Begin typing your search above and press return to search.

పెట్టుబడుల సీక్రెట్లు చెబుతున్న జగన్

By:  Tupaki Desk   |   2 Feb 2016 10:13 AM GMT
పెట్టుబడుల సీక్రెట్లు చెబుతున్న జగన్
X
శ్రీకాకుళం పట్టణంలో వైసీపీ అధినేత నిర్వహించిన యువభేరి కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన యువతనుద్దేశించి మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తేనే ఉద్యోగ - ఉపాధి అవకాశాలు వస్తాయని అన్నారు. విభజన వేళ లక్షా 40వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని అన్నారు. చంద్రబాబు ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చారని, అమలు చేయడం మరిచారని విమర్శించారు. 22 నెలల కాలంలో ఉద్యోగాల భర్తీ జరగలేదని అన్నారు. చంద్రబాబువి ఉత్తుత్తి హామీలే తప్ప అమలు చేసేవి కావని ఎద్దేవాచేశారు.

కేంద్రంపై చంద్రబాబు ఒత్తిడి తెస్తే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని అన్నారు. ప్రత్యేక హోదా వస్తే ప్రతీ జిల్లా ఒక హైదరాబాద్‌ అవుతుందని, అప్పుడు సింగపూర్‌ - చైనా - దావోస్‌ లకు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారని, రాయితీ ఉంటే పెట్టుబడులు ఆవే వస్తాయని వివరించారు. ప్రత్యేక హోదా వల్ల ఉత్తరాఖండ్‌ లో 490 శాతం ఉద్యోగాలు పెరిగాయని అన్నారు. తిరుపతి సభలో మోడీ ప్రత్యేక హోదా ఇస్తానని, ఇప్పుడు హోదా మాటెత్తడం లేదని విమర్శించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే 37వేల ఫీల్ట్‌ అసిస్టెంట్ల ఉద్యోగాలు, గోపాలమిత్ర ఉద్యోగాలు పోయాయని వైఎస్సార్‌ సీపీ నేత జగన్‌ మోహన్‌ రెడ్డి విమర్శించారు.

పెట్టుబడులు - కంపెనీ - ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి సీబీఐ - ఈడీ వంటి కేసులు ఎదుర్కొంటున్న జగన్ పెట్టుబడులు ఎలా తేవాలన్న విషయంపై మాట్లాడడం ఆసక్తి రేపింది. ఆయన చెప్పింది వింటే ఆయనలాగే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని టీడీపీ నేతలు అంటున్నారు.