Begin typing your search above and press return to search.

సీమ ఎత్తిపోతల అడ్డుకోవడానికి కేసీఆర్ రెడీ..జగన్ పట్టుదల!

By:  Tupaki Desk   |   26 July 2020 12:35 PM GMT
సీమ ఎత్తిపోతల అడ్డుకోవడానికి కేసీఆర్ రెడీ..జగన్ పట్టుదల!
X
ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం ‘రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం’ను జగన్ సర్కార్ తలపెట్టింది. కేంద్రం వద్దంటున్నా.. కేసీఆర్ సర్కార్ గగ్గోలు పెడుతున్నా.. కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేసినా ముందుకే వెళుతోంది. రూ.3278 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టుతో రాయలసీమ నాలుగు జిల్లాలతోపాటు.. నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు పుష్కలంగా కృష్ణ జలాలను తరలించే పనులు చేపట్టనున్నారు.

తొలి నుంచి ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తోన్న తెలంగాణ ప్రభుత్వం మరోసారి కృష్ణ రివర్ మేనేజ్ మెంట్ బోర్డుకు ఫిర్యాదు చేసింది. సుప్రీం కోర్టును ఆశ్రయించడానికి రెడీ అయ్యింది.

శ్రీశైలం జలశయానికి అత్యంత సమీపంలో ఏపీ సరిహద్దు ప్రాంతంలో నిర్మించనున్న రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ఈనెల 27న సోమవారం టెండర్ల ఆహ్వానానికి జగన్ సర్కార్ నోటిఫికేషన్ జారీ చేస్తోంది. రోజుకు 3 టీఎంసీల నీటిని తరలించాలని.. రూ.3278 కోట్ల బడ్జెట్ వ్యయంతో నీటిని ఎత్తిపోయడానికి 12 పంపులకు గాను 396 మెగావాట్ల విద్యుత్ అవసరం. ఏపీలోనే ఇదే అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా నిలవనుంది.

ఈ రాయలసీమ ఎత్తిపోతల పేరుతో జగన్ ప్రాజెక్టును పూర్తి చేస్తే భవిష్యత్ లో నాగార్జున సాగర్ ఎడారిగా మారుతుందని.. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలకు సాగు, తాగునీటికి ఇబ్బందులు ఏర్పడుతాయని కేసీఆర్ సర్కార్ ఇప్పటికే అపెక్స్ కమిటీకి ఫిర్యాదు చేసింది. డీపీఆర్ లు సమర్పించాలని కృష్ణ బోర్డు ఆదేశించినా.. ఇది పాత ప్రాజెక్ట్ అంటూ జగన్ సర్కార్ టెండర్లు పిలవడం సంచలనంగా మారింది. దీంతో సుప్రీం కోర్టును ఆశ్రయించాలని తెలంగాణ సర్కార్ యోచిస్తోంది. అయితే సీమకు నీళ్ల విషయంలో వెనక్కి తగ్గకూడదని జగన్ పట్టుదలగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి టెండర్లు పిలవడానికే రెడీ అయినట్లు తెలుస్తోంది. మరి కేసీఆర్ పంతం ఏ మేరకు నెరవేరుతుందనేది చూడాలి.