లాకు చెందిన ముగ్గురికి బదులుగా ఇద్దరికి మాత్రమే పదవులు ఇచ్చి.. మరో పదవిని కర్నూలు జిల్లాకు అదనంగా ఇస్తారని చెబుతున్నారు. అదే జరిగితే.. ప్రస్తుతం ఉన్న ముగ్గురు మంత్రులు కాస్తా ఇద్దరికే మంత్రి పదవులు దక్కుతాయి. తాజాగా వినిపిస్తున్న మాట ప్రకారం.. శ్రీరంగనాథ రాజుకుబదులుగా నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజుకు పదవి దక్కుతుందని చెబుతున్నారు. ఎందుకంటే.. ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు కావటంతో కలిసివచ్చే అంశంగా చెప్పాలి. గతానికి భిన్నంగా ఈసారి ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజుకు మంత్రి పదవి ఖాయమంటున్నారు. మరి.. ఈ అంచనాలు ఎంతవరకు నిజమవుతాయన్నది మరికొద్ది కాలంలో తేలనుంది.