Begin typing your search above and press return to search.

సచివాయలం విషయంలో మరింత కేర్ ఫుల్ గా ఉండాలి జగన్

By:  Tupaki Desk   |   8 Sep 2020 5:15 AM GMT
సచివాయలం విషయంలో మరింత కేర్ ఫుల్ గా ఉండాలి జగన్
X
ప్రభుత్వ ఉద్దేశం మంచిదే అయినప్పటికీ క్షేత్ర స్థాయిలో చోటు చేసుకునే పరిణామాలు కొన్ని సర్కారుకు కొత్త తలనొప్పుల్ని తెచ్చి పెడుతుంటాయి. ఏపీలో చోటు చేసుకునే కొన్ని పరిణామాల్ని చూస్తే ఈ విషయం అర్థం కాక మానదు. గ్రామ సచివాలయాల్ని ఏర్పాటు చేయాలన్న జగన్ సర్కారు నిర్ణయం ప్రజలకు మేలు చేయటమే కాదు.. కొత్త పాలనా విధానాన్ని తెర మీదకు తీసుకొచ్చింది. గ్రామ సచివాలయం పని చేయటం షురూ అయ్యాక.. సరికొత్త అనుభవం గ్రామస్తులకు ఎదురవుతోంది.

ప్రభుత్వం ప్రజల ముంగిట్లోకి వచ్చినట్లుగా మారటమే కాదు.. పౌరసేవలు చాలా వేగంగా అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. సచివాలయం కాన్సుప్టు బాగానే ఉన్నా.. వాటిని ఏర్పాటు చేసే విషయంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ప్రభుత్వానికి తలనొప్పుల్ని తెచ్చి పెడుతున్నాయి. గ్రామ సచివాలయ భవన ఏర్పాటు కోసం అధికారులు కొన్ని స్థలాల్ని కేటాయించటం.. అవి కాస్తా వివాదాలుగా మారటం ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతోంది.

కొందరి భూములపై అధికార పార్టీకి చెందిన నేతలు సచివాలయాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూమిలేని లక్షలాది మందికి భూమిని ఇచ్చే భారీ కార్యక్రమాన్ని తలపెట్టిన ప్రభుత్వ తీరుకు భిన్నంగా కొందరి అత్యుత్సాహం కారణంగా పలు గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం తూంచెర్ల గ్రామంలో ఇలాంటి ఉదంతమే చోటు చేసుకుంది.

గ్రామంలో సచివాలయ భవనాన్ని.. రైతు భరోసా కేంద్రాన్ని.. వెల్ నెస్ సెంటర్లను ఏర్పాటు చేయాలని భావించారు. అందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ అయ్యాయి. అధికారులు నిర్ణయించిన స్థలాన్ని చదును చేసే ప్రయత్నం చేయగా.. బాధితులు వచ్చి వాగ్వాదానికి దిగారు. ఆ భూమి తమదేనని.. ఆన్ లైన్ లోనూ తమ పేరే ఉందని చెప్పినా అధికారులు వినలేదు. స్థానిక అధికార పార్టీ నేత కారణంగానే ఇలాంటి పరిస్థితి చోటు చేసుకుందంటూ.. మహిళా రైతు లక్ష్మీదేవి విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో.. ఆమె ఆపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

ఈ ఉదంతానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇలాంటి వాటి వల్ల ప్రభుత్వానికి జరిగే డ్యామేజ్ ఎక్కువగా ఉంటుందన్నది మర్చిపోకూడదు. ప్రభుత్వ ఉద్దేశం మంచిదే కావొచ్చు. కానీ.. వివాదాలు.. అభ్యంతరాలు ఉన్న భూముల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటే.. ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.