Begin typing your search above and press return to search.

ఇలాంటి వాళ్ళని జగన్ ఉపేక్షించకూడదు

By:  Tupaki Desk   |   11 Dec 2020 5:54 AM GMT
ఇలాంటి వాళ్ళని జగన్ ఉపేక్షించకూడదు
X
అధికారపార్టీ నేత, కార్పొరేషన్ ఛైర్ పర్సన్ గా నియమితులైన ఓ మహిళా నేత వీరంగం సంచలనంగా మారింది. ఆంధప్రదేశ్ వడ్డెర కార్పొరేషన్ ఛైర్ పర్సన్ గా నియమితులైన దేవళ్ళ రేవతి చేసిన గొడవ పార్టీలో సంచలనంగా మారింది. గుంటూరు నుండి విజయవాడకు బయలుదేరిన రేవతి మధ్యలో కాజా టోల్ గేట్ దగ్గర ఫీజు చెల్లించాలి. ఆ ఫీజు కూడా ఎంతంటే కేవలం వంద రూపాయలు. టోల్ ఫీజు చెల్లించకుండా వెళ్ళేందుకు ప్రయత్నించిన రేవతని టోల్ సిబ్బంది నిలిపేశారు.

దాంతో ఒక్కసారిగా ఊనకం వచ్చినట్లుగా తన వెహికల్లో నుండి దిగిన ఛైర్ పర్సన్ టోలు చెల్లించకుండానే వెళ్ళేందుకు ప్రయత్నించారు. తన వాహనానికి అడ్డుగా పెట్టిన బ్యారికేడ్ ను తొలగించారు. అయితే వెంటనే సిబ్బంది అడ్డుకోవటంతో బ్యారికేడ్ ను కింద పడేశారు. అడ్డుకోబోయిన సిబ్బందిని కొట్టారు. టోల్ గేటు దగ్గర రేవతి నానా రచ్చ చేశారు. దాదాపు 15 నిముషాల పాటు రేవతి కారణంగా టోల్ గేటు దగ్గర ట్రాఫిక్ జామ్ అయిపోయింది.

నిజానికి టోల్ గేటు దగ్గర ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు రావాలంటే అందుకు ప్రభుత్వం అనుమతి కావాలి. టోలు ఫీజుల నుండి ఎవరికి మినహాయింపు ఉంటుంది అనే విషయాన్ని ప్రభుత్వం స్పష్టంగా ఓ సర్క్యులర్ జారీ చేస్తుంది. కానీ కొత్తగా ఛైర్ పర్సన్ గా నియమితురాలైన రేవతికి ఇంత చిన్న విషయం తెలియకపోవటమే విచిత్రంగా ఉంది. నిజానికి 100 రూపాయల టోలు ఫీజు చెల్లిస్తే రేవతికే గౌరవంగా ఉంటుంది. అలాంటిది ఇంత చీపుగా వ్యవహరించటంతో సీనియర్ నేతలంతా తలలు పట్టుకున్నారు.

టోలుగేటు దగ్గర ఆమె ఆగటం, వాహనంలో నుండి దిగటం, బ్యారికేడ్ల దగ్గర రచ్చ, సిబ్బందిని కొట్టడం అంతా క్లియర్ గా వీడియోల రూపంలో వైరల్ అయిపోయింది. దీంతో ఇదే విషయం జగన్మోహన్ రెడ్డి దృష్టికి కూడా వెళ్ళింది. రేవతి చేసిన పనిని వైసీపీ నేతలే కాదు చివరకు వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు కూడా తప్పు పడుతున్నారు. ఈమె మీద కచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే అంటూ సోషల్ మీడియాలో ఆగ్రహం పెరిగిపోతోంది.

ఇటువంటి వాళ్ళని జగన్ ఎట్టిపరిస్ధితుల్లోను ఉపేక్షించకూడదంటూ వైసీపీ నేతలే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈరోజు ఈమెను వదిలేస్తే రేపు మరో నేత ఇంతకన్నా ఎక్కువగా రెచ్చిపోతారంటూ సోషల్ మీడియాలో వైసీపీ అభిమానులు మండిపోతున్నారు. ఎలాగూ రేవతిపై టోలుగేటు సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. ఛైర్ పర్సన్ గా బాధ్యతలు తీసుకోకముందే ఇలా రెచ్చిపోతుంటే రేపు బాధ్యతలు తీసుకుంటే ఇంకేమన్నా ఉందా ? రేవతిపై కేసు నమోదైన నేపధ్యంలో జగన్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సిందే.