Begin typing your search above and press return to search.

హోదాకు క్లైమాక్స్ సెట్ చేసిన జ‌గ‌న్‌!

By:  Tupaki Desk   |   4 March 2018 7:59 AM GMT
హోదాకు క్లైమాక్స్ సెట్ చేసిన జ‌గ‌న్‌!
X
విభ‌జ‌న‌తో ఏపీకి జ‌రిగిన న‌ష్టాన్ని హోదాతో పూడుస్తామ‌న్న మాట‌కు భిన్నంగా గ‌డిచిన నాలుగేళ్ల‌లో జ‌రిగిన తంతు ఏపీ ప్ర‌జ‌ల‌కు బాగానే తెలుసు. హోదా మీద పిల్లి మొగ్గ‌లు వేసినోళ్లు ఎంద‌రో. కానీ.. మొద‌ట్నించి హోదా మీద ఒకే వాద‌న‌ను వినిపిస్తున్న నేత ఎవ‌రైనా ఉన్నారంటే అది.. ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మాత్రమే. ఏపీకి ఏం ఇచ్చినా.. ఇవ్వ‌కున్నా హోదా మాత్రం త‌ప్ప‌నిస‌రిగా ఇవ్వాల‌న్న‌డిమాండ్ ను మొద‌ట్నించి వినిపిస్తున్న జ‌గ‌న్‌.. హోదా మీద ఆయ‌నీమ‌ధ్య చేసిన ప్ర‌క‌ట‌న‌తో ఒక్క‌సారిగా వేడి రాజుకుంది.

పార్ల‌మెంటు స‌మావేశాల్లో హోదాపై కేంద్రం నిర్ణ‌యం తీసుకోకుంటే.. తాము అవిశ్వాస తీర్మానం పెడ‌తామ‌ని.. త‌మ ఎంపీలు రాజీనామా చేస్తారంటూ ఆయ‌న ప్ర‌క‌టించారు. జ‌గ‌న్ నోటి వెంట ఈ మాట వ‌చ్చినంత‌నే.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అలెర్ట్ కావ‌ట‌మే కాదు.. ప్ర‌త్యేక హోదా మీద గ‌ళాన్ని స‌వ‌రించుకున్నారు. గ‌తంలో తాను వేసిన కుప్పిగంతులు మ‌రిచి.. హోదా మీద ఎక్క‌డ లేని ప్రేమ‌ను ఒల‌క‌బోస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఢిల్లీలో హోదా మీద త‌మ గ‌ళాన్ని వినిపించేందుకు జ‌గ‌న్ త‌న పార్టీ నేత‌ల‌కు దిశానిర్దేశం చేశారు. హోదా కోసం చేస్తున్న పోరు క్లైమాక్స్ కు చేరుకుంద‌ని.. ప్యాకేజీతో మోసం చేయొద్దు.. ప్ర‌త్యేక హోదా మ‌న హ‌క్కు అన్న నినాదంతో ఢిల్లీ వీధులు ద‌ద్ద‌రిల్లాల‌ని.. పార్టీ ముఖ్య‌నేత‌లు మొద‌లుకొని అన్ని స్థాయి నేత‌లు ఢిల్లీకి త‌ర‌లి వెళ్లాల‌ని.. హోదా విష‌యంలో కేంద్రం మీద ఎన్ని ర‌కాలుగా వీలైతే అన్ని ర‌కాలుగా ఒత్తిడి తీసుకురావాల‌న్నారు.

హోదా సాధ‌న కోసం చేస్తున్న పోరాటాల్లో భాగంగా ఈ నెల ఒక‌టిన క‌లెక్ట‌రేట్ల ద‌గ్గ‌ర ధ‌ర్నా నిర్వ‌హించిన విష‌యాన్ని గుర్తు చేశారు. ఈ నెల 5న (సోమ‌వారం) మ‌హా ధ‌ర్నాను ఢిల్లీలో చేప‌డ‌తామ‌ని.. విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం ఏపీకి రావాల్సిన‌వ‌న్నీ ఇవ్వాల‌ని.. ప్ర‌ధాని ఇచ్చిన హామీల్ని హ‌క్కుగా ఇవ్వాల్సిందేన‌న్నారు.

హోదా మీద పార్టీ చేస్తున్న పోరాటంలో భాగంగా.. యావ‌త్ పార్టీ ఢిల్లీలో ఉంటుంద‌న్నారు. తాజాగా పార్టీ ఎంపీల‌కు.. నేత‌ల‌కు దిశానిర్దేశం చేసిన సంద‌ర్భంలో మాట్లాడుతూ.. హోదా మీద పార్టీ చేస్తున్న పోరాటాన్ని ఢిల్లీ వీధుల్లో ఉధృతంగా చేయాల‌నిజ‌గ‌న్ పిలుపునిచ్చారు.

పార్ల‌మెంటులో అవిశ్వాస తీర్మానం పెట్ట‌టానికి త‌మ‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని.. కాకుంటే బాబు పార్ట‌న‌ర్ ప‌వ‌న్ క‌ల్యాణ ఇచ్చిన స‌ల‌హా ప్ర‌కారం అవిశ్వాసానికి మ‌ద్ద‌తుప‌లికే బాధ్య‌త ఆయ‌న చూసుకోవాల‌న్నారు. బాబు వ‌ద్ద‌నున్న 20 మంది ఎంపీలు అవిశ్వాస తీర్మానికి మ‌ద్ద‌తు ఇచ్చేలా బాధ్య‌త తీసుకోవాల‌ని బాబు పార్ట‌న‌ర్ ప‌వ‌న్ ను కోరారు. హోదా సాధ‌న కోసం తానేం చేయ‌టానికైనా సిద్ధ‌మ‌ని తేల్చి చెప్పిన జ‌గ‌న్‌.. ఈ నెల 21 నుంచి ఏప్రిల్ ఐదో తేదీ వ‌ర‌కు వేచి చూస్తామ‌ని.. ఆ త‌ర్వాత ఏప్రిల్ 21న త‌మ ఎంపీల చేత రాజీనామా లేఖ ఇప్పించేందుకు తాను సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించారు. స్పీక‌ర్ ఫార్మాట్ ఓ త‌మ రాజీనామా లేఖ‌లు ఉంటాయ‌న్నారు. పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి 183 కింద స్పీక‌ర్ ఫార్మెట్ లో ప్ర‌త్యేక హోదా కింద చ‌ర్చ‌కు ప్ర‌య‌త్నిస్తున్ట్లుగా చెప్పారు. త‌మ పార్టీ ఎంపీలు ప‌ద‌వుల్ని కోల్పోవ‌టానికి సిద్ధ‌మ‌వుతుంటే.. ఏపీ అధికార‌ప‌క్షం మాత్రం మాట‌ల‌తో టైంపాస్ చేస్తుంద‌న్న ఆరోప‌ణ చేశారు. హోదా మీద పోరాటం ఉధృతంగా సాగుతున్న వేళ‌.. బాబు కూడా నిర‌స‌న‌ల‌తో భాగ‌స్వామ్యం కావాల‌న్న మాట జ‌గ‌న్ నోటి వెంట వ‌చ్చింది. హోదా సాధ‌న‌లో భాగంగా కేంద్రంలోని బాబు మంత్రులు బ‌య‌ట‌కు వ‌చ్చేయాల‌న్నారు. బ‌య‌ట‌కు రావ‌ట‌మే తొలి అస్త్రంగా ఉండాల‌న్నారు. కేంద్ర మంత్రి ప‌ద‌వి నుంచి వైదొలిగి.. ఎంపీ ప‌ద‌వుల‌కు రాజీనామా చేయాల‌న్నారు. హోదా మీద పోరాడేందుకు ఢిల్లీకి త‌ర‌లి వెళుతున్న పార్టీ నేత‌ల‌కు జ‌గ‌న్‌.. బెస్ట్ ఆఫ్ ల‌క్ గా చెప్పారు. అధినేత చెప్పిన బెస్టాఫ్ ల‌క్ నేత‌లు.. కార్య‌క‌ర్త‌ల్లో మ‌రింత ఉత్సాహాన్ని పెంచింది.