Begin typing your search above and press return to search.

మంత్రులకు షాకిచ్చిన జగన్

By:  Tupaki Desk   |   14 Nov 2019 7:18 AM GMT
మంత్రులకు షాకిచ్చిన జగన్
X
టీడీపీ హయాంలో ‘జన్మభూమి’ కమిటీల పేరుతో టీడీపీ కార్యకర్తలు చేసిన పనులు గురించి కథలు కథలుగా చెబుతుంటారు. అప్పటి ప్రతిపక్ష వైసీపీ దీన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఈ కమిటీల అవినీతి చివరకు చంద్రబాబు ఓడిపోవడంలో ప్రధాన పాత్ర పోషించాయని విశ్లేషకులు చెబుతుంటారు. అయితే ఇదే తప్పు తాను చేయకూడదని సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు ఏపీ సీఎం జగన్. తాజాగా కేబినెట్ సమావేశంలో మంత్రుల కోరికకు నో చెప్పి షాకిచ్చారు.

ప్రభుత్వ శాఖల్లో వెలువడే ఉద్యోగాలే తక్కువ. కేవలం పదుల సంఖ్యలోనే ఉంటాయి. ఇక ప్రభుత్వంలో ‘ఔట్ సోర్సింగ్’ ఉద్యోగాలు కూడా తక్కువగానే ఉంటాయి. అయితే ఈ ఔట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాల్లో మంత్రులకు అధికారం ఇవ్వాలని వారి నుంచి ప్రతిపాదన వచ్చింది. జిల్లా స్థాయిలో ఇన్ చార్జి మంత్రులు, సచివాలయ స్థాయిలో సంబంధిత మంత్రులకు అధికారం ఇవ్వాలని జగన్ కు ప్రతిపాదన వచ్చింది. వైసీపీ గెలుపులో కీలక పాత్ర పోషించిన వైసీపీ కార్యకర్తలకు ఈ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో అవకాశం ఇవ్వాలని పదిమందికి పైగా మంత్రులు కేబినెట్ సమావేశంలో సీఎం జగన్ ను కోరారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేసిన కార్యకర్తలకు వీటిని ఇచ్చి న్యాయం చేద్దామని సూచించారట. అధికారంలోకి వచ్చాక కూడా కార్యకర్తలకు పనులు చేయకపోతే, అసంతృప్తికి గురి అవుతారని.. దాని వల్ల పార్టీకి నష్టమని జగన్ తో పేర్కొన్నారట..

అయితే మంత్రుల ప్రతిపాదనను సీఎం జగన్ సున్నితంగా తిరస్కరించినట్లు తెలిసింది. మంత్రులకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇస్తే అవినీతి ఆరోపనలు వస్తాయని.. వాటిని డిమాండ్ మేరకు డబ్బులు భారీగా చేతులు మారే అవకాశాలుంటాయని.. దాని వల్ల ప్రభుత్వానికి అవినీతి మరక అంటుందని జగన్ వారించినట్లు తెలిసింది. ప్రభుత్వ శాఖల్లో పదుల సంఖ్యలోనే ఉండే ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో వైసీపీ కార్యకర్తలకు ఇస్తే డబ్బులు చేతులు మారే అవకాశాలు ఉంటాయని.. నిరుద్యోగులు, ప్రజల నుంచి ఉద్యోగాలు దక్కక వైసీపీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని జగన్ నిరాకరించినట్టు తెలిసింది. సచివాలయ ఉద్యోగాల వలే ఔట్ సోర్సింగ్ ను కూడా కలెక్టర్లు, సంబంధిత కార్యదర్శులకే వదిలేద్దామని జగన్ స్పష్టం చేసినట్లు తెలిసింది. సంబంధిత కార్పొరేషన్ కే అధికారం ఇద్దామని జగన్ సూచించినట్టు సమాచారం. దీంతో ఈ ఔట్ సోర్సింగ్ నియామకాలు పారదర్శకంగా శాఖల వారీగా ఉద్యోగాల భర్తీ జరుగుతుందని నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని జగన్ నిర్ణయించినట్టు సమాచారం.

ఇలా పార్టీ కంటే ప్రజలే ముఖ్యమని నిరుద్యోగులకు అవకాశం కల్పించాలని జగన్ తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు కురుస్తున్నాయి. సొంత పార్టీ కార్యకర్తలు, మంత్రులను కూడా పక్కనపెట్టి అర్హులకు ఉద్యోగాలు ఇవ్వాలన్న జగన్ నిర్ణయం సంచలనంగా మారింది.