Begin typing your search above and press return to search.

ఏపీ సీఎంవో ప్ర‌క్షాళ‌న మొద‌లు..కీల‌క అధికారుల‌కు బ‌దిలీలు!

By:  Tupaki Desk   |   30 May 2019 10:29 AM GMT
ఏపీ సీఎంవో ప్ర‌క్షాళ‌న మొద‌లు..కీల‌క అధికారుల‌కు బ‌దిలీలు!
X
ఏపీ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన గంట‌ల వ్య‌వ‌ధిలోనే.. పాల‌నా ప‌ర‌మైన సంస్క‌ర‌ణ‌ల్ని షురూ చేశారు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. ఏపీ ముఖ్య‌మంత్రిగా ఈ మ‌ధ్యాహ్నం ప‌న్నెండున్న‌ర గంట‌ల స‌మ‌యంలో ప్ర‌మాణ‌స్వీకారం చేసిన ఆయ‌న‌.. తొలుత త‌న కార్యాల‌య‌మైన సీఎంవోలోని కీల‌క అధికారుల్ని బ‌దిలీ చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి.

గ‌త ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా వ్య‌వ‌హ‌రించిన స‌తీష్ చంద్ర‌.. ముఖ్య కార్య‌ద‌ర్శి సాయి ప్ర‌సాద్‌.. సీఎం కార్య‌ద‌ర్శులు గిరిజా శంక‌ర్.. రాజ‌మౌళిల‌ను త‌క్ష‌ణం బ‌దిలీ చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేశారు. వారిని సాధార‌ణ ప‌రిపాల‌నా శాఖ‌కు రిపోర్ట్ చేయాల‌ని ఆదేశాలు జారీ చేశారు. ఒకేసారి న‌లుగురు సీనియ‌ర్ ఐఏఎస్ అధికారుల్నిబ‌దిలీ చేస్తూ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎల్వీ సుబ్ర‌మ‌ణ్యం ఉత్త‌ర్వులు జారీ చేశారు. టూరిజం శాఖ ఎండీగా వ్య‌వ‌హ‌రిస్తున్న ధ‌నుంజ‌య్ రెడ్డిని సీఎం అద‌న‌పు కార్య‌ద‌ర్శిగా నియ‌మిస్తూ ఉత్త‌ర్వులు విడుద‌ల చేశారు. ప్ర‌మాణ‌స్వీకారం చేసిన గంట‌ల వ్య‌వ‌ధిలోనే సీఎంవో ప్ర‌క్షాళ‌న తీరు చూస్తే.. జ‌గ‌న్ పాల‌న ఎంత వేగంగా ఉంటుంద‌న్న విష‌యం ఇట్టే అర్థం కాక మాన‌దు.