Begin typing your search above and press return to search.

'జై చంద్రబాబు' అన్న జగన్

By:  Tupaki Desk   |   31 Dec 2018 6:25 AM GMT
జై చంద్రబాబు అన్న జగన్
X
జగనే ఏంటి.. జై చంద్రబాబు అనడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? ఇది సెటైరిగ్గాలెండి. ఎప్పుడూ చంద్రబాబు పేరెత్తితే విమర్శలతో విరుచుకుపడే వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత.. ఈసారి కొంచెం భిన్నంగా.. వ్యంగ్యంగా చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధించాడు. పాలకుడిగా విఫలమైన చంద్రబాబు.. ఎలా అతి ప్రచారాలు చేయించుకుని తనను పొగిడించుకోవాలని చూస్తాడో జగన్ తనదైన శైలిలో ఎద్దేవా చేశాడు.

ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లా పలాసలో పర్యటిస్తున్న జగన్.. అక్కడ భారీగా హాజరైన జనాల్లో ఉత్సాహం నింపేలా ప్రసంగం చేశాడు. ‘‘యువనేస్తం అని పేరు పెడతాడు. యువ మోసం చేస్తాడు. 5 లక్షలు ఇళ్లు ఇస్తాడట. అవి కూడా కట్టించి ఇవ్వడట. కేవలం మంజూరు చేస్తాడట. పునాదులకు మాత్రమే డబ్బు అంట. తర్వాత ప్రాధాన్యత క్రమంలో ఇళ్లు కడతారట. ఇళ్లు ఇవ్వకుండానే ఇంటి కింద స్టిక్కర్లు అతికిస్తారట. ఆ స్టిక్కర్లు మనం అతికించుకొని జై చంద్రబాబు, జై చంద్రబాబు అనాలి’’ అంటూ జగన్ వ్యంగ్యాస్త్రాలు విసరగా.. జనాలు నవ్వుతూ కేరింతలు కొట్టారు.

రుణమాఫీ.. డ్వాక్రా సంబంధిత విషయాల్లోనూ జగన్ చంద్రబాబుపై ఇలాంటి సెటైర్లే వేశాడు. "రుణమాఫీ చేయకుండానే చేసేశాను అని చెప్పి రైతులందరూ కేరింతలు కొట్టాలట. జై చంద్రబాబు, జై చంద్రబాబు. ఇవ్వాల్సిన వడ్డీ డబ్బులు ఎగరగొట్టాడు. డ్వాక్రా వాళ్లకు చెవిలో పెద్ద పువ్వుపెట్టాడు. అయినా రుణమాఫీ అయిపోయిందని స్టిక్కర్లు అతికించాలట, జై చంద్రబాబు, జై చంద్రబాబు అని జై కొట్టాల’’ అన్నాడు. చంద్రబాబు ఇలా సొంతడబ్బా కొట్టువోవడమే తప్ప ప్రజలకు పనికొచ్చే పని ఒక్కటీ చేయడం లేదని జగన్ అన్నాడు. కూడా జరగడం లేదని ఎద్దేవా చేశాడు జగన్. నాలుగున్నరేళ్లలో చంద్రబాబు ఏ పనీ చేయకపోయినా చేసినట్టు ఎల్లో మీడియాతో పబ్లిసిటీ ఇప్పించుకొని పబ్బం గడిపాడని జగన్ విమర్శించాడు. ఇంతకాలం కడప స్టీల్ ఫ్యాక్టరీ గురించి ఆలోచించని చంద్రబాబు. సరిగ్గా ఎన్నికలకు 3 నెలల ముందు అక్కడ శంకుస్థాపన చేస్తున్నారని.. ఆయన కుటిలనీతిని ప్రజలు అర్థం చేసుకోవాలని జగన్ విజ్ఞప్తి చేశాడు.