వైసీపీ అధినేత - ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ప్రకటనకు వాస్తవ రూపం దాల్చేలా ముందుకు సాగుతున్నారు .ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన పది రోజుల వ్యవధిలోనే...పది సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.
40 ఏళ్ల అనుభవం అని డబ్బా కొట్టుకునే వ్యక్తి చేయలేనిది కొత్త ముఖ్యమంత్రి చేసి చూపించారు. డైనమిక్ గా దూసుకుపోతున్న జగన్ పది రోజుల్లో తీసుకున్న దాదాపు ప్రతి నిర్ణయం సంచలనమే. ప్రమాణస్వీకారానికి ముందే...తన కార్యాచరణ మొదలుపెట్టిన జగన్ ఈ క్రమంలో తీసుకున్న నిర్ణయాలు అన్నివర్గాలను ఆకర్షిస్తున్నాయి. అదే సమయంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారాయి.
జగన్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఎలాంటి భేషజాలు లేకుండా పొరుగు రాష్ట్ర సీఎం కేసీఆర్ ను కలిశారు. అనంతరం ఆర్థిక భారంతో అప్పుల ఊబిలో నుంచి రాష్ట్రాన్ని బయటపడవేసేందుకు తన ప్రయత్నంగా ప్రధాని మోదీని కలిశారు. ఇక సీఎం అయిన తర్వాత తన కేబినెట్లో సామాజిక న్యాయం పాటించారు. ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి హోదా ఇచ్చారు. రెండున్నరేళ్ల తర్వాత దాదాపు 90% మంత్రులను మారుస్తామని అసంతృప్తులకు అవకాశం ఇస్తానని ప్రకటించారు. ఉద్యోగులకు ఐఆర్ ఇచ్చి వారిని తనవైపునకు తిప్పుకొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగుల మన్ననలు పొందడంతో పాటుగా చరిత్రలో నిలిచిపోయారు. ఉప్పు నిప్పులా ఉన్న తెలంగాణ సంబంధాల విషయంలో నిరుపయోగంగా పడి ఉన్న హైదరాబాద్ లోని భవనాలను అందించారు. తద్వారా కలిసి మెలిసి సాగాలనే సందేశాన్ని పంపించారు.
రివర్స్ టెండరింగ్ తో అవినీతిని దూరం చేసేందుకు జగన్ ముందుకు సాగారు. రాబోయే టెండర్లకు జ్యుడిషియల్ అనుమతి తప్పనిసరి చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వాలు నడిచే మద్యం ఆదాయంపై ఆధారపడకుండా మహిళలకు ఇచ్చిన మాటే ముఖ్యమని మద్య నిషేధం పై ముందుకు సాగుతున్నారు. అధికారుల్లో డైనమిక్ నిర్ణయాలు తీసుకోవడంలో భాగంగా కీలకమైన వారికి పదవులు ఇచ్చారు. సీబీఐకి చంద్రబాబు నో ఎంట్రీ అని డోర్లు పెట్టగా....తప్పు చేయనపుడు భయం ఎందుకని ఆ జీవోను ఉపసంహరించారు. నాలుగున్నర ఉద్యోగాలకి నోటిఫికేషన్లు - ఫించన్లు పెంపు - ఆశా వర్కర్లకు జీతాల పెంపు - జర్నలిస్టుల ఆరోగ్య బీమా వంటివి అమలు చేస్తూ - ప్రజల నమ్మకం నిలబెడ్తున్నారు. తన గెలుపులో రైతులది కీలక పాత్ర కాబట్టి వారికోసం 12,500 పెట్టుబడి సహాయం అందించేందుకు సిద్దమయ్యారు. భూ సమస్యలు - పట్టాదారు పుస్తకాలు వంటివి సమస్యలుగా కాకుండా గ్రామ సచివాలయం ప్రారంభించనున్నారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామన్నారు. ఇసుక విధానం రద్దు చేసేశారు. కార్డు దారుల ఇంటికే బియ్యం - నిత్యావసరాలు సిద్ధం చేశారు. ఇలా జగన్ ప్రతి నిర్ణయం సంచలనమే.